Task Force: ప్రత్యేక టాస్క్‌ఫోర్సు
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:22 AM
జిల్లాలో శాంతిభద్రతల సమస్యకు ప్రధాన కారణం.. భూ ఆక్రమణలు. పైసా పైసా కూడబెట్టి, అప్పోసప్పో చేసి స్థలం కొనే నిరుపేదల ఆశలను, ఆర్థికస్థితిగతులను ఛిన్నాభిన్నం చేస్తున్నదీ భూకబ్జాలు. సొంతింటి కలలను కల్లలు చేసేదీ భూబకాసురులే. గత సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన 95 అర్జీల్లో 63 భూసమస్యలకు సంబంధించినవే. మంగళవారం ఎస్పీ హర్షవర్ధనరాజుకు అందిన నాలుగు ఫిర్యాదులూ ఇవే. ఘర్షణలకు కారణమవుతున్న.. సామాన్యుల జీవితాలను తల్లకిందులు చేస్తున్న భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపేలా ఎస్పీ చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్‌తో చర్చించి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయనున్నారు.

తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి: అధికారం.. అధికారుల అండ ఉంటే చాలు. తనది కాని భూమిని సొంతం చేసుకుంటున్నారు కొందరు. రికార్డుల్లో పేర్లే మార్చేస్తున్నారు. తిరుపతి నగరంలో అయితే మరీ రెచ్చిపోతున్నారు. సామాన్యుల స్థలాలను కబ్జాచేసేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదేంటని అడిగితే దాడులు చేస్తున్నారు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో భూ బకాసురుల ఆగడాలను ఎదుర్కోలేక సామాన్యులు కుమిలిపోతున్నారు. వీటిపై అధికారులకు ఫిర్యాదులు చేయడమే కానీ న్యాయం జరిగిన దాఖలాలు లేవు. భూ ఆక్రమణలు ఆగనూ లేదు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం భూ వివాదాలకు సంబంధించినవే. ఈ క్రమంలో భూకబ్జాలకు అడ్డుకట్ట వేస్తే జిల్లాలో శాంతిభద్రతలు మెరుగు పడతాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ దిశగా కలెక్టరుతో చర్చించి ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటుకు పోలీసు యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఎక్కడెక్కడ భూ బకాసురులు ఉన్నారు? ఎప్పటి నుంచి.. ఎక్కడెక్కడ భూములు ఆక్రమిస్తున్నారు? వారి నేర చరిత్ర ఏమిటి? వారి వెనుక ఉన్న రౌడీలు, గూండాలు ఎవరనే దానిపై లోతుగా అధ్యయనం చేయనున్నారు. జిల్లాతో పాటు ప్రధానంగా తిరుపతిలో పెరిగిపోతున్న భూ ఆక్రమణలపై గట్టి చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి.. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలతో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్సులో రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో రిటైర్డు న్యాయమూర్తి, రిటైర్డు డిప్యూటీ కలెక్టర్, రిటైర్డు తహసిల్దార్, అనుభవజ్ఞులైన మేధావులు, నగర ప్రముఖులు, సర్వేయర్లను నియమించే యోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి త్వరలో జిల్లా అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశాలు వున్నాయి. ఇదే అమలైతే జిల్లాలో భూ ఆక్రమణలకు చాలావరకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయి.
భూకబ్జాలపై కఠిన చర్యలు
జిల్లాతో పాటు తిరుపతిలో పెరిగిపోతున్న భూ కబ్జాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధనరాజు స్పష్టంచేశారు. మంగళవారం తనను కలిసిన ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. భూఆక్రమణలకు పాల్పడేవారి జాబితాను తెప్పించుకుని ఆ తర్వాత అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అవసరమైతే భూ ఆక్రమణలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నింటిపై త్వరలో కలెక్టర్‌తో చర్చించి భూ ఆక్రమణలకు పూర్తిస్థాయిలో చెక్‌పెట్టేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. దీనివల్ల శాంతి భద్రతల సమస్యలు తగ్గే అవకాశాలున్నాయన్నారు.