Share News

JEE: జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:15 AM

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలలో ప్రవేశాలకోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో గతనెలలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ తొలివిడత ఫలితాలను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు.

JEE: జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు
భానుచరణ్‌రెడ్డి , మణిదీ్‌పరెడి, నిఖిల్‌

తిరుపతి(విద్య), ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలలో ప్రవేశాలకోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో గతనెలలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ తొలివిడత ఫలితాలను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈఫలితాల్లో తిరుపతిలోని పలు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో చదివే పలువురు విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్‌ మార్కులు సాధించి సత్తాచాటారు. వీరిలో నారాయణ విద్యాసంస్థలకు చెందిన ఎం.భానుచరణ్‌రెడ్డి(99.99 పర్సంటైల్‌), డి.మణిదీ్‌పరెడ్డి (99.98), కె.నిఖిల్‌ (99.98), బీవీ ధనుష్‌ (99.97), కార్తీక్‌ శ్రీలక్ష్మీపతి (99.93), కె.యశ్విత (99.90), శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన కె.అభిరామ్‌ (99.83), ఓరుగంటి మోక్షిత్‌ శర్మ (99.83), కె.జీవనకుమార్‌ (99.26), వై.నిఖిల్‌ (99.08), బీవీకే జూనియర్‌ కళాశాల (అమరావతి ఐఐటీ అకాడమీ)కు చెందిన బి.అరుణ్‌కుమార్‌రెడ్డి (99.93), శ్రీధర్స్‌ ఐఐటీ, జేఈఈ-నీట్‌ అకాడమీ విద్యార్థి పి.నిఖిలేశ్వర్‌ (99.25) పర్సంటైల్‌ మార్కులు సాధించి ప్రతిభచాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

సత్తాచాటిన అధ్యాపకుడి కుమారుడు

శ్రీకాళహస్తి మండలం గుంటకిందపల్లెకి చెందిన ప్రైవేట్‌ కళాశాల అధ్యాపకుడు మాండవీపురం జయభారత్‌రెడ్డి, రేఖ దంపతుల కుమారుడు భానుచరణ్‌రెడ్డి 99.99 పర్సంటైల్‌ మార్కులతో సత్తాచాటారు. ‘ఐఐటీయే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకుని సాధన చేస్తున్నా. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేశా. కళాశాలలో టీచర్లు బోధించే అంశాలను క్రమం తప్పకుండా సాధన చేశా. అడ్వాన్స్‌లో మంచి పర్సంటైల్‌ సాధించి ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేయాలన్నది ఆశయం’ అని భానుచరణ్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రతిభచాటిన ప్రభుత్వ టీచర్‌ కుమారుడు

శ్రీకాళహస్తికి చెందిన ప్రభుత్వ టీచర్‌ శ్రీనివాసబాబు, రాధిక దంపతుల కుమారుడు కె.అభిరామ్‌ 99.83పర్సంటైల్‌ మార్కులతో ప్రతిభచాటారు. ‘ఐఐటీలో సీటు సాధనే లక్ష్యంగా అభ్యసన సాగించడంతో మంచి పర్సంటైల్‌ వచ్చింది. కళాశాలలో టీచర్స్‌ చెప్పిన నోట్స్‌, మెటీరియల్‌, టెక్నిక్స్‌ని క్రమం తప్పకుండా అనుసరించా. అడ్వాన్స్‌లో మంచి పర్సంటైల్‌ సాధించి ఐఐటీలో ఇంజినీరింగ్‌విద్యని చదవాలన్నది నా లక్ష్యం’ అని అభిరామ్‌ చెప్పారు.


రైతు ఇంట విద్యాకుసుమం

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కుక్కరాజుపల్లెకి చెందిన రైతు రఘురామ్‌రెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు అరుణ్‌కుమార్‌రెడ్డి 99.83 పర్సంటైల్‌ సాధించారు. ‘టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని.. నిరంతరం సాధన చేయడం వల్ల మంచి పర్సంటైల్‌ వచ్చింది. కెమిస్ట్రీకి ఎన్‌సీఈఆర్టీ బుక్స్‌, గణితం, ఫిజిక్స్‌ సబ్జెక్టులలో అధ్యాపకులు బోధించిన నోట్స్‌ని ప్రణాళిక ప్రకారం అధ్యయనం చేశా. ఐఐటీలో సీటు సాధించాలన్నది ఆశయం’ అని అరుణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

రాణించిన టీవీ టెక్నీషియన్‌ కుమారుడు

తిరుపతి నగరం జీవకోనకు చెందిన టీవీ టెక్నీషియన్‌ దయాకర్‌, మహేశ్వరి దంపతుల కుమారుడు పి.నిఖిలేశ్వర్‌ 99.25పర్సంటైల్‌ మార్కులు పొందారు. ‘కళాశాలలో అధ్యాపకులు బోధించిన టెక్నిక్స్‌ ఉపయోగపడ్డాయి. పాఠశాల విద్య నుంచీ ఐఐటీలో సీటు సాధించాలన్న ఆశయంతో ప్రణాళిక ప్రకారం చదివా. అడ్వాన్స్‌లోనూ మంచి పర్సంటైల్‌ చూపి ఐఐటీలో కంప్యూటర్‌సైన్స్‌ ఇంజినీరింగ్‌ చేయాలన్నది లక్ష్యం’ అని చెప్పారు నిఖిలేశ్వర్‌.

Updated Date - Feb 12 , 2025 | 01:15 AM