Cyber:సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:12 AM
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు.

చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు. ప్రపంచ సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్లో డీఏఐవో వెంకటేశ్వర్‌తో కలిసి సైబర్ మోసాలకు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్ అరెస్టు, కేవైసీ, ఓటీపీ నెట్‌బ్యాంకింగ్ ఫ్రాడ్, ఇన్వె్‌స్టమెంట్ ఫ్రాడ్ స్కామ్, లాటరీ స్కామ్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ స్కామ్, ఫేక్ యాప్స్, లోన్ స్కామ్స్, వర్క్ ఫ్రం హోమ్ స్కామ్, జాబ్ స్కామ్స్, యూపీఐ స్కామ్స్ వంటి సైబర్ మోసాల్లో యువత చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటీపీ, ఆధార్, పాన్ లేదా బ్యాంకు వివరాలు ఫోన్ చేసిన అపరిచితులకు వెల్లడించరాదని సూచించారు. వ్యక్తిగత సమాచారం లేదా డబ్బులు అడిగే అనధికార కాల్స్‌కు స్పందించ కూడదన్నారు. పోలీసు, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలు వీడియో లేదా వాయిస్ కాల్స్ ద్వారా మీపై ఎటువంటి దర్యాప్తు చేయవన్నారు. సున్నితమైన లావాదేవీలకోసం వైఫైని ఉపయోగించుకోవాలని కోరారు. సైబర్ ఫిర్యాదులకోసం 1930కి కాల్ చేయాలని, లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలన్నారు.సైబర్ మోసగాళ్ళ బారిన పడ్డ వాళ్లు వెంటనే జిల్లా పోలీసు వాట్సప్ నెంబరు 94409 00005 లేదా సైబర్ మిత్ర 91212 11100, సైబర్ క్రైమ్ టోల్‌ఫ్రీ నెంబరు 1930కి లేదా చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న సైబర్‌సెల్‌కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చని ఎస్పీ మణికంఠ సూచించారు.