BJP: ప్రజాసమస్యల పరిష్కారానికి వారధిగా ఉండాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:26 AM
మగ్రామాన కమల వికాసం జరిగేలా కృషి చేయాలని నేతలు, శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.
తిరుపతి(ఉపాధ్యాయనగర్), ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): గ్రామగ్రామాన కమల వికాసం జరిగేలా కృషి చేయాలని నేతలు, శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఆయన ‘సారథ్యం’ పేరిట జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం తిరుపతిలో జరిగిన సారథ్యం కార్యక్రమానికి మాధవ్ హాజరయ్యారు. ప్రజాసమస్యల పరిష్కారానికి వారధులుగా ఉండాలని శ్రేణులకు సూచించారు. జిల్లాలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి, ఎంపీటీసీ, కౌన్సిలర్.. ఇలా ఏ అవకాశం వచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇకపై నామినేటెడ్ పోస్టులకూ సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల్లోని అన్యమతస్థులను వేరే సంస్థలకు పంపించాలని డిమాండు చేశారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్ మాట్లాడుతూ, కూటమి ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులను పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేల తీరుతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇకపై ఎక్కువ సమయం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ వరప్రసాద్‌ను కోలా ఆనంద్ కోరారు. నియోజకవర్గంలో తాను తిరిగినట్టు మరొక ఎంపీ, ఎంపీ అభ్యర్థి తిరగలేదని వరప్రసాద్ అన్నారు. అలాకాదని నిరూపిస్తే రాజకీయాలనుంచి విరమించుకుంటానని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, జల్లి మధుసూదన్, పార్థసారధి, బీడీ బాలాజీ, చంద్రప్ప, శాంతారెడ్డి, చంద్రారెడ్డి, ఎస్‌ఎస్ నాయుడు, కండ్రిగ ఉమ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు లక్ష్మీపురం సర్కిల్లోని శంకరంబాడి సుందరాచారి విగ్రహానికి మాధవ్, నేతలు పుష్పాంజలి ఘటించారు. సారథ్యం కార్యక్రమంలో భాగంగా లీలామహల్ సర్కిల్ నుంచి కచ్చపి ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక, ఉదయం ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో భా గంగా సామంచి శ్రీనివా్‌సతో కలిసి బైక్‌పై మాధవ్ తిరుపతిలో పర్యటించారు. బాబూ జగ్జీవన్‌రామ్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పాదచారులతో మాట్లాడారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి వివరాలు తెలుసుకున్నారు. సిటీ బస్సులు నడపాలని, యూడీఎస్ మెరుగు పరచాలని పలువురు ఆయనకు సూచించారు.
మేధావుల సదస్సు
కాగా, సోమవారం రాత్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపారుల, మేధావుల సదస్సులో మాధవ్ పాల్గొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. పారిశ్రామికవేత్తలకు కేంద్రం రాయితీలు ఇస్తోందని, అందరూ ముందుకు వచ్చి రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. పారిశ్రామికవేత్త పృథ్వీరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్ అసోసియేషన్, ఆటోమొబైల్ అసోసియేషన్, క్రెడాయ్ ప్రతినిధులు, బిల్డర్లు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
వైసీపీ హయాంలో ‘స్మార్ట్’ నిధుల దుర్వినియోగం
బోగస్ ఓట్ల విషయమై కేంద్రాన్ని అడిగి తెలుసుకుంటా
మీడియా చిట్‌చాట్‌లో బీజేపీ అధ్యక్షుడు మాధవ్
తిరుపతి, ఆగస్టు12(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించడమే కాదు.. కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులనూ దుర్వినియోగం చేశారని బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. తిరుపతిలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘స్మార్ట్ సిటీ నిధులను ఇతర పనులకు వాడేశారు. చాలాచోట్ల దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ కఠినంగా పెట్టినా వైసీపీ లెక్కపెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటునూ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఈసారి స్మార్ట్‌సిటీలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం అమృత్2.0 తీసుకొచ్చింది’ అని వివరించారు. గత ప్రభుత్వంలో వైద్యశాఖలోనూ పెద్దఎత్తున గోల్‌మాల్ జరిగిందన్నారు. ‘నైట్ ల్యాండింగ్ సౌకర్యం లేకపోవడం, అధికారుల నియామకాలు జరిగితే విదేశీ విమాన రాకపోకలు జరగొచ్చు. తిరుపతి మీదుగా తిరువణ్ణామలైకి రైలు సౌకర్యంపైనా ప్రయత్నిస్తా’నని చెప్పారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా 35 వేల బోగస్ ఓట్లు ఎక్కించిన కేసు ఇప్పటికీ విచారణలోనే ఉండడం వెనుక కేంద్ర ప్రభుత్వం వైసీపీకి అనుకూలంగా ఉందన్న ప్రచారం జరగుతోందన్న మీడియా ప్రశ్నకు మాధవ్ స్పందించారు. ఈకేసు విషయం తన దృష్టికీ వచ్చిందని, పూర్వాపరాల గురించి కేంద్రాన్ని అడిగి తెలుసుకుంటానన్నారు. తన పర్యటన సందర్భంగా కేడర్‌లో నూతనోత్సాహం కనిపిస్తోందన్నారు.