CM: 30న కుప్పంలో కృష్ణా జలాలకు సీఎం హారతి
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:39 AM
ఈనెల 30వ తేది కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చి స్వాగతించనున్నట్లు హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్ ఎస్‌ఈ విఠల్ ప్రసాద్ తెలిపారు.
పుంగనూరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఈనెల 30వ తేది కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చి స్వాగతించనున్నట్లు హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్ ఎస్‌ఈ విఠల్ ప్రసాద్ తెలిపారు.తిరుపతి తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్‌ఇంజనీర్ ఎంఎల్‌ఎన్ వరప్రసాద్‌తో కలిసి పుంగనూరు మండలం ఈడిగపల్లె సమీపంలోని యాతాలవంక, నేతిగుట్లపల్లె ప్రాంతాల్లోని హంద్రీనీవా కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ విఠల్ ప్రసాద్ ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ అనంతపురం జిల్లా చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి బుధవారం నాటికి 120 కిలోమీటర్లు ప్రవహించిన నీళ్లు గురువారం మదనపల్లె చేరుతాయన్నారు. పుంగనూరు, పలమనేరు దాటి కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువుకు హంద్రీనీవా జలాలు ఈనెల 26వ తేదిలోపు చేరుతాయని వివరించారు. గతంలో కాల్వలు సక్రమంగా లేకపోవడం, లైనింగ్ తదితర సమస్యలతో నీరు పారే పరిస్థితి లేదన్నారు. సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రత్యేక చొరవతో పుంగనూరు బ్రాంచికెనాల్‌లో 135 కిలోమీటర్లకు రూ.360 కోట్లు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు రెండు ప్యాకేజీలుగా 130 కిలోమీటర్ల అభివృద్ధికి రూ.170 కోట్లు మంజూరు చేయడంతో కాల్వ విస్తరణ పనులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం కృష్ణాజలాలతోబాటు శ్రీశైలం నీరుకూడా వేగంగా చెర్లోపల్లె రిజర్వాయర్‌కు వస్తున్నట్లు చెప్పారు. చెర్లోపల్లెలో 1.08టీఎంసీలు నిల్వ చేసి కాల్వలకు నీరు ఇస్తామన్నారు. మూడులిప్టుల పంపింగ్ సిస్టమ్ ద్వారా నీరు గంటకు 2కిలోమీటర్లు పారుతోందని వివరించారు.తొలివిడతలో చివర ప్రాంతమైన పరమసముద్రం చెరువులో 21 ఎంసీఎ్‌ఫటీ నీరు ఉంచి కుప్పం నియోజకవర్గంలోని 62 చెరువులు, పలమనేరులో 48 చెరువులు మొత్తం 110 చెరువులకు నీరు ఇచ్చేలా లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. తర్వాత పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని చెరువులకు నీళ్లు ఇస్తామన్నారు.