CM Chandrababu: ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్
ABN , Publish Date - May 30 , 2025 | 02:43 AM
చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ ప్రారంభించి రాజకీయాల్లో ఆర్థిక ఉగ్రవాదులను తొలగించేందుకు సంకల్పించింది. మహానాడు ముగింపు సభలో పాలన, అభివృద్ధి, సంక్షేమంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు.
ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో
ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాం: సీఎం
రాజకీయాల్లో లేకుండా చేస్తాం
ఇటుక.. ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం
వచ్చే మహానాడుకల్లా భూసమస్యలన్నీ పరిష్కారం
వై నాట్లు..గొడ్డలిపోట్లు మన రాజకీయం కాదు
పాలన ఎలా ఉండాలనేందుకు టీడీపీ కేస్ స్టడీ
ప్రజాతీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదు
రాష్ట్రాన్ని సమస్యల చీకట్లోకి నెట్టేసింది
దీపం డబ్బులు 2 విడతలుగా ఖాతాల్లో వేస్తాం
వచ్చేనెల 12నాటికి వాట్సా్‌పలో 500 సేవలు
అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు.. నిరంతర పాలన ఉండాలి
రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్ ఉంది
మహానాడు ముగింపు సభలో చంద్రబాబు
ఉగ్రవాదులు సమాజానికి చాలా ప్రమాదకరం. పాక్ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి పర్యాటకులను చంపేస్తే ప్రధాని మోదీ పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను 20 నిమిషాల్లో హతమార్చారు. దేశంలోని ఉగ్రవాదులతోనే కాదు, రాష్ట్రంలో రాజకీయ ముసుగులోని ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా చాలా నష్టం. మన రాష్ట్రంలో రాజకీయాల ముసుగులో కొందరు ల్యాండ్, మైన్, శాండ్ దోచేసుకున్నారు. జే బ్రాండ్లతో కొల్లగొట్టారు. కొండలను మింగేశారు. అడవులను ఆక్రమించి ప్యాలె్‌సలు, ఎస్టేట్లు నిర్మించుకున్నారు. చెరువులను చెరబట్టారు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్‌లో భాగంగా వీటన్నింటికీ చెక్ పెడతాం. ఆర్థిక ఉగ్రవాదులను రాజకీయాల్లో లేకుండా చేస్తాం.
- సీఎం చంద్రబాబు
(మహానాడు ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)
పాకిస్థాన్ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్‌కు నాంది పలుకుతామని, ఆర్థిక ఉగ్రవాదులను తుడిచిపెడతామని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘వై నాట్లు.. గొడ్డలి పోట్లు.. మన రాజకీయం కాదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించి ప్రజాసేవ చేస్తున్నాం. ఏడాదిగా మన పాలన అదే విధంగా సాగుతోంది.’’ అని పేర్కొన్నారు. అధికారం కోసం కాదు.. ప్రజాసేవ కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. ‘‘పరిపాలన ఎలా ఉండాలో, పార్టీ ఎలా ఉండాలో చెప్పేందుకు కేస్ స్టడీ టీడీపీ. పాలన ఎలా ఉండకూడదో, పార్టీని ఎలా నడపకూడదో తెలిపేందుకు కేస్ స్టడీ వైసీపీ.’’ అని పేర్కొన్నారు. కడపలో గురువారం జరిగిన మహానాడు ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
ఇదీ మన కార్యకర్త సత్తా..
‘‘కడప తెలుగుదేశం అడ్డా అని మహానాడు నిరూపించింది. నేను చాలా మహానాడులు చూశాను. ఈసారి మాత్రం కార్యకర్తలు చాలా ఉత్సాహంగా తరలివచ్చారు. ఈ మహానాడు సమయపాలనను కచ్చితంగా పాటించింది. ఎన్నికల సమయంలో నేను కడప వచ్చినప్పుడు ‘ఇక్కడ మార్పు స్పష్టంగా కనిపిస్తోం’దని చెప్పా. మీరు దాన్నే నిజం చేశారు. 2024 ఎన్నికల్లో పదికి ఏడు సీట్లు గెలిచాం. 2029కి 10కి 10 గెలవాలి. సీమలో 52 సీట్లకు 45 సీట్లలో కూటమిని గెలిపించారు. ఈ ప్రజాతీర్పు మనలో బాధ్యతను పెంచింది. ఈ తీర్పు మనకు అర్థమైం ది. కానీ ఓటమి చెందిన పార్టీ మాత్రం(వైసీపీ) అర్థం చేసుకోలేదు. గత ఐదేళ్లలో టీడీపీ ఎన్నో పోరాటాలు చేసింది. హత్యలు, అవమానాలు, దాడులు.. ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు మన కార్యకర్తలు. 2024 విజయం వెనుక టీడీపీ కార్యకర్త పాత్ర ఉంది. అరవై ఏళ్ల వయసులో ఓ కార్యకర్త కోడూరు నుంచి సైకిల్‌పై వచ్చాడంటే అదీ టీడీపీ కార్యకర్త సత్తా! సంపద సృష్టించడం తెలిసిన పార్టీ మనది. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్. నా కష్టం నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న ఈ జనసంద్రం కోసం..’’.
సమస్యలున్నా సంక్షేమం అమలు చేస్తున్నా...
‘‘దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నా రా?. ఏడాదికి రూ.33వేల కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నారా?. ఏపీలో కూటమి ప్రభుత్వం మాత్రమే ఇంత భారీగా ఖర్చు చేస్తోంది. మాట ఇచ్చినట్లు రూ.4వేల పింఛను ఇవ్వడమే కాకుండా 3 నెలల పింఛను ఒకేసారి ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం. 16 వేల పోస్టులతో డీఎస్పీ నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం ఈ ఫైలుమీదే పెట్టాం. దీపం 2 కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 4 నెలలకోసారి మీ ఖాతాల్లో డబ్బులు వేస్తాం. ఎస్సీ వర్గీకరణపై గత వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే దాన్ని అమలు చేసి సోషల్ రీయింజనీరింగ్ చేసిన పార్టీ టీడీపీ. వైసీపీ హయాంలో రోడ్లు ఎలా ఉన్నాయో మీరం తా చూశారు. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటికీ మరమ్మతులు చేశాం. పేదవాళ్లు ఆకలితో ఉండకూడదని 203 అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాం. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేశాడంటే ఆ మనిషి ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాం టి వ్యక్తి మనకు అవసరమా?. దీంతోపాటు 21 దేవాలయాల్లో నిత్య అన్నదానాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాం. గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకుండా వాటిని అటకెక్కించింది. మనం అధికారంలోకి రాగానే 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73 పథకాలను పునరుద్ధరించాం. ఇదీ మన చిత్తశుద్ధి.’’
అమరజీవి మెమోరియల్‌కు ఐదు ఎకరాలు
‘‘టీడీపీకి వెన్నెముక బీసీలు. వారికి నేను అండగా ఉంటా. మనం అధికారంలోకి రాగానే వారికోసం రూ.47,456 కోట్లు కేటాయించాం. నాయీ బ్రాహ్మణులకు గౌరవవేతనాన్ని రూ.25వేలకు పెంచాం. చేనేతలపై జీఎస్టీ ఎత్తివేశాం. పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్‌కు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం. మద్యం షాపుల కేటాయింపులో గీత కార్మికులకు రిజర్వేషన్ అమలుచేశాం. 217 జీవోతో మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుండటంతో దాన్ని రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఎస్సీలు, ఎస్టీలకు సోలార్ రూఫ్‌టా్‌పలను ఉచితంగా ఏర్పా టు చేస్తాం. దీనికోసం బీసీలకు 98వేలు, ఓసీలు, ఇతరులకు రూ78 వేలు సబ్సిడీ ఇస్తాం. రైతులు కుసుమ్ కింద సోలార్ పెట్టుకుంటే ఉచితంగా ఇస్తాం. ఇలా చెప్పుకొంటూ పోతే 11 నెలల్లో కూటమిప్రభుత్వం చాలా చేసింది. ఆర్యవైశ్య ఇలవేల్పు కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ఏర్పాటుకు ఐదు ఎకరాలు కేటాయిస్తాం. అక్కడ ఆయన విగ్రహం పెడతాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే టీచర్లకు మేలు చేసేలా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు రూ.213 కోట్ల విలువైన సరెండర్ లీవు సొమ్ము చెల్లించాం. ఉద్యోగుల సొమ్ము రూ.7,500 కోట్లు గత ప్రభుత్వం మళ్లించగా, వాటిని తిరిగి వారికి ఇచ్చాం. అంగన్వాడీలు, ఆశాలకు 1.50 లక్షల లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. అధికారంలోకి రాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం. వచ్చే మహానాడు నాటికి భూసమస్యలన్నీ పరిష్కరిస్తాం.’’
యువతపైనే నా ఆశలన్నీ
‘‘యువతకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని బలంగా నమ్ముతాను. అందుకే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించాం. రాష్ట్రానికి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. ‘మీ రాష్ట్రంలో గత ఐదేళ్లు ఓ భూతం ఉండేది’ అని అంటున్నారు. ఆ భూతాన్ని పాతి పెడతానని వారికి చెప్పాను. తిరుపతి, అనంతపురంలో ఒక్కో కేంద్రం పెట్టి ప్రతి కుటుం బం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. టెక్నాలజీ పెరుగుతోంది. మీకు వాట్సా్‌పలో వచ్చే నెల 12 నాటికి 500 సేవలకు పెంచుతాం.’’
4 లక్షల మందికి మహా భోజనం
చివరి రోజు చికెన్ బిర్యానీ.. పలుచోట్ల వంటావార్పులు
కడపలో నిర్వహించిన మహానాడులో మూడోరోజు గురువారం 2 లక్షల మందికి పైగా భోజన వసతి కల్పించారు. చికెన్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాటర్ బాటిల్‌ను అం దించారు. మహానాడులో మొదటి రోజు 70 వేల మందికి, రెండోరోజు లక్ష మందికి సీమ రుచులతో భోజన వసతి కల్పించా రు. మహానాడులో అంబికా క్యాటరింగ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు 4 లక్షల మందికి పసందైన వంటకాలతో భోజనాన్ని అందించారు. ఇది గాక మహానాడు సభలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి కడప వచ్చిన వారికి దారి మధ్యలో భోజన ఏర్పాట్లు చేశారు. మూడో రోజు బహిరంగ సభకు కుప్పం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, తంబళ్లపల్లి, మదనపల్లి, పలమనేరు, రాయచోటి, రాజంపేట, కోడూరు, కర్నూలు, ఆళ్లగడ్డ, నంద్యాల, తాడిపత్రి, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఆయా ప్రాంతాల నాయకులు టెంట్లు ఏర్పాటు చేసి కార్యకర్తలకు బుధవారం ఉదయం 10 గంటల సమయానికి నాన్‌వెజ్‌తో వంటలను సిద్ధం చేసి ఉంచారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఉదయం 10 గంటలకే శిబిరాలకు చేరుకుని అక్కడే భోజనం చేశారు. అటు నుంచి మహానాడు సభకు తరలివచ్చారు. మహానాడు బహిరంగ సభ మఽ ద్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఈ సమయంలో ప్రజలు, కార్యకర్తలు దాహంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లను తీసుకొచ్చి పంపిణీ చేశారు. అలాగే మూడు లారీలలో వాటర్ బాటిళ్లను తీసుకొచ్చి పంపిణీ చేశారు.
(మహానాడు నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)
రాయలసీమ మిషన్
‘‘రాయలసీమ బిడ్డగా రాళ్ల సీమను రతనాల సీమగా మారుస్తా. ఒకప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాక్షన్ భూతాన్ని రూపుమాపింది టీడీపీనే. రాయలసీమ అభివృద్ధికి నా వద్ద స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. ఇప్పటికే ఎన్నో తీసుకొచ్చాం. తిరుపతిలో హజ్ హౌస్‌ను టీడీపీ 90 శాతం పూ ర్తి చేస్తే దాన్ని ఐదేళ్లలో పూర్తిచేయకుండా వైసీపీ పక్కన పెట్టింది. దీన్ని త్వరలోనే పూర్తిచే స్తాం. లేపాక్షి, ఓర్వకల్లు కారిడార్‌లో డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలకా్ట్రనిక్ సిటీ, ఆటోమొబైల్ సిటీని ఏర్పాటుచేస్తాం. కర్నూలుకు హైకోర్టు బెంచి తీసుకొస్తాం. ఓబులాపురం మైన్స్ స్కామ్‌లో ఉన్న వారు ఇప్పుడు జైలులో ఉన్నారు. గత ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంటుకు నేను వేసిన పునాది తీసి కొత్తది వేసి నాటకాలాడింది. కడపకు స్టీల్ ప్లాంట్ మాత్రం రాలేదు. ఈ ఏడాది జూన్ 12 లోపల కడపలో సీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభమవుతుంది. మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు రెండింటికీ ఐదువేల కోట్లు వస్తాయి. నీటి విలువ, రైతు కష్టం తెలిసిన పార్టీ టీడీపీ. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేసిన నేత ఎన్టీఆర్. తెలుగుగంగ, గాలేరు-నగరి, కేసీ కెనాల్, హంద్రి-నీవా, ఇవన్నీ మనమే తెచ్చాం.
‘అన్నమయ్య’ను పూర్తిచేస్తాం
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే వైసీపీ నా డు పట్టించుకోలేదు. ఆ ప్రాజెక్టును నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. టీడీపీ హయాంలో సీమకు రూ. 12వేల కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమను రాజకీయం కోసం వాడుకునే వైసీపీ ఈ ప్రాంతం కో సం కేవలం 2వేల కోట్లు ఖర్చు పెట్టింది. ఎవరు రాయలసీమ బిడ్డో మీరే చెప్పండి. రతనాలసీమగా రాయలసీమ కావాలంటే పోలవరం-బనకచర్లను పూర్తిచేయాలి. దీనికి రూ.80వేల కోట్లవుతుంది.’’
విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం
‘‘విధ్వంసం అయిన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని గత ఎన్నికల్లో మనం, మన మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీకి చెందిన ప్రధాని మోదీ కలిసి ప్రజల ముందుకెళ్లాం. ప్రజలు మనల్ని నమ్మి ఘనవిజయం అందించారు. గతంలో అసెం బ్లీ ఎన్నికల్లో 10వేల మెజారిటీ వచ్చే ది. మొన్న ఎన్నికల్లో కొత్తవారికి సీట్లు ఇచ్చినా 80వేలు.. 90వేలు మెజారిటీలు వచ్చాయి. 83 మందికి 30వేలు, 30 మందికి 50వేలు, 10 మందికి 70వేలు, ముగ్గురికి 90వేలుపైచిలుకు మెజారిటీ వచ్చింది.’’
మహానాడుకు గల్ఫ్ నుంచి తెలుగు తమ్ముళ్లు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుపై విదేశాల్లోని పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎనలేని ఆసక్తి కనబరిచారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రుల్లో కడప జిల్లా వారే ఎక్కువ. కడపలో మహానాడు ఘనంగా నిర్వహించడంతో దాని ప్రభావం గల్ఫ్ ప్రవాసీయులలో ఎక్కువగా కనిపించింది. ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు మహానాడుకు హాజరయ్యారు. ఐరోపా, అమెరికా నుంచి కూడా ప్రతినిధులు ఎక్కువగా వచ్చినట్లు సమాచారం. ప్రతినిధుల నమోదుకు ఎన్నారైలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ కౌంటర్‌ను కేంద్ర మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు, ప్రవాసాంధ్ర వ్యవహారాల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. పార్టీలోని వివిధ విభాగాల ప్రముఖులకు వేదికపై సముచిత స్థానం ఇచ్చారు. రావి రాధాకృష్ణకు కూడా వేదికపై స్థానం కల్పించారు.
మహానాడు నుంచి.. హస్తినకు బాబు
న్యూఢిల్లీ/అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) వార్షిక సదస్సు- 2025లో కీలక ప్రసంగం చేసేందుకు సీఎం చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మహానాడు సభ అనంతరం కడప నుంచి హస్తిన వెళ్లా రు. అక్కడి తాజ్ ప్యాలె్‌సలో శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ‘డ్రైవింగ్ ఎనామిక్ గ్రోత్ అండ్ సస్టెయినబులిటీ: ఆంధ్రప్రదేశ్ బ్లూప్రింట్’ అనే ప్రత్యేక ప్లీనరీ సెషన్‌లో ఆయన మాట్లాడతారు. స్వర్ణాంధ్ర విజన్-2047కు సంబంధించి రాష్ట్ర వ్యూహాత్మక ప్రణాళికలను ఈ సందర్భంగా వివరిస్తారు.
మీవల్లే పరపతి పెరిగింది
మీరు బంపర్ మెజారిటీతో గెలిపించడం వల్ల కేంద్రంలో పరపతి పెరిగింది. దానివల్ల రాష్ట్రానికి పనులు చేయించుకుంటున్నాం. 2027నాటికి పోలవరాన్ని పూర్తి చేసి తీరుతాం. దీనికి కేంద్రం సాయం చేస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రూ.11,400 కోట్లతో గాడినపెడుతున్నాం. రైల్వేజోన్ తెచ్చాం. రాజధాని కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చింది.
- సీఎం చంద్రబాబు