Share News

CM Chandrababu : ఇక ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లోనే

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:18 AM

ఇకపై ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు వాట్సాప్‌లోనే అందించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

CM Chandrababu : ఇక ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లోనే

  • ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం ఉండొద్దు

  • యూజర్‌ ఫ్రెండ్లీగా సేవలు అందించాలి

  • వాట్సాప్‌ గవర్నెన్స్‌పై మంత్రులు దృష్టి పెట్టాలి

  • తొలి వారంలోనే 2.64 లక్షల లావాదేవీలు

  • వాట్సాప్‌ గవర్నెన్స్‌ - మన మిత్రపై సీఎం సమీక్ష

  • ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం కావాలి

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఇకపై ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు వాట్సాప్‌లోనే అందించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల సదస్సులో ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌ - మన మిత్ర’పై మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో పనుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండకూడదని, ఆ పనులన్నీ వాట్సా్‌పలోనే జరిగిపోవాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవ్వాలని చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నీ ప్రజలకు యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలని, తమ శాఖల్లో సర్వర్‌ల కెపాసిటీని పెంచుకుని వేగవంతమైన పాలన అందించాలని ఆదేశించారు. మంత్రులు కూడా తమ తమ శాఖల్లో వాట్సాప్‌ గవర్నెన్స్‌ అమలు చేయడంపై దృష్టి సారించాలని, వస్తున్న ఫలితాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని చెప్పారు. గతనెల 30న ప్రారంభించిన వాట్సాప్‌ సేవల ద్వారా వారం రోజుల్లోనే 2.64 లక్షల లావాదేవీలు జరగడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలలో వాట్సాప్‌ గవర్నెన్స్‌పై సంతృప్తి ఎలా పెరుగుతుందో కూడా అధ్యయనం చేయాలని అన్నారు.


మరిన్ని సేవలు అందుబాటులోకి తేవాలి

వాట్సాప్‌ గవర్నెన్స్‌ సత్ఫలితాలు ఇస్తున్నందున.. ప్రస్తుతమున్న 161 సేవలతో పాటు రాబోయే 45 రోజుల్లో 500 సేవలు అందుబాటులోకి తేవాలని కార్యదర్శులకు సీఎం ఆదేశించారు. వచ్చే ఆర్నెల్లలో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సంపూర్ణంగా అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలకు వాట్సాప్‌ గవర్నెన్స్‌కు ఎంతగా అందాలంటే.. ఏదైనా బిల్లు చెల్లింపు జరగలేదంటే, ఆ బిల్లును ఆ వ్యక్తి స్కాన్‌ చేసి వాట్సాప్‌ గవర్నెన్స్‌లో పెడితే పరిష్కారమయ్యే స్థాయికి తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బిల్లులు కూడా స్కాన్‌ చేస్తే చెల్లింపులు జరిగేలా చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి ఏ పని కావాలన్నా ప్రజలు వాట్సాప్‌ గవర్నెన్స్‌లోకి వెళ్లేంతగా అలవాటు చేయాలని సీఎం చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్‌ ట్రాకింగ్‌ కూడా చూసుకునే సేవలు దీని ద్వారా అందుబాటులోనికి తెస్తామన్నారు.


ధ్రువపత్రాలన్నీ వాట్సాప్‌లోనే: మంత్రి లోకేశ్‌

ప్రభుత్వ శాఖల ధ్రువపత్రాలన్నీ వాట్సా్‌పలోనే జారీ చేస్తామని ఐటీ, మానవ వనరులు, ఆర్టీజీఎస్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. త్వరలోనే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ రేషన్‌ కార్డులను రాష్ట్రంలో జారీ చేస్తామన్నారు. ప్రజలకు సీమ్‌లెస్‌ సర్వీసులు అందజేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, వాట్సాప్‌ గవర్నెన్స్‌ ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న అత్యున్నత వేదికని చెప్పారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌కు సంబంధించి శాఖలన్నీ తమ డేటాను ఆర్టీజీఎస్‌ డేటాలేక్‌కు అనుసంధానం చేయాలని, వాట్సాప్‌ ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఇది తప్పనిసరి అని లోకేశ్‌ స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చాలా కీలక ప్రక్రియ అన్నారు. అధికారులు తమ శాఖల్లో ఈ దిశగా సాంకేతికపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో అన్ని సేవలూ ఆన్‌లైన్‌ చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమన్నారు.


వాట్సాప్‌ గవర్నెన్స్‌లోకి టీటీడీ

వాట్సాప్‌ గవర్నెన్స్‌లోకి టీటీడీ సేవలను తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అవసరమైతే కేంద్రంతో సంప్రదించి రైల్వే టికెట్లు కూడా వాట్సాప్‌ గవర్నెన్స్‌లోకి తీసుకువస్తామన్నారు. సినిమా టికెట్లు అందించే సదుపాయాన్ని కూడా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇవే కాకుండా ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కూడా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారానే సేకరించాలని సీఎం స్పష్టం చేశారు.

Updated Date - Feb 12 , 2025 | 04:19 AM