TTD: వేదం.. వివాదం
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:46 AM
టీటీడీ చేపట్టిన వేదపారాయణ పోస్టుల ఇంటర్వ్యూల్లో తొలిరోజే వివాదం మొదలైంది. 700 పోస్టులకుగాను తిరుపతిలోని శ్వేతలో సోమవారం మొదలైన ఇంటర్వ్యూలు 16వ తేదీ వరకు జరగనున్నాయి.
తిరుపతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): టీటీడీ చేపట్టిన వేదపారాయణ పోస్టుల ఇంటర్వ్యూల్లో తొలిరోజే వివాదం మొదలైంది. 700 పోస్టులకుగాను తిరుపతిలోని శ్వేతలో సోమవారం మొదలైన ఇంటర్వ్యూలు 16వ తేదీ వరకు జరగనున్నాయి. తొలిరోజునే ఇంటర్వ్యూలలో అకడమిక్ ఎక్స్‌టర్నల్ అబ్జర్వర్‌గా నియమితులైన ప్రొఫెసర్ సుదర్శన్ శర్మపై టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవోలతో పాటు పాలకమండలి సభ్యులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఆయన ఓవిశ్వవిద్యాలయంలో వైస్‌చాన్సలర్‌గా పనిచేసిన సమయంలో ఆర్థిక అక్రమాలు, పరిపాలనా లోపాలు, అవినీతికు సంబంధించిన అంశాలపై టీటీడీ విజిలెన్స్ నిగ్గుతేల్చిన నివేదికలను, ఆయనపై వచ్చిన ఆరోపణలను ఆధారాలతో సహా పాలకమండలికి పంపారు. ఇలాంటి నేపథ్యం కలిగిన వ్యక్తిని అబ్జర్వర్‌గా నియమించడం అనుచితమని భావిస్తున్నారు. ఉజ్జయిని వేద విద్యా ప్రతిష్ట వైస్ చైర్మన్‌గా ఉన్న సమయంలో కూడా పలు అక్రమాల ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. ప్రస్తుత ఇంటర్వ్యూలలో కూడా తమిళ - తెలుగు అనే భేదాన్ని ప్రోత్సహిస్తూ, వేదానికి భాషాపరమైన విభేదం ఉన్నట్టుగా చూపించి, బ్రాహ్మణుల్లో ఆందోళన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సుదర్శన్ శర్మను అబ్జర్వర్‌గా తప్పించి, వేద జ్ఞాన ఆధారంగానే ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోరుతున్నారు.
అలిపిరి నడకదారిలో అపచారం
ఉప్పుచేపలు తిన్న పారిశుధ్య కార్మికులు
విఽధుల నుంచి తొలగించిన టీటీడీ
తిరుమల, నవంబరు10 (ఆంధ్రజ్యోతి): తిరుమల కాలినడక మార్గంలో పారిశుద్ధ్య కార్మికులు భోజనంలో ఉప్పుచేపలను తింటున్న వీడియో వైరల్ కావడంతో, వారిని టీటీడీ విధుల నుంచి తొలగించింది.
ఆదివారం మధ్యాహ్నం అలిపిరి మెట్ల మార్గంలో పారిశుధ్యకార్మికుంలు కొందరు భోజనాలు చేస్తున్నారు. వారు ఉప్పుచేపలు తింటున్నారని గుర్తించిన కొందరు భక్తులు పవిత్రమైన తిరుమల నడకమార్గంలో ఎలా తింటారంటూ ప్రశ్నిస్తూ దానిని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. దీంతో టీటీడీ హెల్త్ విభాగం తిరుపతికి చెందిన రామస్వామి, సరసమ్మ అనే ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య ఉద్యోగులను విధులనుంచి తొలగించడంతోపాటూ, తిరుమల 2 టౌన్ పోలీస్టేషన్‌లో ఈ సంఘటనపై ఫిర్యాదు చేసింది.