CM Chandrababu Naidu: దేశానికి జనాభాయే ఆస్తి
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:40 AM
భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది. మన కుటుంబ విలువలు ప్రపంచంలో మరెక్కడా ఉండవు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రతి జంటా ముగ్గురు పిల్లలను కనాలి
వృద్ధ ప్రపంచంలో యువ దేశం మనదే: సీఎం
ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల భారతీయులు
తలసరి ఆదాయంలో మన వాళ్లే టాప్
2047 నాటికి ప్రపంచంలో నం.1 మనమే
మన కుటుంబం, విలువలు గొప్పవి
పిల్లలకు పురాణాల గురించి చెప్పాలి
స్పైడర్‌మ్యాన్ కన్నా హనుమాన్ బలవంతుడు
భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం
ఐటీలో మనం బలంగా ఉన్నాం. ప్రపంచంలో పేరున్న ఐటీ కంపెనీలకు భారతీయులే సారఽథ్యం వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుని తీరుతుంది. రాబోయే అనేక శతాబ్దాల పాటు భవిష్యత్తు భారత్‌దే.
- సీఎం చంద్రబాబు
తిరుపతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘భారతీయ కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది. మన కుటుంబ విలువలు ప్రపంచంలో మరెక్కడా ఉండవు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం తిరుపతిలో విజ్ఞాన భారతి సంస్థ నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ఆయన ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్ సింగ్‌తో కలసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ, మన కుటుంబ వ్యవస్థ అందరికీ భద్రత కల్పించేలా ఉంటుందని కొనియాడారు. మన కుటుంబ విలువల పట్ల గర్విస్తున్నానన్నారు. ‘‘దేశంలో ఇప్పుడు జనాభాయే ఆస్తిగా మారింది. వృద్ధుల జనాభా పెరిగిపోయి పలు దేశాలు ఇబ్బందులు పడుతుండగా, భారత్‌లో మాత్రం యువజనం అధికంగా ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సుమారు ఐదు కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఏ దేశంలోనైనా తలసరి ఆదాయం మనవారికే అధికంగా ఉంటోంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుముఖం పడుతోంది. కానీ, భారత్‌లో మాత్రం 14.8 శాతం పెరిగింది.’’ అని చంద్రబాబు తెలిపారు. మానవ వనరుల లోటును పూడ్చుకోవడానికి దేశంలో ప్రతి జంటా ముగ్గురు పిల్లల్ని కనాలన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
‘‘మన యువతకు, పిల్లలకు స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్‌లకు బదులుగా మన పురాణ పురుషుల గురించి చెప్పాలి. స్పైడర్‌మ్యాన్ కంటే హనుమంతుడు బలవంతుడు. బ్యాట్‌మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడు. హాలీవుడ్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్పవారు. ఈ విషయాలు పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే కృష్ణుడి మహిమల గురించి, శివుడి మహత్తుల గురించి, రాముడికి మించిన రాజు లేడనే దాని గురించి చెప్పాల్సి ఉంది. హాలీవుడ్ సినిమా అవతార్ కంటే కూడా మహాభారతం, రామాయణం చాలా గొప్పవని చెప్పాలి. అదే సమయంలో బకాసురుడు, కంసరాజు వంటి వారి గురించి కూడా చెప్పాలి. సమాజంలో మంచి చెడుల వ్యత్యాసం తెలియాలంటే ఇవన్నీ చెప్పాలి.’’
ప్రపంచానికి జ్ఞానం పంచాం
‘‘జ్ఞానం, విజ్ఞానం మన దేశానికి కొత్త కావు. ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిపరిఢవిల్లింది. 4500 ఏళ్లకు ముందే విలసిల్లిన హరప్పా, మెహంజదారో నాగరికతలు, అప్పట్లోనే మన అర్బన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ పాటవాలను చాటి చెప్పాయి. 2900 ఏళ్ల క్రితమే ఇక్కడ యోగను ఆచరించాం. ఇప్పుడు 150 దేశాలు యోగాను ఆచరిస్తున్నాయి. 2600ఏళ్ల మునుపే ఆయుర్వేదం ద్వారా వైద్యసేవలు అందించాం. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకుని ఆధునిక విద్యను అందించాం. సున్నాను కనుగొన్నదీ, చదరంగం క్రీడను ప్రపంచానికి అందించిందీ భారతీయులే. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరకుడు, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్పవారంతా ఇక్కడి వారే. 2వేల ఏళ్ల వెనక్కి వెళితే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణిస్తున్న అమెరికా, జపాన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ వంటివి ఎంతో వెనుకబడి ఉన్నాయి. అప్పట్లోనే మన దేశ జీడీపీ ప్రపంచ జీడీపీలో 40శాతం ఉండేది. నాలెడ్జి ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్‌గానే ఉండేది. కానీ వలస పాలన, మన ఆర్థిక విధానాల కారణంగా వెనుకబడ్డాం. 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలవ్వగానే మనం అందిపుచ్చుకున్నాం.’’
2047 నాటికి మనమే టాప్
‘‘మాజీ ప్రధాని వాజపేయి తెచ్చిన సంస్కరణలతో దేశాభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయి. ఇప్పుడు ఐన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం బలంగా ఉన్నాం. ప్రపంచంలో పేరున్న ఐటీ కంపెనీలకు భారతీయులే సారఽథ్యం వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. రాబోయే అనేక శతాబ్దాల పాటు భవిష్యత్తు భారత్‌దే. ఆ దిశగా మోదీ స్థిరమైన ప్రభుత్వంతో పాటు, ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి వ్యక్తులు తగిన వేదిక రూపొందిస్తున్నారు. ఈ సమయంలోనే సమాజంలో పేద, ధనిక మధ్య అంతరాలు తగ్గే విధంగా వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన సమ్మేళనం మంచి వేదిక. సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ దేశాభివృద్ధి కోసం ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ కృషి చేస్తున్నారు.’’ అని చంద్రబాబు అన్నారు. క్వాంటం కంప్యూటింగ్, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే ఏపీ నుంచి క్వాంటమ్ కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
World Telugu Conference: 3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
TTD Bills Issue: శ్రీవాణి బిల్లులు ఏం చేద్దాం