Tirumala: బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయండి
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:01 AM
వచ్చేనెల మొదటి వారంలోపు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు.
తిరుమల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): వచ్చేనెల మొదటి వారంలోపు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలో సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2వ తేది వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధనరాజు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి మాడవీధుల్లో తిరిగారు. గ్యాలరీల నుంచి భక్తులు ఇబ్బంది పడకుండా వాహనసేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సెప్టెంబరు మొదటివారంలోపు ఇంజినీరింగ్ పనులు పూర్తిచేయాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారన్నారు. మాడవీధుల్లో అదనపు మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు అవసరమైన పారిశుధ్య సిబ్బందిని నియమిస్తామన్నారు. ఈ ఏడాది అదనపు ట్రిప్పుల కోసం ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. ముందస్తుగా పార్కింగ్ ప్రణాళికలు రూపొందించామని వివరించారు. టీటీడీ సీఈ సత్యనారాయణ, డిప్యూటీఈవో లోకనాథం, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
నెల తర్వాత అందుబాటులోకి స్వామి పుష్కరిణి
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తిచేసుకుని బుధవారం నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఏటా బ్రహ్మోత్సవాల ముందు శ్రీవారి పుష్కరిణిని మరమ్మతులను చేయడం పరిపాటి. ఈక్రమంలో జూలై 20వ తేదీన పుష్కరిణిలో మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. పాత నీటిని తొలగించి అడుగుభాగంలో పేరుకుపోయిన ఇసుక, పాచి తొలగించారు. మెట్లకు రంగులు వేశారు. దాదాపు కోటి లీటర్ల నీటితో పుష్కరిణిని నింపి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరమ్మతుల సందర్భంగా నెల పాటు నిలిపేసిన పుష్కరిణి హారతిని తిరిగి ప్రారంభించడంతో పాటు భక్తులనూ పుష్కరిణిలోకి అనుమతించారు.