Health Department: ఈ జాప్యం... కాదు క్షమార్హం
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:07 AM
ఐదు నెలల కిందట లింగ నిర్ధారణ ముఠాను పట్టుకున్నా, వారిలోని వైద్య సిబ్బందిపై చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. మొత్తం ముగ్గురున్నారని తేల్చి... ఐదు నెలల జాప్యం తరువాత శుక్రవారం ఒకరిపై మాత్రమే చర్యలు తీసుకోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
చిత్తూరు రూరల్, ఆక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): లింగ నిర్ధారణ పరీక్షల కేసుకు సంబంధించి కలెక్టరే స్వయంగా నిందితులను పట్టించినా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు వారిపై చర్యలు తీసుకోవడానికి సమయం కుదరలేదు. ఐదు నెలల కిందట లింగ నిర్ధారణ ముఠాను పట్టుకున్నా, వారిలోని వైద్య సిబ్బందిపై చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. మొత్తం ముగ్గురున్నారని తేల్చి... ఐదు నెలల జాప్యం తరువాత శుక్రవారం ఒకరిపై మాత్రమే చర్యలు తీసుకోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా చిత్తూరు నగరంలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని తెలుసుకున్న కలెక్టర్ సుమిత్‌కుమార్ నిఘా పెట్టారు. రెండు నెలల తరువాత భగత్‌సింగ్ కాలనీలో తమిళనాడు రాష్ర్టానికి చెందిన పలువురు మహిళలకు పరీక్షలు జరుగుతున్నట్లు గుర్తించారు.స్థానిక అధికారుల మీద నమ్మకం లేక ఆయనే మే 14న అక్కడికి వెళ్లారు. లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన యంత్రాలను సీజ్ చేసి, 11మంది గర్భిణుల్ని, ముగ్గురు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. 2014 నుంచి అంటే 11 ఏళ్లుగా ఇక్కడ పరీక్షలు చేస్తూ నెలకు దాదాపు రూ.10 లక్షలకు పైగా సంపాదిస్తున్నారని విచారణలో తేలింది. ఈ 11 ఏళ్లలో ఒక్క కేసూ నమోదు కాకపోవడం,వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. ఈ క్రమంలోనే అప్పట్లో డీఎంహెచ్‌వోకు, డీసీహెచ్‌ఎస్‌కు కలెక్టర్ నోటీసులు కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. నిందితుల్ని కేసులో నుంచి తప్పించేందుకు పోలీసులు పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తానికి 20మందిపై కేసులు నమోదు చేశారు.వారిలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది ముగ్గురున్నట్లు తేలింది. గుడిపాల పీహెచ్‌సీ అటెండర్, జీడీ నెల్లూరుకు చెందిన ఓ ఏఎన్‌ఎం, పాలసముద్రానికి చెందిన ఆశా వర్కర్ ఈ ముఠా కార్యక్రమాల్లో పాలుపంచుకుం టున్నారని ఉన్నతాధికారులకు కూడా తెలిసింది. కానీ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేశారు. దీని వెనుక కూడా పెద్ద మొత్తం చేతులు మారిందని ఆ శాఖలో గుసగుసలు వినిపించాయి.ఈలోపు తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి గుడిపాల అటెండరును అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. రిమాండ్‌పై జైల్లో వున్న అటెండర్ ఇటీవలే బయటకు వచ్చాడు.
ప్రభుత్వ ఉద్యోగిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయితేనే వెంటనే అతన్ని సస్పెండ్ చేస్తుంటా రు.అటువంటిది ఈ ఘటనలో ముఠాతో సంబంధం ఉందని నిర్థారించినా చర్యలు తీసుకునేందుకు 5నెలలు పట్టింది. స్వయంగా కలెక్టర్ కల్పించుకున్న కేసులోని నిందితులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమా చారం.దీంతో ఎట్టకేలకు శుక్రవారం అటెండర్‌ను మాత్రమే సస్పెండ్ చేశారు.మిగిలిన ఇద్దరు ఉద్యోగులపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉండగా, ఈ కేసు ప్రస్తుతం జిల్లా కోర్టులో నడుస్తోంది. దీన్ని పర్సనల్‌గా తీసుకున్న కలెక్టర్ సుమిత్‌కుమార్ ఇద్దరు ప్రైవేటు లాయర్లను పెట్టుకుని మరీ ఫాలోఅప్ చేస్తున్నారు. ఆ ఇద్దరితో ఎఫ్‌ఐఆర్‌లో, కోర్టులో వాదనల్లో లోపాలు లేకుండా చూసుకుంటున్నారు.