Red Sandal: ఇవన్నీ పుష్పా కార్లు
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:46 AM
ఈ కార్లు వేలం వేస్తామహో...! అని తిరుపతి డివిజన్ అటవీశాఖ ప్రకటించింది. ఇండియాలో షోరూములున్న అన్ని కార్లూ కపిలతీర్ధం దగ్గరున్న టాస్క్‌ఫోర్స్ ఆఫీసు ఆవరణలోని తుప్పల్లో ఇలా ఉన్నాయి. కోరిన మోడల్.. కారు చవగ్గా వేలంలో ఎగరేసుకుపోవచ్చని ఆశ పడితే మాత్రం హుళుక్కే! వీటిలో ఇంజన్లు ఉన్నాయో లేదో తెలీదు. ఉన్నా ఏ పార్టులు మిగిలివున్నాయో చెప్పలేం.

తిరుపతి, ఆంధ్రజ్యోతి: ఈ కార్లు వేలం వేస్తామహో...! అని తిరుపతి డివిజన్ అటవీశాఖ ప్రకటించింది. ఇండియాలో షోరూములున్న అన్ని కార్లూ కపిలతీర్ధం దగ్గరున్న టాస్క్‌ఫోర్స్ ఆఫీసు ఆవరణలోని తుప్పల్లో ఇలా ఉన్నాయి. కోరిన మోడల్.. కారు చవగ్గా వేలంలో ఎగరేసుకుపోవచ్చని ఆశ పడితే మాత్రం హుళుక్కే! వీటిలో ఇంజన్లు ఉన్నాయో లేదో తెలీదు. ఉన్నా ఏ పార్టులు మిగిలివున్నాయో చెప్పలేం. విత్తనాలు పడి, మొక్కలు మొలిచి, మానులై పెరిగి, తీగలు అల్లుకుని ఇదిగో ఇలా ఉన్న ఈ కార్లను కొని రోడ్ల మీద తిప్పడం సాధ్యమేనా? తుక్కుకు తప్ప పనికిరాని తుప్పుగా మారిన ఈ కార్లను కొనే సాహసం పాత సామాన్లు కొనేవారు తప్ప ఇంకెవరూ చేయడం లేదు. అందుకే 2024 సెప్టెంబర్‌లో 40 వాహనాలను వేలం వేయగా కేవలం రూ.18.59లక్షలు మాత్రమే వచ్చింది. ఫిబ్రవరి 5న 153 వాహనాలు వేలం వేసేందుకు అటవీ శాఖ సిద్ధపడింది. ఇంకా 800కు పైగా వాహనాలు కనీసం తుక్కుగా కూడా పనికిరాని విధంగా పడివుంటాయన్నమాట. తిరుపతి కపిలతీర్థం దగ్గరున్న టాస్క్‌ఫోర్స్ కార్యాలయం ప్రాంగణంలో పదేళ్లుగా పడి ఉందో బెంజ్ కారు. శేషాచలంను కొల్లగొట్టే ఎర్రదొంగలు స్మగ్లింగ్‌కి వాడిన బెంజ్ ఇది. 2014లో 334 కేజీల బరువు ఉన్న 24 ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా ఇన్నోవా, హోండాలతో పాటూ ఈ బెంజ్ కారును తిరుచానూరు పోలీసులు లక్ష్మీ చెరువు వద్ద పట్టుకున్నారు. అంతే అప్పటి నుంచీ కోట్ల ఖరీదు చేసే ఈ దర్జా బెంజ్ కారు దీనంగా ఇలా పడివుంది. ఇదొక్కటే కాదు ఎర్ర దుంగలతో దొరికిన దాదాపు వెయ్యి కార్లు దశాబ్దాలుగా తుప్పు పట్టిపోయి మన దర్యాప్తు వ్యవస్థ తీరును వెక్కిరిస్తున్నట్టుగా ముళ్ల పొదల్లో పడివున్నాయి.
ఎందుకిలా?
దర్యాప్తులో అసాధారణ జాప్యం వల్ల ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ వాహనాలు ఇలా పనికిరానివిగా మిగిలిపోతున్నాయి. పట్టుబడ్డ వాహనాల యజమానులను గుర్తించడమే పెద్ద సమస్య. స్మగ్లింగ్‌కి వాడే వాహనాలకు సాధారణంగా అసలు నెంబర్లు ఉండవు. చాసిస్ నెంబర్లను కూడా మార్చేస్తుంటారు. దీంతో వీటి అసలు యజమానులు ఎవరో తేలలేదు అని నిర్ధారించేసరికే ఏళ్లకు ఏళ్లు పడుతోంది. అప్పటికే ఇవి మట్టిలో కూరుకుపోయి, చెట్ల మధ్య మునిగిపోయి ఇలా మారుతున్నాయి. ఆ తర్వాత వీటి వేలాని అనుమతి పొంది, విలువ కట్టాల్సిందిగా ఆర్టీవో కార్యాలయాన్ని కోరుతారు. వారు ధరలు నిర్ణయించాక వేలం ప్రకటిస్తారు. తీరా వేలం వేసే నాటికి ఇనుముగా తప్ప ఇంక దేనికీ పనికిరాకుండా పోతున్నాయి. ఇట్లా లారీలు, వ్యాన్‌లు, ఆటోలు, కార్లు కుప్పలు తెప్పలుగా పడివుంటున్నాయి. భాకరాపేట ఘాట్‌లో అయితే ఈ వాహనాలను మట్టిలో కలిపేస్తూ ఒక అడవే పెరిగింది.
రూ.30 కోట్ల ఆదాయం మటాష్!
దర్యాప్తులో వేగం పెంచి, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో వ్యవహరిస్తే పట్టుబడిని ఏడాదిలోనే ఈ వాహనాలను వేలం వేసే అవకాశం ఉంటుంది. ఇలా చేయగలిగితే ప్రభుత్వానికి భారీ ఆదాయం కూడా లభిస్తుంది. తిరుపతి డివిజన్ పరిధిలో 2000 నుంచి గతేడాది చివరి వరకూ స్వాధీనం చేసుకున్నవే వెయ్యి వాహనాలదాకా ఉన్నాయి. పట్టుబడిన ఏడాదిలోగా వేలం వేయగలిగితే సగటున ఒక వాహనం రెండు నుంచి మూడు లక్షలకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయల ఆదాయం లభించేది.
చేతివాటమూ ఘనమే
పట్టుబడిన వాహనాల్లోంచి ముఖ్య భాగాలు మాయమైపోతుంటాయి.ముందుగా మాయమ య్యేది బ్యాటరీలు. వాటి స్థానంలో పనికిరాని బ్యాటరీలు ప్రత్యక్షమవుతాయి. కొన్ని వాహనా లకైతే ఏకంగా ఇంజన్లే మాయమైపోతుం టాయి. మానిటర్లూ, జీపీఎస్‌లూ వంటివి అయితే అసలు మిగలవు. ఎలాగూ ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు కాబట్టి ఇంటి దొంగలే చేతివాటం ప్రదర్శిస్తుంటారని తెలుస్తోంది.
5న 153 వాహనాల వేలం
తిరుపతి డివిజన్ పరిధిలో పట్టుబడిన 153 వాహనాలను ఫిబ్రవరి 5న తేదీన కపిలతీర్థం వద్ద జిల్లా అటవీ అటవీ శాఖ కార్యాలయంలో బహిరంగ వేలం వేయనున్నారు. ఆ తర్వాత మరో 200 వాహనాలకు కూడా బహిరంగ వేలం వేయనున్నట్లు సమాచారం.
దర్యాప్తు తుప్పు వదిలితే కోట్ల ఆదాయం
ఫస్వాధీనం చేసుకున్న వాహనాలను ఎక్కడపడితే అక్కడ కాక భద్రతగల ప్రత్యేక ప్రాంతాల్లో పార్క్ చేయాలి.
పట్టుబడిన వాహనాల ప్రతి పార్ట్‌నూ వీడియో రికార్డు చేయచ్చు.
అసలు యజమానులను గుర్తించే ప్రక్రియకు ఏడాదికి మించకుండా గడువు
చార్జ్‌షీట్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి.
ప్రత్యేక కోర్టుల ద్వారా కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి.