Share News

CM Chandrababu: అనుమతి రాగానే బనకచర్ల పనులు

ABN , Publish Date - May 24 , 2025 | 03:18 AM

బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరి జలాలను వృథా కాకుండా కరువు ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికను కేంద్రానికి సమర్పించారు.

CM Chandrababu: అనుమతి రాగానే బనకచర్ల పనులు

  • సముద్రంలో వృథాగా కలిసే నీటినే వాడుకుంటాం: సీఎం

  • లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలు

  • రాష్ట్రానికి ఏరో స్పేస్‌ ప్రాజెక్టులు.. రక్షణ రంగ పరిశ్రమలు పెట్టాలనీ అడిగాం

  • ఏపీలో సైనిక కంటోన్మెంట్‌ ఏర్పాటుకు రాజ్‌నాథ్‌ ఓకే: చంద్రబాబు

  • నిర్మల, పాటిల్‌, అమిత్‌షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ

న్యూఢిల్లీ, మే 23 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో వృధాగా కలిసే గోదావరి జలాలను పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంతాలకు తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే దీని పనులు ప్రారంభిస్తామన్నారు. లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలు స్థాపిస్తామని, రాష్ట్రానికి ఏరో స్పేస్‌ ప్రాజెక్టులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఏడుగురు కేంద్ర మంత్రులు.. నిర్మలా సీతారామన్‌ (ఆర్థిక), అమిత్‌షా (హోం), సీఆర్‌ పాటిల్‌(జలశక్తి), రాజ్‌నాథ్‌సింగ్‌ (రక్షణ), జితేంద్రసింగ్‌ (సైన్స్‌-టెక్నాలజీ), ప్రహ్లాద్‌ జోషీ (పునరుత్పాదక ఇంధనం), అశ్వినీ వైష్ణవ్‌ (రైల్వే, ఐటీ-ఎలకా్ట్రనిక్స్‌)లను కలిసి.. విజ్ఞాపనలు, ఆర్థిక ప్రణాళికలు, ప్రతిపాదనలు సమర్పించారు. సాయంత్రం తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఆర్థికసాయంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చర్చించానన్నారు. ‘ఈ ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చవుతుంది. దీనిద్వారా 200 టీఎంసీలను మళ్లించవచ్చు. ఈ ప్రాజెక్టుతో ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. తెలంగాణలో కూడా గోదావరిపై కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. అందరితో కలిసి నీటిని వాడుకుంటాం. సముద్రంలోకి పోయే 200 టీఎంసీలను కరువు ప్రాంతాలకు ఉపయోగించాలని నిర్ణయించాం. గోదావరి వరద జలాలను రాష్ట్రంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లోని నీటి ఎద్దడి ప్రాంతాలకు మళ్లించడమే ఈ స్కీం లక్ష్యం’ అని తెలిపారు.


జల్‌జీవన్‌, బ్లూ రివల్యూషన్‌, మేకిన్‌ ఇండియా వంటి జాతీయ మిషన్ల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని తెలిపారు. కరువు పీడిత ప్రాంతాల్లోని కోట్లాది మందికి ప్రయోజనం లభిస్తుందని, నదుల అనుసంధానానికి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు. ‘జూన్‌లోపు ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించి సమర్పిస్తాం. పనులను త్వరగా ముందుకు తీసుకెళ్లడానికి తక్షణ అనుమతులు మంజూరు చేయాలని అభ్యర్థించా’ అని చెప్పారు. ఆర్థిక మంత్రితో భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించానన్నారు. పూర్వోదయ పథకానికి మరిన్ని నిధులు, బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోసం తాము అందించిన ప్రతిపాదనలకు ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. బెంగుళూరు ఎయిర్‌పోర్టు టెర్మినల్‌-2 చూశానని, చాలా బాగుందని.. దానిని మించిన విమానాశ్రయాన్ని అమరావతిలో నిర్మిస్తామని చెప్పారు. రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను ఏపీకి ఇవ్వాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్‌ జోషీని తాను కోరానన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ‘ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీలో భాగంగా 72 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. పీఎం సూర్యఘర్‌ పథకం కింద రాష్ట్రంలో 35లక్షల కుటుంబాలకు సోలార్‌ రూఫ్‌ టాప్‌ సౌకర్యం కల్పించాలని కోరా. కుసుమ్‌ కింద 2 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏపీ గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా తయారవుతుంది. 24 గంటలూ విద్యుత్‌ సరఫరాకు వీలవుతుంది’ అని వివరించారు.


డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌!

‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను అభినందించానని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఆర్మీ కంట్మోనెంట్‌ లేదని... ఏర్పాటు చేయాలని కోరానని.. ఇందుకాయన అంగీకరించారని చెప్పారు. ‘డిఫెన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌ కింద రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని అభ్యర్థించా. జగ్గయ్యపేట-దొనకొండ క్లస్టర్‌లో 6వేల ఎకరాలు ఉంది. ఈ క్లస్టర్‌ను క్షిపణులు-మందుగుండు పరిరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరా. మంత్రి సానుకూలంగా స్పందించారు. లేపాక్షి, మడకశిరలో 10 వేల ఎకరాలు ఉంది. ఈ ప్రాంతంలో మిలిటరీ, సివిల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌, ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌తో ఏరోస్పేస్‌ ఎకోసిస్టంను తయారు చేయాలని అడిగాం. విశాఖపట్నం, అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్‌ ఎక్వి్‌పమెంట్‌ ప్రొడక్షన్‌, ఆయుధ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరా. కర్నూలు, ఓర్వకల్లు క్లస్టర్‌లో 4 వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మిలిటరీ డ్రోన్స్‌, రోబోటిక్స్‌, అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ కాంపోనెంట్స్‌ను ఉత్పత్తి చేయాలని కోరా. తిరుపతి ఐఐటీలో డీఆర్‌డీవో సెంటర్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశా. శ్రీహరికోట ప్రాంతంలో 2 వేల ఎకరాల్లో క్లస్టర్‌ ఏర్పాటు చేసి ప్రైవేటు శాటిలైట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ లాంచింగ్‌ చేపడతాం. దానిపై కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో రెండు అంతరిక్ష నగరాల అభివృద్ధికి ఆస్కారం ఉంది. షార్‌ అంతరిక్ష కేంద్ర సమీపంలో, లేపాక్షి వద్ద నిర్మించే ఈ నగరాల్లో ఉపగ్రహల తయారీ, ప్రయోగ వాహనాల అభివృద్ధి, పరిశ్రమలకు తోడ్పాటు అందించవచ్చు’ అన్నారు. ఆయా భేటీల్లో చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాసవర్మ, టీడీపీ ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, పుట్టా మహేశ్‌, తెన్నేటి కృష్ణప్రసాద్‌, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, సానా సతీశ్‌, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ పాల్గొన్నారు.


12 గంటలు నిర్విరామ భేటీలు

ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ

సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కేంద్ర మంత్రులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. 12 గంటల్లో ఏడుగురు మంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఒక్కొక్కరితో దాదాపు గంట పాటు చర్చించారు. రాష్ట్రానికి సాయం అందించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆయా కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం కాస్త సమయం దొరకడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఆయా భేటీల వివరాలను వెల్లడించారు. వారితో సమావేశాల్లో అరకు కాఫీ ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం ఆయా కేంద్ర మంత్రులు ఆ బాక్సులు అందుకుంటున్న సమయంలో.. అరకు కాఫీ రుచిపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించినట్లు తెలిసింది. సీఆర్‌ పాటిల్‌ మాత్రం అరకు కాఫీ బాగుందని, అయితే తాను ఎక్కువగా టీ తాగుతానని చెప్పినట్లు సమాచారం. తిరుమల లడ్డూ నాణ్యత బాగుందని మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మెచ్చుకున్నారు. తిరుమలలో ఇటీవల తీసుకొచ్చిన మార్పులను కూడా ప్రశంసించారు. టీడీపీ కూటమి పాలనలో అక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలూ కలుగడం లేదని తెలిపారు.

ఎలక్ట్రానిక్స్‌ సిటీ ఏర్పాటుకు సిద్ధం: సీఎం

యాపిల్‌, ఇతర కంపెనీల ప్రతినిధులతో భేటీ

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌తోనూ..

యాపిల్‌, తదితర కంపెనీల ప్రతినిధులు ఢిల్లీలో సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. బెంగళూరు-హైదరాబాద్‌ కారిడార్‌లోని లేపాక్షి- ఓర్వకల్లు మధ్య ఎలక్ట్రానిక్స్‌ సిటీ కట్టడానికి ఆయా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, మూడు నెలలలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చాయని ఆయన మీడియాకు తెలిపారు. ఆ కంపెనీలతో త్వరలో ఎంవోయూలు చేసుకుంటామని, భూకేటాయింపులు, ఇతరత్రా అంశాలను ఖరారు చేసి ముందుకెళ్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి తమ ప్రభుత్వ బాధ్యత అని, ఫలితంగా ఉద్యోగాల కల్పనతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు. కాగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ కూడా చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై ఇరువురూ నిర్మాణాత్మక చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - May 24 , 2025 | 03:18 AM