Share News

Free bus: తిరుమలకూ ఫ్రీ బస్‌!

ABN , Publish Date - Aug 21 , 2025 | 01:42 AM

తిరుపతి-తిరుమల నడుమ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం చేస్తామని ఆ సంస్థ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు చేసిన ప్రకటన మహిళా యాత్రికులను మహదానందానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉచితంగానే తిరుపతికి చేరుకున్నా తిరుమలకు మాత్రం చార్జీలు చెల్లించాల్సిరావడం వీరిని అసంతృప్తికి గురిచేసింది. తాజా నిర్ణయం అమలు తేదీ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి తిరుమలకు ఉచితం చేయడం వల్ల ఆర్టీసీ మీద పడే భారం కూడా ఏమంత ఎక్కువ కాదు.

Free bus: తిరుమలకూ ఫ్రీ బస్‌!
ఫ్రీ బస్‌!

ప్రభుత్వంపై రూ.23 కోట్ల అదనపు భారం

తిరుపతి, ఆంధ్రజ్యోతి: స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తే ఏటా పాతిక లక్షల మందికి పైగా మహిళా ప్రయాణికులకు లబ్ధి చేకూరనుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.23 కోట్ల వరకూ భారం పడనుంది. ఈనెల 15వ తేదీ నుంచీ రాష్ట్రవ్యాప్తంగా నిర్ణీత ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతి-తిరుమల మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో మాత్రం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం వర్తించదని ప్రకటించిడం తెలిసిందే. దీనిపై వివిధ వర్గాల నుంచీ వచ్చిన విన్నపాలు, సలహాలు, సూచనలతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో తిరుపతి-తిరుమల నడుమ మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వర్తింపజేయాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు మంగళవారం ఆర్టీసీ ఛైర్మన్‌ ప్రకటించారు. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంపై రూ. 23 కోట్లు అదనపు భారం పడనున్నప్పటికీ ప్రభుత్వం సంతోషంగానే దానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం.

ఏటా పాతిక లక్షల మందికి ప్రయోజనం

ప్రస్తుతం తిరుపతి-తిరుమల నడుమ 298 డీజిల్‌ బస్సులు, 64 ఏసీ సదుపాయంతో కూడిన ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఏసీ కలిగిన ఎలక్ట్రిక్‌ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం లేదు. మిగిలిన బస్సులు తిరుపతి-తిరుమల నడుమ రోజుకు 1160 ట్రిప్పులు (రానుపోను కలిపి ఒక ట్రిప్పు) తిరుగుతున్నాయి. వీటిల్లో రోజుకు 45 వేల మంది తిరుమల- తిరుపతి నడుమ ప్రయాణిస్తున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళలు. అంటే 13,500 మంది ఆడవాళ్లు . వీరిలోనూ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇక ఏపీకి చెందిన మహిళా ప్రయాణీకల సంఖ్య సగటున ఒక ట్రిప్పుకు 6 మంది చొప్పున ఉంటారని అంచనా. ఆ లెక్కన రోజుకు సుమారు 7 వేల మంది ఏపీ మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు. నెలకు 2.10 లక్షల మంది, ఏడాదికి 23 లక్షల మంది వంతున కొండకు వెళ్ళి వస్తున్నట్టు ఆర్టీసీ అంచనాలు చెబుతున్నాయి. అయితే వీరిలో భక్తులే కాకుండా టీటీడీలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులు, చిరు వ్యాపారులు, కూలీలు సైతం వున్నారు.


రూ.180 మిగులుతుంది

తిరుపతి-తిరుమల నడుమ దూరం 24 కిలోమీటర్లు. ఆర్టీసీ డీజిల్‌ బస్సుల్లో చార్జీ ఒక వైపునకు రూ.90లు. అంటే ఒక మహిళకు తిరుమలకు వెళ్లిరావడానికి 180 రూపాయలు ఖర్చవుతుంది. దీన్ని ఉచితం చేయడం వల్ల కుటుంబాలతో తిరుమల కొండకు వచ్చేవారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. అయితే తిరుమలకు ఉచితం చేస్తే ఆర్టీసీ మీద పడే భారం ఏడాదికి రూ. 23 కోట్లు. ఉచిత ప్రయాణ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 1960 కోట్ల ఆర్థిక భారాన్ని మోసేందుకు సిద్ధపడింది. ఈ 23 కోట్లు మోయలేనంత భారం కాదు. భక్తుల్లో సంతోషం నింపడానికి ఇది కారణం అవుతుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఉచిత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

Updated Date - Aug 21 , 2025 | 01:42 AM