Share News

Tirumala: సూర్య చంద్రులే వాహనాలుగా..

ABN , Publish Date - Oct 01 , 2025 | 01:44 AM

తిరుమల శ్రీవారు మంగళవారం ఉదయం సూర్యప్రభమీద ఊరేగిన స్వామి, రాత్రి చంద్రప్రభపై విహరించాడు.

Tirumala: సూర్య చంద్రులే వాహనాలుగా..
సూర్య చంద్రులనే వాహనాలుగా మలచుకున్న తిరుమలేశుడు

తిరుమల, ఆంధ్రజ్యోతి: అలంకారప్రియుడు.. పూలరంగడు.. తిరుమలేశుడు. సకల జగత్తుకూ జీవదాతలైన సూర్య చంద్రులనే తన వాహనాలుగా మలచుకున్న మాయగాడు. మంగళవారం ఉదయం సూర్యప్రభమీద ఊరేగిన స్వామి, రాత్రి చంద్రప్రభపై విహరించాడు. మెడలో నూరువరహాల ఎర్రెర్రని పూదండతో పగలు సోయగాలు చిందించిన శ్రీనివాసుడు, రాత్రి మల్లెపూమాల ధరించాడు.

నూరువరహాల సోయగం

బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే వాహన సేవల్లో సూర్యప్రభవాహనం ఒకటి. అత్యంత బరువుతో కూడిన ఈ వాహనంపై కొలువుదీర్చే మలయప్పస్వామికి విశేష పుష్పాలం కరణ చేస్తారు. సూర్యుడికి ప్రతీకగా ఎర్రటి నూరువరహాల పూలను వినియోగిస్తారు. 40 కిలోలపూలతో అల్లిన మాలను మలయప్పస్వామికి అలంకరించారు. కిలో రూ.10 వేల ధర కలిగిన కురువేరును నూరువరహాల పూలమాల కిందనే వినియోగించారు. సంపంగి, కనకంబరం పూల మాలలను కూడా స్వామికి అలంకరించడంతో సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి ప్రత్యేక అందాలతో భక్తుల హృదయాలను దోచుకున్నారు.

మల్లెపూల పరిమళం

రాత్రి చంద్రప్రభ వాహనంపై 60 కిలోల మల్లెపూల మాల ధరించిన మలయప్ప మాడవీధుల్లో భక్తులకు కనువిందు చేశాడు. వెన్నెరేడు చందురుడు. ఆయనకు ప్రతీకగా తెల్లని పూలను రాత్రి అలంకరణలో వాడారు. మల్లె పూలకు ఇది కాలం కాకపోయినా టీటీడీ ఉద్యానవన విభాగం మూడు బృందాల ద్వారా వీటిని సేకరించింది. పుత్తూరు పరిసర ప్రాంతాలు, మధురై వంటి ప్రాంతాల నుంచి కిలో దాదాపు రూ.800 పెట్టి వీటిని తీసుకువచ్చారు. అల్లిన మల్లె మాలలో స్వామి అందం ఇనుమడించింది. ఈ వాహనసేవలోనూ ఐదు కిలోల కురువేరును వినియోగించారు.

వాహన సేవల్లో ప్రదర్శనలు

ఇవ్వడానికి 28 రాష్ర్టాల నుంచి 6,960 మంది కళాకారులు వచ్చారు. మంగళవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు దాదాపు 6,400 మంది కళాకారులు తమ అద్భుత విన్యాసాలతో భక్తులను అలరించారు. 24వ తేది రాత్రి పెద్ద శేషుడితో స్వామివారి వాహన సేవలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి జరగనున్న అశ్వ వాహనంతో ముగియనున్నాయి.


బంగారు గొడుగు ఉత్సవం

మంగళవారం సాయంత్రం తిరుమలలో బంగా రు గొడుగు ఉత్సవం నిర్వహించారు. పంతులుగారి రామనాథన్‌ ఆధ్వర్యంలో క్షురకులు, సిబ్బంది, సభ్యులు కల్యాణకట్టలో గొడుగుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యుడు శాంతారామ్‌, రాష్ట్ర నాయి బ్రహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రకోటి సదాశివం, కల్యాణకట్ట డిప్యూటీఈవో వెంకటయ్య, ఏఈవో అమర్నాథ్‌, సూపరింటెండెంట్లు రమాకాంత్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహారథంపై దీనిని అలంకరించారు. తొలిరోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై 1952 నుంచి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతోంది. పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన రామనాథన్‌ సంప్రదాయంగా గొడుగును అందజేశారు.

నేడు మహారథోత్సవం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనసేవ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్నది మహారథోత్సవం (చెక్కతేరు). బుధవారం ఉదయం 7 గంటలకు మహారథం కదులుతుంది. 600 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈమహారథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామిని వేంచేపు చేయనున్నారు. భారీ బరువు, ఎత్తుతో కలిగిన మహారథాన్ని మాడవీధుల్లో తిప్పడం కష్టమైన కార్యక్రమం. అందుకని మూడు నెలల ముందు నుంచే దీనికి కసరత్తు మొదలవుతుంది. ఇప్పటికే రథానికి బ్రేకులు, చక్రాలకు గ్రీసు వేశారు. మహారథంలోకి ఎక్కాల్సింది ఎవరు? చక్రాల కదలికల పరిశీలన.. చెక్కలను పెట్టడం.. చక్రాల సమీపానికి భక్తులు రాకుండా చూసే బాధ్యతలనూ కొందరికి అప్పగించారు. రథాన్ని లాగడంలో టీటీడీ సిబ్బందితో పాటు భక్తులను భాగస్వాములు చేయనున్నారు.

Updated Date - Oct 01 , 2025 | 01:44 AM