Tirumala Devotees: జూన్‌లో తిరుమలలో భక్తుల జాతర
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:08 AM
Tirumala Devotees: తిరుమల శ్రీవారిని జూన్ మాసంలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ మాసంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.
తిరుమల, జులై 2: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడి (Tirumala Temple) దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కొండకు తరలివస్తుంటారు. ఆ దేవదేవుడిని కనులారా చూసి పులకించిపోతుంటారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి మరీ శ్రీవారిని దర్శించుకుని తన్మయత్వం చెందుతారు. ఒక్కోసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వైకుంఠం కాంప్లెక్స్‌లు అన్నీ నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లలో కూడా భక్తులు వేచి ఉంటారు. గతంలో సెలవులు, వారంతరాల్లో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వారంతో సంబంధం లేకుండా శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అయితే జూన్ రెండో వారం నుంచి స్కూళ్లు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు ప్రారంభానికి ముందే తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇక జూన్ మాసంలో రికార్డు స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ మాసంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. జూన్ నెలలో శ్రీవారిని 24.08 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి హుండీ ద్వారా రూ.120.35 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది 2024 సంవత్సరంలో జూన్ నెలలో రూ.110 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది జూన్ నెలలో రూ.10 కోట్లకు పైగా అదనంగా ఆదాయం వచ్చింది. అలాగే 10.11 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే జూన్ నెలలో రూ.1.19 కోట్ల లడ్డూ విక్రయాలు జరిగాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటనను విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి
తప్పు చేస్తున్నారు.. మూల్యం తప్పదు.. జైలు వద్ద చెవిరెడ్డి హంగామా
Read Latest AP News And Telugu News