Share News

Chittoor: పల్లె కన్నీరు పెడుతూనే ఉంది...

ABN , Publish Date - Aug 15 , 2025 | 08:31 AM

క్యాలెండర్‌లో కాయితాలు చిరిగిపోతున్నాయి తప్ప, ప్రజల కడగండ్లు తీరుతున్నాయా? అధికారం చేతులు మారింది తప్ప, జీవనప్రమాణాలు పెరిగాయా? సొంత పాలనలోకి మారి ఏడు దశాబ్దాలు దాటి ఎనిమిదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్నా పల్లెలు ఈసురోమంటూనే ఉన్నాయి. సేద్యం ఒక జూదంగా మారిపోయింది.

Chittoor: పల్లె కన్నీరు పెడుతూనే ఉంది...

తెల్లదొరల చేతుల్లోంచి నల్లదొరల చేతుల్లోకి పాలన మారడాన్ని స్వతంత్రం అందామా..?

అయితే మనకు 78 ఏళ్ల కిందటే స్వతంత్రం వచ్చింది!

పరాయి సంకెళ్లను తెంచేందుకు పోరాడిన యోధులు ఆశించిన భారతం ఇదేనా?

కాదు..కాదు..ఎన్నటికీ కానేకాదు!

క్యాలెండర్‌లో కాయితాలు చిరిగిపోతున్నాయి తప్ప, ప్రజల కడగండ్లు తీరుతున్నాయా? అధికారం చేతులు మారింది తప్ప, జీవనప్రమాణాలు పెరిగాయా? సొంత పాలనలోకి మారి ఏడు దశాబ్దాలు దాటి ఎనిమిదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్నా పల్లెలు ఈసురోమంటూనే ఉన్నాయి. సేద్యం ఒక జూదంగా మారిపోయింది. స్వేదజలాల తో పంటలు పండించినా ఫలితం వెక్కిరిస్తోంది. ఉరితాళ్లలో, ఎండ్రిన్‌ డబ్బాల్లో పరిష్కారాన్ని అన్నదాతలు వెతుక్కుంటూనే ఉన్నారు. గుంతలు, గతుకుల మయమైన రోడ్లు.. రోడ్లున్నా బస్సులు రాని ఊళ్లు.. మరణిస్తే జానెడు జాగా దొరకడం గగనంగా మారిన పల్లెలు.. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు దిష్టిచుక్కల సాక్ష్యంలా చిత్తూరు జిల్లాలో ఇలా మిగిలే ఉన్నాయి. సంబరాలు చేసుకునే వేళ అయినా.. సంకల్పం చెప్పుకోవాలనే ఆశతోనే ఈ కథనం...


చావుకు పుట్టని జాగా..!

ఆఖరి ప్రయాణంలో ఆరడుగుల నేల కోసం జిల్లాలో అనేక పల్లెలు తల్లడిల్లుతూనే ఉన్నాయి. శ్మశానాలు లేక, ఉన్న శ్మశానాలకు దారిలేక పడుతున్న అవస్థలకు దశాబ్దాలు గడుస్తున్నా మార్పులేదు.

- పెనుమూరు మండలం చార్వాగానిపల్లె దళితవాడకు శ్మశానం లేక రోడ్డు పక్కన కర్మక్రియలు చేసుకుంటున్నారు. ఆ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కోసం కేటాయించింది.

- యాదమరి మండలం వరదరాజులపల్లె దళితవాడ శ్మశానానికి దారి సౌకర్యం లేదు. వ్యవసాయ పొలాలపైనే పాడె మోసుకుంటూ వెళ్తారు.

zzzzz.jpg


- గుడిపాల మండలంలోని ముత్తుకూరుపల్లెకు శ్మశానం లేక చెరువులోనే అంతిమ సంస్కారం చేసుకుంటున్నారు.

- విజయపురం మండలంలోని కేశవపురం, మల్లారెడ్డి కండ్రిగ ఆదిఆంధ్రవాడ శ్మశానాలకు దారి సమస్య ఉంది. ఇక్కడ చనిపోయిన ప్రతిసారీ గొడవలు జరుగుతున్నాయి.

- ఎస్‌ఆర్‌పురం మండలంలోని చొక్కామడుగు, మర్రిపల్లె, చిన్నతయ్యూరు, నెలవాయి, ఎన్టీఆర్‌ కాలనీ గ్రామాల శ్మశానాలకు దారి లేదు.

- పుంగనూరు మండలంలోని తోపుమఠం, ఏటిగడ్డపాళ్యానికి శ్మశానాలు ఉన్నప్పటికీ దారి లేదు.


zzzzzx.jpg

బస్సు రాని పల్లెలు

జిల్లాలో తారురోడ్డు సౌకర్యం ఉండి కూడా ఆర్టీసీ బస్సులు నడవని గ్రామాలు 45 అని ఆర్టీసీ అధికారులే చెప్తున్నారు. ఈ గ్రామాల విద్యార్థులు, ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోల వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. గుడిపాల మండలంలోని దాయంవారిపల్లె, బొజ్జవారిపల్లె, చీలాపల్లె, చెరుకూరుకండిగ, కట్టకిందపల్లె, గొల్లమడుగు, బొమ్మసముద్రం- తవణంపల్లెలోని అరగొండ మత్యం, కామాలూరు- విజయపురం మండలంలోని కాళికాపురం, జీఎంపురం, బూచివానత్తం, ఎం.అగరం, పోతురాజులు కండిగ్ర, ముత్యాలరెడ్డి కండిగ్ర- ఎస్‌ఆర్‌పురం మండలంలోని ముద్దికుప్పం, ఉడమలకుడితి - పెనుమూరు మండలంలోని సీఆర్‌కండ్రిగ, చింతపేట పంచాయతీలకు- పుంగనూరు మండలం వనమలదిన్నె, పెద్దఅలసాపురం, పాలెంపల్లె, ఎల్లారుబైలు, ఎంసీపల్లె- సోమల మండలం అన్నమ్మగారిపల్లె, తమ్మినాయనపల్లె, పేగలవారిపల్లెకు- ఐరాల మండలంలోని వేదగిరివారిపల్లె, దివిటివారిపల్లెలకు బస్సు సౌకర్యం లేదు.


పచ్చదనం పరిమళిస్తున్న ఈ ఊరిపేరు చుక్కావారిపల్లె. చౌడేపల్లె మండలంలో ఉంది. తారురోడ్డున్నా, ఆర్టీసీ బస్సు రాదు. చౌడేపల్లె నుంచి చుక్కావారిపల్లె మార్గంలో కొత్తపల్లె, పందిళ్లపల్లె, నడింపల్లె, బాలసముద్రం గ్రామాలున్నాయి. కాలేజీకి వెళ్లే విద్యార్థులు 50 మంది ఆటోలు, స్కూటర్లలో వెళ్తున్నారు. 1.5 కి.మీ దూరంలోని హైస్కూల్‌కు పిల్లలు నడుచుకుంటూ, సైకిళ్లపై వెళ్తుంటారు. పలమనేరు, చౌడేపల్లె ప్రాంతాల్లో పని ఉన్న ప్రజలకు కూడా ఆటోలే దిక్కు. గతంలో రెండు ట్రిప్పులు బస్సు తిరిగేది. రెండేళ్లుగా దాన్నీ రద్దు చేశారు.


ఈ దారుల్లో ప్రయాణం ఎట్లా?

మండల కేంద్రాల నుంచి సరైన రోడ్లు లేని గ్రామాలు జిల్లాలో లెక్కకుమిక్కిలి మిగిలే ఉన్నాయి. గుడిపాల మండలంలోని సింగారపేట, వెప్పాలమానుచేను, నక్కలపాలెం- తవణంపల్లె మండలంలోని రామకృష్ణాపురం, కొండకింద కనకాపురం- విజయపురం మండలంలోని లక్ష్మీవిలాసపురం, కోసలనగరం పంచాయతీ మిట్టూరు- ఎస్‌ఆర్‌పురం మండలంలోని పిల్లిగుండ్లపల్లె, ఎస్టీ కాలనీ, ఎస్‌ఆర్‌పురం ఎస్టీ కాలనీ, కొండపాళ్యం ఎస్టీకాలనీ, రాఘవరాజపురం గ్రామాలకు తారురోడ్డు లేక ప్రజలకు నిత్యం అవస్థలే!

zzzzzz.jpg

బైరెడ్డిపల్లె మండలం కైగల్‌ నుంచి రామసముద్రం, శనిపల్లె, మునిపల్లె గ్రామాలకు తారురోడ్డు లేదు. 5 వేలమంది ఏళ్లుగా ఈ మట్టి రోడ్డులోనే ప్రయాణిస్తున్నారు. తారు రోడ్డు లేదని బస్సు వేయలేదు. వంద మంది విద్యార్థులు రోజూ వి.కోట, పలమనేరుకు వెళ్లేందుకు కైగల్‌ వరకు 5 కిలోమీటర్లు సైకిల్‌ మీద వచ్చి బస్సెక్కాలి. ఇక్కడ పండే టమోటా, వివిధ రకాల కూరగాయలు తరలించేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు.


మా ఊళ్లో ఎవరైనా చస్తే మా చావు మేం చావాల్సిందే. ఎక్కడ పూడ్చాలో తెలియదు. పొలాలున్నవాళ్లు వాళ్ల పొలాల్లోనే పూడ్చుకుం టారు. జానెడు నేల లేని మా గతేమి? అధికారులకు అర్జీలు ఇచ్చీ ఇచ్చీ విసిగిపోయాం.

- గంగయ్య, జగన్నాథయ్య, బూసిపల్లె దళితవాడ, పూతలపట్టు మండలం

పల్లె మాయమవుతోంది

యాదమరి మండలం సిద్ధారెడ్డిపల్లె పంచాయతీ రాచూరు ఏఏడబ్ల్యూ గ్రామంలో 50 ఏళ్ల కిందట 35 కుటుంబాలు నివసిస్తూ ఉండేవి. దారిలేని ఈ ఊరిలో వసతులు కూడా ఏమీ లేవు. ఇక్కడ బతకలేక ఒక్కో కుటుంబం ఊరొదిలి వెళ్లిపోతోంది. ఇప్పుడు పది కుటుంబాలవారు మాత్రమే ఇదిగో ఇలాంటి ఇళ్లలో జీవిస్తున్నారు.

మా ఊళ్లోకి ఆటో వచ్చే తోవ కూడా లేదు. అనారోగ్యం వస్తే మోసుకుంటూ కిలోమీటరు నడవాల్సిందే.

- ఆనందన్‌, రాచూరు ఏఏడబ్ల్యూ గ్రామస్తుడు


ఈ గాయం మానదా?

తెల్లదొరల పాలనలో పడ్డ అమానవీయ ముద్ర ఇప్పటికీ తొలగక అలమటిస్తున్న ప్రజలు జిల్లాలో అనేక పల్లెల్లో ఉన్నారు. దొంగలనీ, వేశ్యలనీ వేసిన ముద్రతోనే మానసికంగా చితికిపోతున్నారు.పోలీసులకు బంగారు గుడ్లు పెట్టే బాతుల్లా ఈ గ్రామాలు మారిపోయాయి.

- కుప్పం పట్టణంలోని లక్ష్మీపురం ప్రాంతంలోని ప్రజల్ని డబ్బావాళ్లు అంటారు. వీరు స్థానికంగా కాకుండా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తుంటారని ప్రచారం.బయటి ప్రాంతాల నుంచి రికవరీల కోసం పోలీసులు తరచూ ఇక్కడికి వస్తుంటారు. దొంగతనాలు మానేసి తరాలు గడుస్తున్నా తమను అవమానకరంగా చూస్తున్నారని వీరు వాపోతుంటారు. ఒక వేళ కొందరు ఇప్పటికీ దొంగతనాలు చేస్తూనే ఉంటే వీరిని మార్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నకు 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతం సమాధానం చెప్పలేకపోతోంది.


- నగరి మండలంలోని ఓజీకుప్పాన్ని కూడా దొంగల ఊరుగానే ఇప్పటికీ పిలుస్తారు. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల పోలీసులు దొంగ సొమ్ము రికవరీ కోసం ఈ పల్లె మీద విరుచుకుపడుతుంటారు. పనులు చేసుకుని బతుకుదామన్నా ఇచ్చేవారు లేరు. ఓజీకుప్పం అని చెప్పగానే తరిమేస్తారని ఈ ఊరి ప్రజలు బాధపడుతుంటారు.

- పెద్దపంజాణి మండలంలోని పెద్ద ముద్దేపల్లె, చిన్న ముద్దేపల్లె, కొత్త ముద్దేపల్లె, ముద్దేపల్లె గ్రామస్తులు ఒకప్పుడు దొంగతనాల మీద ఆధారపడ్డారని చెబుతారు. ప్రస్తుతం వీరంతా వ్యవసాయం, వ్యాపారం వంటివాటిని జీవనోపాధిగా ఎంచుకున్నారు. చదువుకుని జీవితాల్లో మార్పు తెచ్చుకున్నారు. అయినా ఆ ముద్ర మాత్రం మాయలేదని వీరు కుమిలిపోతుంటారు.


- పెద్దపంజాణి మండలంలోని ఓ గ్రామంలో ఒకప్పుడు వేశ్య వృత్తిని ఎంచుకుని జీవించేవారు ఉండేవారంటారు. వారు కూడా మారిపోయి వ్యవసాయం, పనులు చేసుకుంటున్నారు. అయినా ఆ ఊరి పేరెత్తగానే ఎదురయ్యే వెకిలి మాటలూ, వెకిలి నవ్వులూ అక్కడి ప్రజల గుండెల్లో గునపాలుగా మారుతుంటాయి.

- గుడిపాల మండలం రాసానపల్లె సారా తయారీకి రాష్ట్రంలోనే పేరు మోసింది. చట్టాలు కఠినంగా ఉండడం, పీడీ యాక్టులు పెట్టడం తదితరాల కారణంగా ప్రస్తుతం ఇక్కడ తయారీ లేదు. అయినా బయటి ప్రజలకు ఈ గ్రామస్తులంటే చిన్నచూపే ఉంది. ఈ ఊరికి పిల్లనివ్వడానికి కూడా భయపడుతుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2025 | 08:31 AM