Share News

CM Chandrababu : 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం!

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:01 AM

రాష్ట్రమంతా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు పెడుతున్నామని, త్వరలో మెగా డీఎస్సీతో 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు.

CM Chandrababu : 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం!

  • 4 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నాం

  • రాష్ట్రమంతా స్కిల్‌ సెంటర్లు పెడుతున్నాం

  • త్వరలో మెగా డీఎస్సీ ప్రకటించనున్నాం

  • కూటమి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలివీ

  • వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనది

  • కలిసికట్టుగా పనిచేసి కూటమిని గెలిపించండి

  • ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం

అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి సుమారు రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి, 4 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రమంతా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు పెడుతున్నామని, త్వరలో మెగా డీఎస్సీతో 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు. ఇవన్నీ 8 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలని, వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా నాయకులంతా సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో ఆదివారం సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘ప్రతి ఎన్నికా మనకు పరీక్షవంటిదే. మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ ఓటర్లను చైతన్యపర్చాలి. ఐదేళ్ల విధ్వంసపాలనలో గాడితప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం’ అన్నారు. ఎన్నికలకు 10 రోజుల సమయం మాత్రమే ఉందని, మూడు పార్టీల నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియామావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పనిచేయాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఈ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ మెరుగ్గా ఉండాలన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 03:01 AM