CM Chandrababu : మంచి ప్రభుత్వాన్ని మార్చేస్తే నష్టం !
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:59 AM
‘‘రాష్ట్ర విభజన తర్వాత మనం ఒక పునాది వేశాం. అది ఒక స్థాయికి చేరకముందే ప్రభుత్వం మారిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన విధ్వంస పాలనతో ఆ పునాదిని నేలమట్టం చేసింది.

నవ్యాంధ్ర భవితకు నాడు పునాది వేశాం
సర్కారు మారడంతో సున్నాతో ప్రయాణం
రెండోసారీ గెలిస్తే రాష్ట్రం ఎంతో ఎత్తుకెళ్లేది
ఉమ్మడి ఏపీలో వరుసగా పదేళ్లు ఉన్నాం
నాడు మంచి ప్రగతిని చూపించగలిగాం
ప్రభుత్వాలు పదేపదే మారే, మారని రాష్ట్రాల మధ్య ప్రగతిలో చాలా వ్యత్యాసం
దీనిపై నివేదిక ఇవ్వాలని నిర్మలకు చెప్పా
టీడీపీ నేతలకు వివరించిన చంద్రబాబు
దావోస్ పర్యటన పట్ల సంతృప్తి
పాలనాదక్షతపై నమ్మకంతో కంపెనీలు రాబోతున్నాయి.. అధికారులతో సీఎం
అమరావతి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒకసారి మారిపోతుంటే అభివృద్ధికి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత మనం ఒక పునాది వేశాం. అది ఒక స్థాయికి చేరకముందే ప్రభుత్వం మారిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన విధ్వంస పాలనతో ఆ పునాదిని నేలమట్టం చేసింది. ఇప్పుడు మళ్లీ మనం సున్నా నుంచి మొదలు పెట్టాల్సి వస్తోంది. మన ప్రభుత్వానికి కొనసాగింపు ఉండి ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా ఎత్తున ఉండేది’ అని ఆయన అన్నారు. దావోస్ నుంచి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన, అక్కడి నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం ఉండవల్లి చేరుకున్నారు. తనను కలవడానికి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇంటి వద్ద కొద్దిసేపు మాట్లాడారు. ‘ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నేను కలిశాను. ప్రభుత్వాలకు కొనసాగింపు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో ఎలా ఉన్నాయో... మారిపోతున్న చోట అభివృద్ధి ఎలా ఉందో పోల్చుతూ ఒక రిపోర్ట్ కార్డ్ తయారు చేయాలని నేను ఆమెను కోరాను. దీనివల్ల ప్రజలకు కూడా కొంత అవగాహన వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో మనం పదేళ్లు ఉండటం వల్ల మంచి ప్రగతి చూపించగలిగాం.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మనకు అటువంటి అవకాశం దొరకలేదు. ఒక్క మన రాష్ట్రం అని కాకుండా మొత్తం దేశం అంతా ఎలా ఉందో కేంద్ర ప్రభుత్వం ఒక విశ్లేషణ తయారు చేస్తే ప్రజలకు బాగా అర్థం అవుతుంది. ఇటువంటి విషయాలపై ప్రజలకు అవగాహన కలిగించడం అవసరం’’ అని ఆయన అన్నారు. దావోస్ సమావేశాలు బాగా జరిగాయని, రాష్ట్రాన్ని బాగా మార్కెటింగ్ చేయగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనేక పెద్ద సంస్థల్లో భారతీయులు ప్రముఖ స్థానాల్లో ఉండటం తనకు కనిపించిందని, అమెరికా, యూర్‌పల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకొని పెద్ద పెద్ద కంపెనీల్లో భారతీయులు బాగా ఎదుగుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కింది స్థాయిలో ఉన్నవారు ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఎలా సృష్టించాలన్నదానిపై తాను దృష్టి పెట్టానని, ఇప్పటికే బాగా ఎదిగినవారిని ప్రోత్సహించి వారి ద్వారా కొంత మందికైనా అవకాశాలు కల్పిస్తే మార్పు త్వరగా వస్తుందని ఆయన చెప్పారు. పార్టీ సభ్యుల్లో ఆర్థికంగా దిగువన ఉన్నవారు, డ్వాక్రా సంఘాల సభ్యులు, యువతకు అవకాశాలు కల్పించాల్సి ఉందని, చిన్న తరహా పరిశ్రమలు... వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయన్నారు.
కాగా, తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దావోస్‌లో బాగా కలిసి వస్తే, ఏపీకి చంద్రబాబు ఇమేజీ ఉపయోగపడుతోందని పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. దావోస్‌లో మిగిలిన వారంతా భారీ కోట్లు, స్వెట్టర్లు వేసుకొని తిరుగుతుంటే ఒక్క చంద్రబాబు మాత్రమే తన డ్రెస్ కోడ్ మార్చకుండా ఉండగలిగారని, ఆయన ఎంత గట్టి మనిషో దీనిని బట్టి అందరికీ తెలిసిపోయిందని ఒక నేత ప్రశంసించారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, నక్కా ఆనందబాబు, తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య, శ్రావణ్ కుమార్, రామాంజనేయులు, భాష్యం ప్రవీణ్ తదితరులు ఉన్నారు. అంతకుముందు దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రికి ఉండవల్లి నివాసం వద్ద పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అధికారులతో ముఖ్యమంత్రి విడిగా సమావేశం అయ్యారు. దావోస్‌లో తాము జరిపిన చర్చల్లో రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపిన సంస్ధలతో తదుపరి చర్చలు ఎలా కొనసాగించాలో ఆయన వారికి కొన్ని సూచనలు చేశారు.
‘కంపెనీల ప్రతినిధులు వస్తారు... సిద్ధంగా ఉండండి’
‘‘పలు దేశాల ప్రతినిధులు, అనేక కంపెనీల సీఈవోలు, కొన్ని దేశాల మంత్రుల బృందాలు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. సంబంధిత శాఖల అధికారులు దీనికి సన్నద్ధంగా ఉండాలి. మౌలిక సదుపాయాలు, మారిటైం హబ్, ఏఐ యూనివర్సిటీ, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, డేటా కేంద్రాలు, ఆహార శుద్ధి రంగం, కోర్ ఇంజనీరింగ్, తయారీ రంగం, ఔషధ రంగం, పునరుత్పాదక ఇంధనం, ఇ-కామర్స్, పరిశోధన, విద్యా రంగానికి సంబంధించిన కంపెనీల అధికారులతో నేను దావో్‌సలో చర్చలు జరిపాను. వచ్చే ఆరు నెలల కాలంలో ఇవి సాకారం కావడానికి మనం పట్టుదలతో పనిచేయాలి’’ అని అధికారులకు ఆయన తెలిపారు. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేశారు. దిగ్గజ కంపెనీల సీఈవోలు, ఇతర ప్రముఖులతో జరిగిన చర్చల తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కంపెనీలతో ని రంతరం సంబంధాలు నిర్వహిస్తూ వాటి అవసరాలు ఏమిటో తెలుసుకొని తదనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని, పెట్టుబడుల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేవరకూ పట్టువీడవద్దని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం విజయానంద్ తన నివాసంలో తన కార్యాల య అధికారులతో సమావేశం నిర్వహించారు.
పాలనాదక్షతకు అదే ప్రమాణం సమస్యల నివృత్తే మా లక్ష్యం: బాబు
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే పాలనా దక్షతకు నిదర్శనమని సీఎం చంద్రబాబు అన్నారు. దావోస్ సదస్సు సందర్భంగా ఒక జాతీయ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సకు మారాం. ఐటీ నుంచి ఏఐకి వేగంగా వచ్చాం. రియల్ టైమ్‌లో ప్రజల నుంచి సమస్యలను విని, సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నాం. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించడంపై దృష్టి సారించాలని పాలనా యాంత్రాంగాన్ని ఆదేశిస్తున్నాం’’అని చంద్రబాబు తెలిపారు. తన పాలనా దక్షతపై నమ్మకం ఉంచి కంపెనీలు పెట్టుబడులతో ఏపీకి వస్తాయన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..
Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..
Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట
Read Latest AP News and Telugu News