Tirumala Ghee Scam: టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:56 PM
తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రమణ్యం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. కల్తీ నెయ్యి గురించి ముందే తెలిసినే కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్న కంపెనీలకే నెయ్యి సరఫరాకు సుబ్రమణ్యం, టీటీడీ ఉన్నతాధికారులు అవకాశం కల్పించారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ సిట్ పొందుపర్చింది.
తిరుపతి, నవంబర్ 29: తిరుమల కల్తీ నెయ్యి కేసు (Tirumala Ghee Scam) దర్యాప్తు కొనసాగుతోంది. టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రమణ్యం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైష్ణవీ డైరీకి చెందిన అపూర్వ చావ్డా నుంచి వెండి కంచాన్ని సుబ్రమణ్యం బహుమతిగా పొందినట్లు సీబీఐ సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. డిసెంబర్ 2021లో బోలేబాబా డైరీ ప్లాంట్‌ను సందర్శించి ఆ డైరీకి చెందిన పొమిల్ జైన్ నుంచి ఖరీదైన సాంసంగ్ ఫోన్‌ను బహుమతిగా పొంది.. వారికి అనుకూలంగా సుబ్రమణ్యం రిపోర్టు ఇచ్చినట్లు బయటపడింది. మార్చి 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు బోలేబాబా డైరీ నుంచి మూడు లక్షల 50 వేలను లంచంగా తీసుకున్నట్లు సీబీఐ సిట్ పేర్కొంది. టెక్నికల్ కమిటీతో కలిసి నెయ్యి ప్లాంట్‌ను సందర్శించాల్సి ఉన్నా... అలా చేయకుండా వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నతో కలిసి ఆయా డైరీలకు అనుకూలంగా సుబ్రమణ్యమే రిపోర్టు ఇచ్చినట్లు తేలింది.
మే 2022లో మైసూర్‌కు చెందిన డైరీ నిపుణుడు సురేంద్రనాథ్ బోలేబాబా డైరీ నుంచి అందుతున్న డైరీలో కల్తీ జరుగుతోందంటూ నివేదికను సిద్ధం చేసి సుబ్రమణ్యంకు మెయిల్ చేశారు. అయినా మెయిల్‌ను దాచి లీటరు పాలు కూడా సేకరించకుండా కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్న కంపెనీలకే నెయ్యి సరఫరాకు సుబ్రమణ్యం, టీటీడీ ఉన్నతాధికారులు అవకాశం కల్పించారు. డైరీ నిపుణుడు సురేంద్రనాథ్ అప్పటి ఈవోకు కూడా బోలే బాబా సరఫరా చేస్తున్న నెయ్యిలో బెటా సిసోస్టెరాల్, ఇతర వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు తన నివేదికను పంపినా... బోలే బాబా డైరీకే నెయ్యి సరఫరా అవకాశం కల్పించినట్టు సంచలన విషయాన్ని రిమాండ్ రిపోర్టులో సీబీఐ సిట్ స్పష్టంగా తెలియజేసింది.
మరోవైపు కల్తీ నెయ్యి కేసులో చట్టపరంగానే చర్యలు తీసుకునేందుకు సీబీఐ సిట్, ఏసీబీ ఉపక్రమిస్తోంది. కల్తీ నెయ్యి కేసులో 12 మంది టీటీడీ ఉద్యోగులను నిందితులుగా చేర్చాలని తిరుపతి పోలీసులకు ఏసీబీ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో తర్వలోనే ఆ 12 మందిని పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఇతర కీలకమైన వ్యక్తులను సీబీఐ సిట్ విచారణకు పిలిచి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం: త్రీ మెన్ కమిటీ
Read Latest AP News And Telugu News