Share News

MoU: ఆరు కంపెనీలతో కడా ఎంవోయూలు

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:36 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుప్పం పర్యటనలో కడా ద్వారా ఆరు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.

MoU: ఆరు కంపెనీలతో కడా ఎంవోయూలు
ఎంవోయూ పత్రాలతో చంద్రబాబు, ఏజీఎస్‌ - ఐటీసీ ప్రతినిధులు

శాంతిపురం/గుడుపల్లె/కుప్పం రూరల్‌,ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుప్పం పర్యటనలో కడా ద్వారా ఆరు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. కుప్పం పరిధిలో చెత్తనుంచి సంపద తయారు చేసేందుకు ఏజీఎస్‌(అకాడమీ ఆఫ్‌ గాంధీయన్‌ స్టడీస్‌)- ఐటీసీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు షీలీడ్స్‌, ఫైబర్‌ బోర్డు ఉత్పత్తికోసం కింగ్స్‌ వుడ్‌ డెకార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 2 సీటర్‌ ట్రైనింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు పయనీర్‌ క్లీన్‌ యాంప్స్‌ లిమిటెడ్‌, మీడియం లిఫ్ట్‌ లాంచింగ్‌ రాకెట్‌ రేజర్‌ క్రెస్ట్‌ ఎంకే-1 తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్పేస్‌ టెక్నాలజీ సంస్థ ఎత్రెయాల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ గిల్డ్‌, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌ ఏర్పాటుకు రెడ్‌ బెర్రీ పుడ్‌ లాజిక్స్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి.మొత్తం ఈ సంవత్సర కాలంలో రూ.3920 కోట్ల పెట్టుబడితో 12 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్ష్యంగా 15600 మందికి, పరోక్షంగా 26,500 మందికి ఉద్యోగ, ఉపాధి లభించనుంది.

కుప్పంలోఐ ఫోన్‌ ఛాసిస్‌ తయారీ కేంద్రం

కుప్పంలో హిందాల్కో అంతర్జాతీయ కంపెనీ రూ.587 కోట్ల పెట్టుబడితో ఐ ఫోన్‌ ఛాసీస్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

లబ్ధిదారులతో బస్సు ప్రయాణం

స్వగృహం నుంచి సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వివిధ పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతూ ఆయనీ ప్రయాణం చేశారు. వారికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిఽధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించడమే కాక, ఆయా పథకాల వల్ల వారు పొందుతున్న లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. రైతులతో హంద్రీ-నీవా నది ద్వారా తరలివచ్చిన కృష్ణమ్మ గురించి అడిగినప్పుడు వారి మాటల్లో, ముఖంలో కనిపించిన ఆనందం చూసి ఆయన ఉత్తేజితులయ్యారు.


ఆరుగురు పిల్లల తల్లికి రూ.78 వేలు

బహిరంగ సభా వేదికమీద రావడానికి చాలా సమయం ముందే ఇద్దరు మహిళలను ఆశీనులను చేశారు. చంద్రబాబు వేదిక మీదకు వచ్చి ప్రసంగం మధ్యలో ఆ మహిళల గురించిన వివరాలు తెలిపారు. సబీనా అనే ఆరుగురు పిల్లలు కలిగిన తల్లికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఏకంగా రూ.78 వేలు లబ్ధి చేకూరిందన్నారు. ఇద్దరు పిల్లల తల్లియైున దీపాలక్ష్మికి రూ.26 వేలు లబ్ధి చేకూరిందన్నారు.అంతేకాక ఆమె అత్తకు పింఛనుతోపాటు ఇంకా పలురకాల ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి చేకూరుతున్నదని చెప్పారు.

గణనాథుడి సేవలో

స్వగృహంనుంచి సభా ప్రాంగణానికి బయలుదేరిన చంద్రబాబు మార్గమధ్యంలోని కుప్పం ప్యాలెస్‌ రోడ్డులో యువ టీడీపీ నాయకుడు హర్షధర్మ తేజ, అతని మిత్రులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించి పూజలు చేశారు. రావణబ్రహ్మ అవతారంలో ఉన్న వినాయక ప్రతిమ రూపాన్ని చూసి యువతను మెచ్చుకున్నారు.

రింగ్‌ రోడ్డు ఏర్పాటుకు చర్యలు

కుప్పం-హొసూరు-బెంగళూరు రింగ్‌ రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమైందని సీఎం చెప్పారు. కుప్పం వయా కేజీఎఫ్‌ లింక్‌ రోడ్డు నిర్మాణం కూడా త్వరలోనే జరుగుతుందన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 01:36 AM