CM: సీఎం కుప్పం పర్యటన విజయవంతం
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:48 AM
పంచెకట్టులో నిండైన రూపం.. పెదవులపై చెరగని దరహాసం..ఆనందంతో జనాలకు అభివాదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలా కాకుండా భిన్నంగా కనిపించారు, వ్యవహరించారు. అధినేతకు జేజేలు.. ప్రాంగణమంతా ఈలలు.. మాటమాటకీ పట్టలేని ఆనందంతో గోలగోలలు.. జడత్వాన్ని వదుల్చుకున్న జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబులో ఎన్నడూ లేని పులకింత కనిపించగా.. జనంలో నిస్తేజం పటాపంచలై కేరింతలతో వెల్లువెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఎప్పటిలా కాకుండా, నూతనత్వంతో ఆద్యంతం ఉత్సాహం ఉరకలు వేసేలా విజయవంతంగా సాగి ముగిసింది.
కుప్పం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):శ్రీశైలం ప్రాజెక్టునుంచి 738 కిలోమీటర్లు సాగి, తరలి వచ్చిన కృష్ణమ్మకు కుప్పంలోని పరమసముద్రం చెరువు వద్ద హంద్రీ-నీవా కాలువలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం జలహారతి ఇచ్చారు.ఆ సమయంలో ఆయన ఆహార్యం చూసిన జనం ఆశ్చర్యపోయారు. శాంతిపురం మండలంలో ఇటీవలి స్వగృహ ప్రవేశంలో తప్ప, ఆయన కుప్పం ప్రజలకు ఎన్నడూ, ఏ కార్యక్రమంలోనూ పంచెకట్టులో కనిపించకపోవడం, ఇప్పుడు నిండైన పంచెకట్టుతో కనువిందు చేయడమే వారి ఆశ్చర్యానికి కారణం. కేవలం జలహారతి సమయంలోనూ కాదు.. తర్వాత జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన పంచెకట్టు, షర్టుతోనే పాల్గొనడం వారిలో మరింత ఆశ్చర్యంతోపాటు ఆనందాన్ని కలిగించింది. తెలుగు సంప్రదాయంలో గంగమ్మను పూజించుకోవడమే కాక, సంప్రదాయ దుస్తులను పర్యటన ఆద్యంతం ధరించడం ప్రధాన విశేషంగా ప్రజలు చెప్పుకున్నారు. అంతేనా.. చంద్రబాబు ప్రసంగం ఎప్పటిలా హైఫై గా సాగలేదు. జలాలు.. పొలాలు.. హలాలు.. ఆయన వాక్యంలో అడుగడుగునా పలకరించాయి. సభ ప్రారంభంనుంచి ముగిసే వరకూ ఆయన పెదవులపై సంతృప్తికర హాస రేఖలు తొంగిచూశాయి. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు కచ్చితంగా ఉదయం 10.30గంటలకు శాంతిపురం మండలం కడపల్లె వద్ద గల ఇంటినుంచి బయటకు వచ్చి వివిధ పథకాల లబ్ధిదారులతో అప్పటికే నిండిన ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఒక కుటుంబ సభ్యుడిలా వారిని పలుకరిస్తూ, కష్టసుఖాలు ఆరాతీస్తూ, పథకాల ద్వారా పొందుతున్న లబ్ధి వివరాలు తెలుసుకుంటూ పరమసముద్రం చెరువు వద్దకు చేరుకున్నారు. సమీపంలోని హంద్రీ-నీవా కాలువలో ముహూర్తం వేళ అయిన ఉదయం 11.30 గంటలకు జలహారతి ఇచ్చి కృష్ణమ్మకు పూజలు చేశారు.తర్వాత పైలాన్ ఆవిష్కరణకు ముందు హంద్రీ-నీవా రూట్ మ్యాప్ పరిశీలించారు. సంబంధిత ఫొటోలతో కూడిన ఎగ్జిబిషన్ సందర్శించారు. హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారులు ఆయా వివరాలను సీఎంకు వివరించారు. కాలువ పొడవునా సీసీ కెమెరాలు పెట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని, హంద్రీ-నీవా కాలువ ప్రయాణం, అందుకు ప్రభుత్వం పడిన ఇబ్బందులు, సాధించిన విజయాలు, ఫలితాలను సూచించేలా, చిన్నలు పెద్దలకు అర్థమయ్యేలా నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర కేంద్రాలలో ప్రత్యేకమైన ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ఎంత వ్యయమైనా భరించేందుకు తాను సిద్ధమన్నారు. అనంతరం హంద్రీ-నీవా కాలువ నిర్మాణం పూర్తయి కృష్ణా జలాలు కుప్పం చేరినందుకు గుర్తుగా నిర్మించిన పైలాన్‌ను ఉదయం 11.50 గంటలకు ఆవిష్కరించారు.అనంతరం చంద్రబాబు జనాల ఆనందాన్ని పంచుకుంటూ వారితో కలిసి సెక్యూరిటీ లేకుండా కాలువ గట్టు వెంట పరమసముద్రం చెరువు వద్దకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. అక్కడ అప్పటికప్పుడు సిద్ధం చేసిన బెలూన్ తెప్పలో ఎక్కి చెరువంతా కలియదిరిగారు. ఈ కార్యక్రమం షెడ్యూల్‌లో లేకపోయినా ఆయనలో ఉరకలు వేసే ఉత్సాహం ఈ పనిచేయించింది. తర్వాత సుమారు గంట ఆలస్యంగా మధ్యాహ్నం 1.45 గంటలకు బహిరంగ సభావేదికకు చేరుకున్నారు.
ఉరవడిగా సాగిన ప్రసంగం
సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం పడికట్టు పదాలతో పునరావృతమయ్యే వాక్యాలతో సాగుతుంది. అయితే జలహారతి సందర్భంగా ఆయన ప్రసంగం ఒక ఉరవడిలో, హంద్రీ-నీవా కాలువలో ఉరకలెత్తే కృష్ణా ప్రవాహంలా సహజ ఉధృతితో సాగింది. మధ్యాహ్నం 1.32 గంటలకు ప్రారంభమైన ఆయన ప్రసంగం ఏకధాటిగా సుమారు 1.15 గంటపాటు కొనసాగి మధ్యాహ్నం 2.45 గంటలకు ముగిసింది. జలాలే జీవితం అని ప్రతిపాదించిన చంద్రబాబు, హంద్రీ-నీవా కాలువను శ్రీశైలంనుంచి కుప్పం దాకా నిర్మించి కృష్ణా జలాలతో కరువు నేలను పావనం చేయడానికి తాను ఎన్ని కష్టాలు పడిందీ, మధ్యలో వైసీపీ పాలనలో ప్రాజెక్టు ఎలా ఆగిపోయిందీ, తిరిగి మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంత పట్టుదలతో కాలువ నిర్మాణం పూర్తిచేసి కృష్ణమ్మను కుప్పం తీసుకు వచ్చిందీ సవివరంగా ప్రజలకు తెలియజెప్పారు. కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయని చమత్కరించిన ఆయన, జలాల ప్రాముఖ్యత, అన్నదాతకు వాటి అవసరం, పాడిపంటలతో జీవితాలు సుఖవంతం కావడం వంటి అంశాలతో గ్రామీణ ప్రాంత ప్రజల మనసులను చూరగొన్నారు. కరువు నేలలో బోర్లు వేసి నీళ్లు పడక నష్టపోయిన రైతు ముఖంలో కృష్ణమ్మ తెచ్చిన ఆనందాన్ని తన మాటల్లో వర్ణించారు. వరి వద్దని, వాణిజ్య పంటలే వేయమని సలహా ఇచ్చారు. తన సహజ శైలికి భిన్నంగా అచ్చమైన రైతు బిడ్డలా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతుంటే సభకు హాజరైన గ్రామీణ జనం మంత్రముగ్ధులై విన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు వేదిక వెనుక ప్రత్యేకంగా వేసిన గుడారంలోకి వెళ్లి, కుప్పంలో ప్రాజెక్టులు నిర్మించనున్న 5 కంపెనీలతో కడా ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.షెడ్యూల్‌లో పేర్కొన్న సమయానికి సుమారు 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 6 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా బెంగళూరు పయనమయ్యారు.