Share News

Teachers: షెడ్యూల్‌ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:13 AM

షెడ్యూల్‌ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌తో గంటలకొద్దీ నిరీక్షిస్తూ కొత్త టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇందులో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమూ కనిపిస్తోంది.

Teachers: షెడ్యూల్‌ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌
కౌన్సెలింగ్‌ కేంద్రం

తిరుపతి (విద్య), అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్‌ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌తో గంటలకొద్దీ నిరీక్షిస్తూ కొత్త టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇందులో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమూ కనిపిస్తోంది. మెగా డీఎస్సీ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంపికైన 1403 మంది టీచర్లలో 1394 మంది చిత్తూరు, తిరుపతి, గూడూరులోని ఆరు కేంద్రాల్లో ఎనిమిది రోజుల పాటు.. అక్కడే ఉండి శుక్రవారంతో శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ కాలంలోనే చివరి రెండు రోజులు వెబ్‌, మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి, వీరికి పోస్టింగులు కేటాయించాలి. దీనికిగాను ఎస్జీటీలకు గురువారం మధ్యాహ్నం 3 నుంచి మాన్యువల్‌, స్కూల్‌ అసిస్టెంట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ విజయరామరాజు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జిల్లాలో మాత్రం దీనికి భిన్నంగా జరగడం.. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఎందుకంటే.. తిరుపతి నగరం జీవకోనలోని విశ్వం స్కూల్‌లో మాన్యువల్‌ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లను తిరుపతి డీఈవో కేవీఎన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశారు. కౌన్సెలింగ్‌ నిర్వహణకు లాగిన్‌ అధికారమున్న చిత్తూరు డీఈవో వరలక్ష్మి వివిధ కారణాలతో రాత్రి 10.30 గంటలకు వచ్చారు. దీంతో అర్ధరాత్రి 11 గంటల తర్వాత మొదలై.. శుక్రవారం వేకువ జాము 4 గంటలకు వరకు 250 మందికి కౌన్సెలింగ్‌ పూర్తి చేశారు. షెడ్యూల్‌ ప్రకారం మిగిలిన వారికి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తిరుపతి రూరల్‌ ప్రాంతంలోని మెడ్‌జీ స్కూల్లో 450 మందికి కౌన్సెలింగ్‌ ప్రారంభించాలి. కానీ, 4.30 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలు పెట్టి రాత్రి పది గంటలకు కౌన్సెలింగ్‌ పూర్తయింది. ఇక, గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్‌ కాలేజీలో 175 మంది ఎస్జీటీలకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. చిత్తూరు కేంద్రంలో స్కూల్‌ అసిస్టెంట్లకు మూడు గంటలు ఆలస్యంగా.. సాయంత్రం 6 గంటలకు మొదలైన వెబ్‌ కౌన్సెలింగ్‌ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగింది. ఇలా షెడ్యూల్‌ ప్రకారం కౌన్సెలింగ్‌ జరగకపోవడానికి సాంకేతిక సమస్యలూ కారణమని అధికారులు చెబుతుండటం గమనార్హం.

ఖాళీలు చూపడంలోనూ స్పష్టత కరువు

ఉమ్మడి జిల్లాలోని టీచర్‌ పోస్టుల ఖాళీలను పూర్తిగా చూపలేదు. హెచ్‌ఆర్‌ఏ 16శాతం, 12 శాతం వచ్చే రెండు కేటగిరిల్లో (కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో) 500 ఖాళీలను బ్లాక్‌ చేశారు. వీటిల్లోనే టీచర్‌ పోస్టుల ఖాళీలు అధికంగా ఉన్నాయి. నగరాలు, పట్టణాల్లో కనీసం 400 ఖాళీలైనా కొత్త టీచర్లతో భర్తీ చేసుంటే ఈ ప్రాంత విద్యార్థులకు కొంతవరకైనా న్యాయం జరిగేది. అలా కాకుండా కొత్త టీచర్లందరినీ మూడు నాలుగు హెచ్‌ఆర్‌ఏ కేటగిరి పరిధిలోకి వచ్చే మండల స్థాయిలోని గ్రామీణ పాఠశాలలకే పరిమితం చేశారు. ఈ ఖాళీలు మాత్రమే జాబితాలో చూపారు.

స్థానాల జాబితాలో తారుమారు

కౌన్సెలింగ్‌ పక్రియలో సర్వర్లు బిజీగా ఉండటంతో కౌన్సెలింగ్‌ ఆలస్యానికి మరో కారణంగా తెలుస్తోంది. మరో వైపు కొన్ని ప్రాంతాల ఖాళీలు తప్పుగా నమో దు కావడం,వాటిని సవరించేందుకు సాంకేతిక సిబ్బ ంది సమయం తీసుకోవడంతో ఇటు విద్యాశాఖ అధికారులు, అటు కొత్త టీచర్లు తలలు పట్టుకున్నారు. ఖాళీలను ప్రచురించిన జాబితాలో పారదర్శకత లేకపోవడంతోనూ కొత్త టీచర్లు విస్తుపోతున్నారు.


ఒత్తిడికి గురై పడిపోయిన చిత్తూరు డీఈవో

చిత్తూరు సెంట్రల్‌/తిరుపతి(విద్య), ఆంధ్రజ్యోతి: ఎస్జీటీలకు స్థానాల కేటాయింపు కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఒత్తిడికి గురైన చిత్తూరు డీఈవో వరలక్ష్మి.. శుక్రవారం మధ్యాహ్నం గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్‌ కాలేజీలో మెట్లు ఎక్కుతూ పడిపోయారు. ఈ కాలేజీలో 175 మంది ఎస్జీటీ (తమిళం, ఉర్దూ ల్వాంగ్వేజ్‌స)లకు ఉదయం 8.30 గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాలి. డీఈవో సకాలంలో వెళ్లకపోవడం, సాంకేతిక కారణాలతో రాష్ట్ర ఐటీ సెల్‌ నుంచి టీచర్ల కేటాయింపు స్థానాలు డిస్ప్లే కాలేదు. దీంతో మధ్యాహ్నం వరకు మొదలు కాలేదు. దీనిపై విద్యాశాఖ కమిషనరేట్‌ అధికారులు ఆర్జేడీపై.. కడప నుంచి ఆయనతోపాటు కమిషనరేట్‌ అధికారులూ డీఈవో వరలక్ష్మిపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఆ కళాశాల ప్రాంగణంలో ఒక చోట మెట్టు ఎక్కబోతూ డీఈవో ఉన్నపాటున పడిపోయారు. సిబ్బంది హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి స్కానింగ్‌ చేయించారు. ప్రాథమిక వైద్యం అందించగా, డీఈవో కోలుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కౌన్సెలింగ్‌ను మొదలుపెట్టి సాయంత్రం ఆరు గంటలకు పూర్తి చేశారు.

Updated Date - Oct 11 , 2025 | 02:13 AM