Share News

Pawan Kalyan: లోకేష్ సభలో లేకపోవడం లోటుగా ఉంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Dec 16 , 2025 | 09:07 PM

గత వైసీపీ పాలనలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, దుర్మార్గాలు అన్నీఇన్నీ కావని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సాగించిన వికృత చేష్టల్ని ప్రజలకు గుర్తు చేస్తున్నానని సీఎం అన్నారు.

Pawan Kalyan: లోకేష్ సభలో లేకపోవడం లోటుగా ఉంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Chandrababu Naidu Criticism

అమరావతి, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రౌడీయిజం, అకృత్యాలు, తప్పుడు ప్రచారాలు జరిగాయని ఆరోపించారు. కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నసీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అంశాలపై ప్రసంగించారు. వైవేకానంద రెడ్డి మరణం గురించి మాట్లాడిన చంద్రబాబు, మొదట గుండెపోటుతో మరణించారని చీటి వచ్చినా, ఆయన కుమార్తె అనుమానం వ్యక్తం చేయడంతో పోస్ట్‌మార్టం చేయించామని చెప్పారు. కానీ సాయంత్రానికి డ్రామా మొదలై, తెల్లవారే సరికి సాక్షి పత్రికలో 'నారా వారి రక్త చరిత్ర' అని వార్త వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అలాంటి తప్పుడు ప్రచారం లేకుండా నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఉంటే తాను ఎన్నికల్లో ఓడిపోయి ఉండేవాడిని కాదని చంద్రబాబు అన్నారు. అలిపిరి పేలుడు ఘటనను గుర్తు చేస్తూ, ఎస్పీని తన వెంట రానివ్వకుండా నేరస్థులను పట్టుకోమని చెప్పానని, తన డ్యూటీని మరచిపోలేదని చెప్పారు. 'నా ఆడబిడ్డల జోలికి వస్తే అదే రోజు వాళ్లకు ఆఖరి రోజు... కావాలంటే టెస్ట్ చేయండి, నా సంగతి చూపిస్తా' అంటూ కఠిన హెచ్చరిక చేశారు.

amaravati


రాష్ట్రంలో గంజాయిని డ్రోన్లతో గుర్తించి ఏజెన్సీల నుంచి తొలగించానని, ఒకప్పుడు రౌడీలను రాష్ట్రం నుంచి బయటకు పంపానని, ఇప్పుడు కూడా అదే కట్టుబాటుతో ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ఇటీవల మరణించిన ఓ పాస్టర్ ఆక్సిడెంట్‌లో చనిపోయినా ప్రభుత్వం చంపిందని తప్పుడు ప్రచారం చేశారని, సీసీటీవీ ఫుటేజ్‌తో నిజం బయటపడిందని వివరించారు.

వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో 'లేడీ డాన్‌లు' తయారయ్యారని, మనుష్యులను చంపేశారని, రాష్ట్రం ఎంత పతనావస్థకు దిగజారిందో అనిపించిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు.


ఈ కార్యక్రమంలో ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఈ పండుగకు మంత్రి లోకేష్ గారు హాజరు కాకపోవడం లోటుగా ఉంది. ఇంత మెగా ఈవెంట్ కానీ, నాడు మెగా డీఎస్సీ కానీ లోకేష్ గారి ఆలోచనే. లోకేష్ గారికి అభ్యర్థులు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా' అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.


Also Read:

అంతర్జాతీయ వేదికపై తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి..

కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులపై సీఎం ప్రశంసలు

Updated Date - Dec 16 , 2025 | 09:14 PM