Share News

AP Govt : సాంకేతిక ‘సాగు’

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:33 AM

‘‘వ్యవసాయంతో పాటు ఉద్యాన, ఆక్వా, పశు సంపదకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సాగుకు సాంకేతికతను జోడించాలి.

AP Govt : సాంకేతిక ‘సాగు’

  • ఐదేళ్లలో 30% వృద్ధిరేటు లక్ష్యం

  • జూన్‌లోనే నారుమళ్లకు జలాలు

  • జిల్లాల్లో వ్యవసాయ సదస్సులు

  • రైతుల నుంచి అభిప్రాయ సేకరణ

  • విదేశాలకు ఆక్వా, ఉద్యాన పంటలు

  • అగ్రి, వెటర్నరీ విద్యార్థులకు స్టైపెండ్‌ పెంపు

  • వర్సిటీలలో రిటైర్మెంట్‌ 62 ఏళ్లకు పెంపు

  • ‘వ్యవసాయ’ సమీక్షలో సీఎం ఆదేశాలు

  • సాగు అనుబంధ శాఖల సమీక్షలో సీఎం

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘‘వ్యవసాయంతో పాటు ఉద్యాన, ఆక్వా, పశు సంపదకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సాగుకు సాంకేతికతను జోడించాలి. డ్రోన్స్‌, శాటిలైట్‌, సెన్సార్‌, డీప్‌టెక్‌ వినియోగించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి సాధించాలి’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తొలిదశలో 20ు వృద్ధి రేటు తగ్గకుండా చూడాలని తెలిపారు. ‘అగ్రివాచ్‌’ సంస్థ ద్వారా గత 10-15 ఏళ్ల వివరాలను విశ్లేషించి, రానున్న ఐదేళ్లలో 30ు వృద్ధి రేటు సాధించాలని నిర్దేశించారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు, సీఎం ఆదేశాలను మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ‘‘ఇటీవల అనంతపురంలో నిర్వహించిన హార్టీకల్చర్‌ సదస్సు తరహాలో ప్రతి జిల్లాలో శాఖల వారీగా సదస్సులు నిర్వహించనున్నాం. రైతులు, శాస్త్రవేత్తల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటాం. పండ్లు, పాలు, మాంస ఉత్పత్తిలో వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డ్వాక్రా సంఘాలతో గడ్డి క్షేత్రాలను ఏర్పాటు చేయించనున్నాం’’ అని వివరించారు. మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టు తృణధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేలా రైతుల్ని ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. డెల్టాలో వరి నారుమళ్లకు జూన్‌లోనే నీరు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. దీనివల్ల 120 రోజుల్లోనే తొలి పంట, 80 రోజుల్లో రెండో పంట చేతికి అందుతుందన్నారు.


ఆయిల్‌పామ్‌, డ్రాగన్‌ ఫ్రూట్‌, అంతరపంటగా కోకో వంటి వాటిని ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది 50 వేల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్‌ పరికరాలు రాయితీపై అందిస్తామన్నారు. సేంద్రియ పద్ధతులు అనుసరించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గేలా రైతులను ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు. నాణ్యమైన ధాన్యం పండించే రైతులను గుర్తించి.. బోన్‌సలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు అచెన్నాయుడు తెలిపారు. ఉద్యాన రైతులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి, అవసరమైతే రూ.200 కోట్లు ఖర్చు చేయడం ద్వారా డిమాండ్‌ తగ్గట్టు చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచుతామన్నారు. ఈ పంటలకు మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. ‘‘బీసీల్లో గౌడలకు మద్యం దుకాణాలు, వడ్డెరలకు క్వారీలు ఇస్తున్నట్లే యాదవ, కురుబలకు గొర్రెలు, మేకల యూనిట్లు రాయితీపై ఇవ్వాలని నిర్ణయించాం. ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌లో చేపలు, రొయ్యల చెరువులకు లైసెన్స్‌ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నాం’’ అని చెప్పారు.

ఉద్యోగులకు, విద్యార్థులకు పండగే!

వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశు వైద్య, విశ్వవిద్యాలయాల ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి అచెన్నాయుడు చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయ, పశువైద్య విద్యార్థులకు రూ.7 వేలు స్టైపెండ్‌ ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, బీఎస్సీ, బీవీఎస్సీ విద్యార్థులకు దీనిని రూ.7 వేల నుంచి రూ.10,500లకు, పీజీ విద్యార్థులకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. గత 10-15 ఏళ్ల డేటా ఆధారంగా పంటల పరిస్థితిని అంచనా వేసి, అంతర్జాతీయ మార్కెట్‌లో రైతులకు మంచి ధర లభించేలా కృషి చేస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 08 , 2025 | 02:33 AM