Staff Nurse: రూ.50 వేలిస్తే ఉద్యోగం
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:26 AM
స్టాఫ్ నర్సు ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే ఆడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో విచారణ ప్రారంభించారు.

ఆడియో వైరల్ కావడంతో విచారణకు కలెక్టర్ ఆదేశం
చిత్తూరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): స్టాఫ్ నర్సు ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే ఆడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో విచారణ ప్రారంభించారు.ఈ నెల 3వ తేదీన జిల్లాలో 150స్టాఫ్ నర్సు, 15 ఫార్మసిస్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సుమారు 533 మందితో కూడిన అభ్యర్థుల మెరిట్ జాబితాను వైద్యఆరోగ్యశాఖ అధికారులు తాజాగా విడుదల చేశారు. అందులో అభ్యర్థుల ఫోన్ నెంబర్ సహా అడ్రస్ వివరాలున్నాయి. దీన్ని అదునుగా చేసుకున్న ఒక వ్యక్తి తన పేరు డి.బాలాజీ అంటూ అభ్యర్థులకు ఫోన్ చేసి ఉద్యోగాలిప్పిస్తామంటున్నాడు. 8981491288 నెంబరుతో అభ్యర్థులకు కాల్ చేసిన అతడు 601310110010709 నెంబరుతో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబరు ఇచ్చాడు. ఐఎ్‌ఫఎస్ కోడ్ ఆధారంగా సెర్చ్ చేయగా, అది ఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ అని తేలింది. అభ్యర్థులతో మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే విచారణ ప్రారంభించారు.
అతనేం మాట్లాడాడంటే...
‘ఎవ్వరికీ చెప్పకుండా నా అకౌంట్‌లో రూ.50 వేలు అడ్వాన్సుగా డబ్బులు వేయండి. ఉద్యోగం మీకే వచ్చేలా నేను మీకు సాయం చేస్తా. ఈ విషయం ఎవ రికీ చెప్పొద్దు’ అంటూ తిరుపతిలోని ఒక ఆస్పత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సుతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పాటు రొంపిచెర్లకు చెందిన షాహీనా అనే మరో అభ్యర్థికి వాట్సాప్ కాల్ చేయగా, ఆమె రికార్డు చేసుకోలేకపోయింది. వెంటనే ఆమె సోదరుడు ఆ నెంబర్‌కు కాల్ చేయగా.. ‘రూల్స్ ప్రకారం షాహీనాతోనే మాట్లాడాలి. కాన్ఫరెన్సులో మాపై అధికారులు మీ మాటలు వింటున్నారు. మీ అప్లికేషన్ రిజెక్టయ్యే అవకాశముంది. ఆ అమ్మాయి నెంబరు నుంచి ఆ అమ్మాయే మాట్లాడాలి. నా వివరాలు అడగొద్దండి. ఇదంతా సీక్రెట్‌గా చేస్తున్నాం’అంటూ ఆ వ్యక్తి జవాబిచ్చాడు. ఈ రెండు ఆడియో క్లిప్పులు వైరల్ అవుతున్నాయి.
విచారించి చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ సుమిత్‌కుమార్
స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. నిందితుడు డ్రైవర్ అని తెలిసింది. పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటాం. కేసు కూడా నమోదు చేస్తున్నాం.