Education: ప్రాథమిక విద్య బలోపేతానికి అడుగులు
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:16 AM
చదవడం, రాయడం, ప్రాథమిక గణితం ఇవే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు. ప్రభుత్వం అందుకే ప్రాథమిక స్థాయి విద్య బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 75 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీఎ్‌ఫఎల్‌ఎన్) కార్యక్రమాన్ని రూపొందించింది.
తిరుపతి(విద్య), డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): చదవడం, రాయడం, ప్రాథమిక గణితం ఇవే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు. ప్రభుత్వం అందుకే ప్రాథమిక స్థాయి విద్య బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 75 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీఎ్‌ఫఎల్‌ఎన్) కార్యక్రమాన్ని రూపొందించింది. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా విద్యాశాఖాధికారులు ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించారు. రాయడం, చదవడం, ప్రాథమిక గణితంతో కొందరు విద్యార్థులు వెనుకబడి ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ ఈ మూడు అంశాల్లో సోమవారం నుంచి తర్ఫీదిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్చి 24వ తేదీ వరకు దీనిని కొనసాగిస్తారు.
ఉదయం సిలబస్... మధ్యాహ్నం నైపుణ్యాలు
రోజూ ఉదయం సాధారణ పాఠ్యాంశాలు బోధిస్తారు. మధ్యాహ్నం పూర్తిగా జీఎ్‌ఫఎల్‌ఎన్ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. 1, 2 తరగతులకు, 3, 5 తరగతులకు వేర్వేరు కార్యాచరణ అమలు చేయనున్నారు. చిన్న తరగతుల్లో అక్షరాలు గుర్తించడం, పదాలు చదవడం, చిన్న వాక్యాలు రాయడం వంటి నైపుణ్యాలపై దృష్టి పెట్టనుండగా, పై తరగతుల వారికి చదువు వేగం, అవగాహన, లెక్కల సాధనపై శిక్షణ ఇవ్వనున్నారు. గణితంలో ప్రాథమిక లెక్కలపై పూర్తి అవగాహన కల్పించనున్నారు.
ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమం
జీఎ్‌ఫఎల్‌ఎన్ అకడమిక్ ప్రోగ్రాం మాత్రమే కాదు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆసక్తిని, పెంచే కార్యక్రమంగా నిలవనుంది. వెనుకబడిన విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తం కానుంది. రానున్న కాలంలో విద్యా ఫలితాలను ఈ కార్యక్రమం గణనీయంగా మెరుగుపరుస్తుందని, గట్టి పునాది పడితే పదవ తరగతి వరకు విద్యార్థి ప్రయాణం సాఫీగా సాగుతుందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.
బలమైన పునాది వేయడమే లక్ష్యం: కేవీఎన్ కుమార్, డీఈవో
ప్రతి విద్యార్థికీ చదవడం, రాయడం కచ్చితంగా రావాలి. ప్రాథమిక స్థాయిలోనే పునాది బలంగా ఉంటే తరువాతి విద్య సజావుగా సాగుతుంది. అందుకే 75 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఒక్క విద్యార్థి కూడా వెనుకబడి ఉండకూడదన్నదే లక్ష్యం. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలి.