TTD Board Chairman BR Naidu: టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:40 PM
ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని టీటీీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
తిరుమల, సెప్టెంబర్ 16: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ధార్మిక సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇకపై అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు.
మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల వేళ.. వాహన సేవను తిలకించెందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పాలక మండలి నియమించిన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు వారికీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అదే రోజు.. 2026 క్యాలెండరు, డైరీలను ఆయన ఆవిష్కరిస్తారని చెప్పారు. ఇక సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం యాత్రి సముదాయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు.
ఇక ఇస్రో సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. అలాగే తిరుమలలో విద్యుత్, పుష్పాలంకరణను అత్యంత సుందరంగా చేపడుతున్నట్లు వివరించారు. గరుడ సేవ రోజు.. మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.
ఈ బ్రహ్మోత్సవాలకు ఐదు వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజులు.. సిపార్సు లేఖలను అనుమతించబోమన్నారు. ఆ రోజుల్లో ఈ లేఖలను రద్దు చేశామని చెప్పారు. దాదాపు 8 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్‌గా పెట్టుకున్నామన్నారు. తిరుపతిలో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు ఎల్ఈడి స్క్రీన్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలకు కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇక శ్రీవారి మెట్టు దారిలో 24 గంటలు భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. ముంబాయికీ చెందిన వారితో శ్రీవారి బ్రహ్మో త్సవాలను చిత్రికరిస్తామన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో కర్ణాటకలో 7ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అనంతవరంలోని శ్రీవారి ఆలయంలో రూ. 7.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు దళిత వాడల్లో రూ. 10 నుంచి రూ. 20 లక్షల నిధులతో 1000 ఆలయాలు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయడు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డెంగ్యూ జ్వరం దరి చేరకూడదంటే.. సింపుల్ చిట్కాలు
మళ్లీ గ్రహణం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్
For More AP News And Telugu News