Share News

Srikalahasti: ఆది దంపతుల కల్యాణం

ABN , Publish Date - Mar 02 , 2025 | 02:20 AM

అనంత విశ్వమే పందిరిగా... ఆచంద్రతారలే అలంకారాలుగా... భూమండలమే వివాహ వేదికగా... పంచభూతాల సాక్షిగా... అష్టదిక్కులు, ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతాగణాలు వీక్షిస్తుండగా... అశేష భకజన వాహిని మధ్య శనివారం ఆది దంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

Srikalahasti: ఆది దంపతుల కల్యాణం
ఆది దంపతుల కల్యాణోత్సవానికి తరలివచ్చిన జనం

శ్రీకాళహస్తి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): అనంత విశ్వమే పందిరిగా... ఆచంద్రతారలే అలంకారాలుగా... భూమండలమే వివాహ వేదికగా... పంచభూతాల సాక్షిగా... అష్టదిక్కులు, ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతాగణాలు వీక్షిస్తుండగా... అశేష భకజన వాహిని మధ్య శనివారం ఆది దంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా జ్ఞానప్రసూనాంబదేవికి శ్రీకాళహస్తీశ్వరుడు మాంగల్యధారణ చేశారు. ఇదే శుభ ఘడియలో ఆది దంపతుల సమక్షంలో 41 జంటలు వివాహం చేసుకుని ఒక్కటయ్యాయి. వధూవరులకు ముక్కంటి ఆలయం తరఫున మంగళసూత్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, దుస్తులు అందజేశారు. అంతకు మునుపు శుక్రవారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తదనంతరం స్వామివారిని గజ వాహనంపై, అమ్మవారిని సింహ వాహనంపై అధిష్టింపజేశారు. మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కళాకారుల ఆటలు, పాటల మధ్య ఆది దంపతులు పెండ్లిమండపం వద్దకు చేరుకున్నారు. మొదట పరమేశ్వరుడు చేరుకోవడంతో పార్వతీదేవి అలకబూనారు. చండికేశ్వరుడు మధ్యవర్తిత్వం నిర్వహించి అమ్మవారి అలక తీర్చారు. గంగాధరుడు, శివానీ పెళ్లిపీటలపై ఆశీసులయ్యారు. వేదపండితులు కలశ స్థాపన చేశారు. సంకల్పం, యజ్ఞాహుతి పూజలు పూర్తి చేశారు. పూజల అనంతరం వేదపండితులు మంత్రోచ్ఛరణలు చేస్తూ ఆదిదంపతుల కల్యాణ ఘట్టాన్ని పూర్తిచేశారు. కల్యాణం వీక్షించడానికి పట్టణవాసులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తజనం తరలివచ్చారు. నగరి వీధి, నెహ్రూవీధి భక్తులతో నిండిపోయాయి. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి దంపతులు, ఈవో బాపిరెడ్డి, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్‌, టీడీపీ నాయకుడు చెంచయ్యనాయుడు పాల్గొన్నారు.


నేడు కైలాసగిరి ప్రదక్షిణ

మహాశివరాత్రి వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. శివపార్వతుల కల్యాణానికి విచ్చేసిన సకల దేవతాగణాలు, మునులు, రుషులకు వీడ్కోలు పలికేందుకు స్వామి అమ్మవార్లు ఈ ప్రదక్షిణకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలో చలువ పందిళ్లు సిద్ధం చేశారు. అన్నప్రసాదాలు, తాగునీరు, పండ్లు, మజ్జిగ అందుబాటులో పెట్టనున్నారు.

నేటి వాహన సేవలు

ఉదయం: బనాత అంబారీ వాహన సేవ

రాత్రి: అశ్వ, సింహ వాహనసేవలు

Updated Date - Mar 02 , 2025 | 02:20 AM