Share News

Tirumala Temple: పది రోజులూ పవిత్రమే

ABN , Publish Date - Dec 27 , 2025 | 05:16 AM

ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే పవిత్రమైన రోజులు.

Tirumala Temple: పది రోజులూ పవిత్రమే

  • ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం

  • వైకుంఠ ద్వార దర్శనాలకు ఆందోళన వద్దు

  • ‘ఆంధ్రజ్యోతి’తో టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

తిరుమల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే పవిత్రమైన రోజులు. ఈ పది రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. భక్తులు ఆందోళనపడకుండా ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవాలి’ అని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90 శాతం సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించాం. 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు వారికే. ఏ విధమైన ఒత్తిడి అవసరం లేదు. అందరికీ దర్శనం లభిస్తుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకుండా వచ్చేవారిలో 3.60 లక్షల మందికి సర్వ దర్శనాలు చేయించేలా ప్రణాళికలు సిద్ధంచేశాం. ఈ పది రోజుల్లో 7.70 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ 6.60 లక్షల మందికి మించి వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోలేదు. ఈ ఏడాది లక్ష మందికి అదనంగా దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేశాం. భక్తులు కూడా రద్దీకి అనుగుణంగా తిరుమల యాత్రను ప్లాన్‌ చేసుకుని రావాలి’ అని ఈవో సూచించారు. టోకెన్లలోనే పేర్కొన్న సమయానికే తిరుమలకు రావాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. కేటాయించిన సమయానికే వస్తే గంట నుంచి రెండు గంటల్లోనే వైకుంఠ ద్వార దర్శనం పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. చలిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు వేడివేడిగా నిరంతరాయంగా 14 రకాల అన్నప్రసాదాలు అందిస్తాం. 2,400 మంది పోలీసులు, 1100 మంది విజిలెన్స్‌ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామని ఈవో వెల్లడించారు.

Updated Date - Dec 27 , 2025 | 05:17 AM