TTD Bills Issue: శ్రీవాణి బిల్లులు ఏం చేద్దాం
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:29 AM
శ్రీవాణి నిధులతో చేపట్టిన ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలో, లేదో అర్థంకాక టీటీడీ మల్లగుల్లాలు పడుతోంది.
పెండింగ్‌లో ఉన్నవాటిని చెల్లించాలా? వద్దా?
స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్న టీటీడీ
జగన్ హయాంలో పనులపై అవినీతి ఆరోపణలు
104 పనులు రద్దు.. విజిలెన్స్ విచారణకు ఆదేశం
గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వానికి అందిన నివేదిక
15 నెలలు అవుతున్నా విడుదల కాని మార్గదర్శకాలు
బిల్లుల కోసం ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో సతమతం
రేపల్లె ఆలయ పనులపై హైకోర్టుకెళ్లిన కాంట్రాక్టర్
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
శ్రీవాణి నిధులతో చేపట్టిన ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలో, లేదో అర్థంకాక టీటీడీ మల్లగుల్లాలు పడుతోంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అయితే ఈ అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సమర్పించిన విచారణ నివేదికపై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో బిల్లుల విషయమై టీటీడీ సతమతమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్టు నిధులు భారీ ఎత్తున దుర్వినియోగమయ్యాయని ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే గతేడాది ఆగస్టు 27న సీఎం చంద్రబాబు దీనిపై సమీక్షించి, శ్రీవాణి ట్రస్టు నిధులతో మంజూరు చేసిన పనుల్లో ఇంకా మొదలుపెట్టని 104 పనులను రద్దు చేయాలని ఆదేశించారు. అప్పటికే పూర్తయిన, పురోగతిలో ఉన్న 89 పనులను మాత్రమే ఆమోదించాలని ఆదేశించారు. శ్రీవాణి ట్రస్టు కార్యకలాపాలు, ఆ నిధులతో చేపట్టిన పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. గతేడాది ఆగస్టులో విచారణ చేపట్టిన విజిలెన్స్ సెప్టెంబరులోనే ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.
రూ.10.58 కోట్ల బిల్లులు పెండింగ్
గత ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ చేపట్టిన పనులకు రూ.4.05 కోట్లు, దేవదాయ శాఖ చేపట్టిన పనులకు రూ.5.15 కోట్లు, ఆలయాల కమిటీల ద్వారా చేపట్టిన పనులకు రూ.1.38కోట్లు మొత్తం కలిపి రూ.10.58 కోట్ల మేరకు బిల్లులు చెల్లించాల్సి వుంది. విజిలెన్స్ నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో గతేడాది సెప్టెంబరు నుంచి టీటీడీ ఈ బిల్లులు విడుదల చేయలేదు. శ్రీవాణి ట్రస్టుపై విచారణ నివేదిక ప్రతి ఇంతవరకూ టీటీడీకి అందలేదు. ఈ విషయంపై ప్రభుత్వం కూడా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో గతేడాది డిసెంబరు 24న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించారు. నివేదిక త్వరగా తెప్పించుకుని అందులో తేలిన వాస్తవాలు, సిఫారసులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పాలకవర్గం నిర్ణయించింది. విచారణ నివేదికను అందజేయాలంటూ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి సీవీఎ్‌సవో ఈ ఏడాది ఫిబ్రవరి 27న లేఖ రాశారు. ఈలోపు కాంట్రాక్టర్ల ఒత్తిడి మరింత పెరగడంతో బిల్లుల చెల్లింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జూన్ 10న దేవదాయ శాఖ కార్యదర్శికి టీటీడీ లేఖ రాసింది. అయితే విచారణ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశామని, నేరుగా ఆయనతోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని ఆగస్టు 6న విజిలెన్స్ డీజీ టీటీడీకి సమాధానం ఇచ్చారు.
ప్రజాప్రతినిధుల అభ్యర్థనలు
పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాలని ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు టీటీడీని కోరుతున్నారు. ఇక గుంటూరు జిల్లా రేపల్లెలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పునరుద్ధరణ పనులు చేసిన శ్రీ వెంకట దుర్గా ఇండస్ట్రీస్ యజమాని మట్టా శ్రీనివాసరావు తమ సంస్థకు టీటీడీ నుంచి రూ.18.75 లక్షల బిల్లులు విడుదలయ్యేలా ఆదేశించాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబరు 16న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఒత్తిళ్లు పెరుగుతుండటంతో ఈ నెల 16న జరిగిన బోర్డు సమావేశంలో బిల్లుల చెల్లింపు అంశం చర్చకు వచ్చింది. విజిలెన్స్ నివేదిక ప్రతిని టీటీడీకి అందజేయాలని, పెండింగ్ బిల్లుల విషయంలో తదుపరి చర్యలపై మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని బోర్డు నిర్ణయించింది.