Kuppam: గంగమ్మా..
ABN , Publish Date - May 21 , 2025 | 01:27 AM
కుప్పంలో మంగళవారం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ శిరస్సు ఊరేగింపు ఘట్టం నభూతో.. న భవిష్యతి అన్నట్టుగా సాగింది.
కుప్పం, మే 20 (ఆంధ్రజ్యోతి): డప్పుల మోతలు.. డోలు సన్నాయి మేళాలు.. భజనల తాళాలు.. ఊరుఊరంతా ఊగిపోయిం ది. ‘గంగమ్మా.. మమ్మేల రావమ్మా..’ అంటూ నీరాజనాలర్పించింది. కుప్పంలో మంగళవారం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ శిరస్సు ఊరేగింపు ఘట్టం నభూతో.. న భవిష్యతి అన్నట్టుగా సాగింది. అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం ముందుగా అమ్మవారి శిరస్సు కళ్ల తెర తొలగించి ప్రత్యేక పూజలు చేశారు. వంశపారంపర్య పూజారుల పర్యవేక్షణలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సంప్రదాయ పద్ధతుల్లో పూజాదికాలు నిర్వహించారు. కుప్పం పట్టణంలోని గంగబావి వద్ద ఈ సంరంభం జరిగింది. ఇక్కడినుంచి ఊరేగింపుగా బయలుదేరిన అమ్మవారు రాత్రి బాగా పొద్దుపోయేదాకా పట్టణంలోని నలుమూలలా భక్తులను కటాక్షిస్తూ గమించారు.ఆభరణ సంశోభితమై.. పుష్కాలంకార పూరితమైన అమ్మవారు మందగమనంతో ఆగిసాగుతూ.. సాగి ఆగుతూ.. భక్తులకు తనివితీరా దర్శనభాగ్యం కల్పించారు.జంతు బలులు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.ఆంధ్రాతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచి కూడా జనం తండోపతండాలుగా తరలివచ్చారు.స్త్రీపురుషులనే తేడా లేకుండా రకరకాలైన వేషాలతో వేపమండలు ధరించి అమ్మవారిని సేవించుకుని తరించారు.అమ్మవారి ఊరేగింపులో పాల్గొని.. మొక్కులు తీర్చుకుని ఆశీర్వాదాలు పొందారు.