Dy CM Pawan kalyan: దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఏపీదే : పవన్
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:43 PM
గత ఐదేళ్లలో విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. దీని విలువ రూ. 5 వేల కోట్ల ఉంటుందన్నారు. దాదాపు లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లు నరికేశారని వివరించారు. స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు.
తిరుపతి, నవంబర్ 08: దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. పొరుగనున్న నేపాల్‌లో సైతం శేషాచల అడువుల్లో పెరిగిన ఎర్రచందనం పట్టుబడిందని తెలిపారు. శనివారం తిరుపతిలోని మంగళంలో ఎర్రచందనం గోడౌన్లను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రేడ్ల వారీగా ఎర్రచందనం వివరాలను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు.

అనంతరం ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లు విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్నారు. దీని విలువ రూ. 5 వేల కోట్ల ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు లక్షా 30 వేల ఎర్రచందనం చెట్లు నరికేశారని వివరించారు. స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ఎర్రచందనం చెట్లను మనమే కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సూచించారు. అందుకోసం అధికారంలోకి రాగానే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా.. దానిని మనకే అప్పగించేలా ఒప్పందం ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

అంతకుముందు తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతంలో ఉన్నతాధికారులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం పర్యటించారు. తిరుపతి కొండల్లో మాత్రమే పెరిగే అరుదైన వృక్ష జాతి.. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురు తదితర మొక్కలను పరిశీలించి.. అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్దనున్న వాచ్ టవర్ నుంచి అటవీ ప్రాంతాన్ని బైనాక్యులర్స్‌తో ఆయన పరిశీలించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధించేందుకు చేపడుతున్న చర్యలు, ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ సిబ్బంది చేపడుతున్న కూంబింగ్ వివరాలను ఉన్నతాధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిన్న ముక్క తింటే.. ఈ వ్యాధులు దూరం
సూపర్.. ఈ రాశులకు రాజయోగం.. ఎన్ని రోజులంటే..
For More AP News And Telugu News