Inter exams: ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 02 , 2025 | 02:16 AM
జిల్లాలో శనివారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
చిత్తూరు సెంట్రల్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పుత్తూరు రోడ్డులో ఐటీఐ వరకు ట్రాఫిక్ జామ్‌తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ మార్గంలోనే పలు జూనియర్ కళాశాలలు ఉండటంతో మరిన్ని కష్టాలు తప్పలేదు. ఇవన్నీ ఇలా ఉంటే.. కళాశాలకు సంబంఽధించిన పేరు, సెంటర్ కోడ్‌తో కూడిన సూచిక బోర్డులు సరిగ్గా ఏర్పాటు చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పరీక్ష కేంద్రాల వద్ద కూడా హాల్‌టికెట్లు నెంబర్లను సూచించే నోటీసు బోర్డులు కూడా తగినన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ఇలా.. చిన్న చిన్న సంఘటనల నడుమ తొలి రోజు పరీక్షలు ముగిశాయి.
విద్యార్థుల హాజరు, గైర్హాజరు ఇలా..
ఇంటర్మీడియర్ ఫస్టియర్ (తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, తమిళం) పరీక్షలకు 16,568 మంది విద్యార్థులకు 15679 మంది హాజరవగా, 889 మంది గైర్హాజరైనట్లు డీవీఈవో సయ్యద్ మౌల తెలిపారు. జనరల్ విభాగంలో 14,480 మందికి 13,794 మంది హాజరవగా, 686 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. ఒకేషనల్‌లో 2088 మందికి 1885 మంది హాజరవగా, 203 మంది గైర్హాజరైనట్లు వివరించారు. డీవీఈవో, జిల్లా పరీక్షల కన్వీనర్.. నాలుగు సెంటర్లు, జిల్లా ప్రత్యేక అధికారి దయానందరాజు నాలుగు సెంటర్లను తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగలేదని, పరీక్ష కేంద్రాలను జిల్లా కార్యాలయం నుంచి పర్యవేక్షించినట్లు డీవీఈవో పేర్కొన్నారు.
ఆ 84 మందివి మరిన్ని కష్టాలు
తిరుపతికి చెందిన 84 మంది విద్యార్థులకు చిత్తూరు జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించిన విషయం తెలిసిందే. వీరంతా తమ పరీక్ష కేంద్రాలను గుర్తించడానికి మరిన్ని కష్టాలు పడాల్సి ఉంది.
ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ‘హాల్ టికెట్లు’ ఇవ్వకపోవడంపై విద్యాశాఖ సీరియస్
జిల్లా వ్యాప్తంగా 15 సెంటర్లలో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 15వ తేదీవరకు నిర్వహించనున్నారు. సార్వత్రిక విద్యాపీఠం కింద విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 64 స్టడీసెంటర్లు నిర్వహిస్తోంది. వీటి ద్వారా 3,419మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అయితే పరీక్షలకు ఇక రెండ్రోజులే సమయం ఉన్నా.. పలు స్టడీ సెంటర్ల నిర్వాహకులు అభ్యర్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. హాల్‌టికెట్లు వెంటనే అందించకుంటే స్టడీ సెంటరును బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు పరీక్షల చట్టం 25/1997 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
తిరుపతిలో 820 మంది ఇంటర్ విద్యార్థులు గైర్హాజరు
తిరుపతి(విద్య), మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సర లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. 8.30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతించారు. మెటల్ డిటెక్టర్లతో నిశితంగా తనిఖీ చేశారు. సెల్‌ఫోన్లు లాంటి ఎలకా్ట్రనిక్ పరికరాలను అనుమ తించలేదు. జిల్లాలో 86 పరీక్ష కేంద్రాల్లో జనరల్ విద్యార్థులకు, 15 కేంద్రాల్లో ఒకేషనల్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు డీఈసీ మెంబర్లు నిరంతరం పర్య వేక్షిస్తూ కనిపించారు. మొదటి సంవత్స రం పరీక్షలకు 33,164 మందికి గాను 820 మంది గైర్హాజరయ్యారని ఆర్‌ఐఓ జీవీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎస్పీ హర్షవర్ధనరాజు, ఆరోఐఓ నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. సోమవారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి.