TDP: టీడీపీ మండలాధ్యక్షుల వంతు!
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:36 AM
కుప్పం మున్సిపాలిటీతోపాటు నాలుగు మండలాలకు పార్టీ అధ్యక్షుల నియామకంకోసం అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నేడో రేపో ప్రకటనకు అవకాశం
కుప్పం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గంలో అధికార పార్టీ పదవుల పంపిణీ ఆఖరి దశకు చేరింది. కుప్పం మున్సిపాలిటీతోపాటు నాలుగు మండలాలకు పార్టీ అధ్యక్షుల నియామకంకోసం అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాష్ట్రంలోని ఏ ఇతర నియోజకవర్గాలకన్నా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీ ఆసక్తిని రేకెత్తించే అంశం.ఇటీవలే ప్రధాన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. పీకేఎం ఉడా చైర్మన్‌గా డాక్టర్ బీఆర్.సురేశ్‌బాబు, కుప్పం రెస్కో చైర్మన్‌గా వీజీ.ప్రతాప్, కుప్పం వ్యవసాయ మార్కెట్టు కమిటీ చైర్మన్‌గా జిఎం.మునిరాజులతోపాటు ఆయా పాలక మండళ్లకు సభ్యుల నియామకం కూడా మూడునాలుగు రోజుల క్రితమే జరిగింది. అంతకు చాలా ముందుగానే పార్టీ పదవుల భర్తీ కూడా జరిగింది. కుప్పం పురపాలక సంఘం సహా కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలలో టీడీపీ బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు వెలువరించింది. వీటన్నింటికంటే ముందే మండల టీడీపీ అధ్యక్షుల నియామకం జరుగుతుందని భావించినా పోటీ అధికంగా ఉండడంతో పెండింగులో పెడుతూ వచ్చారు. నియోజకవర్గ టీడీపీలో త్రిమూర్తులుగా పార్టీ శ్రేణులు పిలుచుకునే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎ్‌స.మునిరత్నం, ఇటీవలే పీకేఎం ఉడా చైర్మన్‌గా నియమితులైన డాక్టర్ బీఆర్.సురేశ్‌బాబు రెండు రోజులక్రితం అమరావతికి వెళ్లారు. వీరితో మంతనాలు జరిపిన తర్వాతే కుప్పం నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షుల నియామకానికి ఐవీఆర్‌ఎస్ నిర్వహించడానికి పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన సింగిల్ విండో చైర్మన్ల నియామకాలపై ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఆ నిర్ణయాలను సరిదిద్దుతూ అక్కడ అవకాశం పొందని ఒకరిద్దరు స్థానిక నాయకులకు పార్టీ మండలాధ్యక్ష పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నారని చెబుతున్నారు.
మండలానికి ఇద్దరు చొప్పున....
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కుప్పం మున్సిపల్ అధ్యక్షుడిగా రాజ్‌కుమార్, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల అఽధ్యక్షులుగా ప్రేమ్‌కుమార్, విశ్వనాథ నాయుడు, ఆనందరెడ్డి ఉన్నారు. వీరి స్థానంలో నూతన అధ్యక్షులను నియమించడానికి ఎప్పటినుంచో కసరత్తు నడుస్తోంది. మండలాధ్యక్ష పదవులకోసం అధిష్ఠానానికి చాలానే దరఖాస్తులు వెళ్లాయి. అయితే ఆశావహుల జాబితాను వడబోసిన అధిష్ఠానం కుప్పం మున్సిపాలిటీకి ముగ్గురిని, మండలానికి ఇద్దరేసి చొప్పున కొన్ని పేర్లను ఎంపిక చేసింది. ఈ పేర్లపై ఆయా మండలాల కార్యకర్తలనుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. బుధవారం ఉదయం సుమారు ఆరున్నర గంటలనుంచి దాదాపు మధ్యాహ్నం 12 గంటల దాకా కార్యకర్తలకు ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా ఫోన్‌కాల్స్ వచ్చాయి. కుప్పం మున్సిపల్ అధ్యక్ష పదవికి ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ , కాణిపాకం వెంకటేశ్ , ఽమునెప్పల పేర్లలో ఒకరిని ఎంపిక చేసుకొమ్మని నిర్దేశించిన సంఖ్య గల బటన్ నొక్కమని ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో సూచించారు. అలాగే కుప్పం మండలాధ్యక్ష పదవికి ఽకంగుంది సర్పంచి ధనశేఖర్ , రాజగోపాల్ , జేకే.సంతోశ్ , గుడుపల్లె మండలాధ్యక్ష పదవికి ఎల్లప్ప, సుబ్రహ్మణ్యం , శాంతిపురం మండలాధ్యక్ష పదవికి ఉదయ్‌కుమార్ , ఆర్‌ఎ్‌స.మణి , రామకుప్పం మండలాధ్యక్ష పదవికి రామ్మూర్తి , వెంకటరమణ పేర్లను సూచిస్తూ ఐవీఆర్‌ఎస్ కాల్స్ పార్టీ శ్రేణులకు వచ్చాయి. అభిప్రాయ సేకరణకోసం పేర్కొన్న పేర్లలో ఎవరో ఒకరిని ఎంపిక చేసి, టీడీపీ మండలాఽధ్యక్షుల పేర్లను పార్టీ అఽధిష్ఠానం నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది.