Central Minister Praises CM Chandrababu: సీఎం చంద్రబాబుపై కేంద్ర మంత్రి పీయూష్ ప్రశంసలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 07:28 PM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన సంస్కరణలకు రూపశిల్పి (ఆర్కిటెక్ట్) అని సీఎం చంద్రబాబును అభివర్ణించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు తమ పెద్దన్న అని.. ఆయన సంస్కరణలకు రూపశిల్పి (ఆర్కిటెక్ట్) అని అభివర్ణించారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు. ఐ.టి రంగంలో సీఎం చంద్రబాబు చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. విశాఖపట్నం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏడో సారి భాగస్వామ్య సదస్సు నిర్వహించబోతున్నారని వివరించారు.
విశాఖపట్నం మంచి అందమైన నగరం అని గుర్తు చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ఈ నగరం విశాఖపట్నం అనువైనదని ఈ సందర్భంగా పీయూష్ గోయల్ తెలిపారు. మనందరి మంచి భవిష్యత్తు కోసమే ఈ భాగస్వామ్యం సదస్సు అని చెప్పారు. ఈ రోజు దుర్గాష్టమి అని.. ‘‘చెడుపై మంచి విజయం’ సాధించిన రోజు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జి.ఎస్.టి సంస్కరణలతో వినియోగదారులకు మంచి ప్రోత్సాహం కలిగిస్తుందని ఆయన ఆకాంక్షించారు. వసుధైక కుటుంబం అనే స్ఫూర్తితో భారత్ నిర్ణయాలు తీసుకుంటోందని పీయూష్ గోయల్ వెల్లడించారు.
రాజధాని అమరావతి నిర్మాణమే కాకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆక్టోబర్ 17వ తేదీన విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ సదస్సుకు దేశ విదేశీ ప్రతినిధులే హాజరుకానున్నారు.
మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతోపాటు ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేశ్.. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ కేంద్రమంత్రులతోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం ఇటీవల సింగపూర్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా ఆ దేశంలోని ప్రభుత్వాధినేతలతోపాటు పారిశ్రామికవేత్తలతో సైతం సమావేశం నిర్వహించారు. వీరిని సైతం ఈ సదస్సుకు ఆహ్వానించిన విషయం విదితమే.
అలాగే ప్రస్తుతం ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణతోపాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఆర్ అండ్ బీ కమిషనర్ ఎం.టి. కృష్ణబాబు ప్రతినిధుల బృందం ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తుంది. ఆ క్రమంలో ఆ దేశ నేతలతోపాటు పారిశ్రామికవేత్తలతో సైతం ఈ ప్రతినిధి బృందం వరుసగా సమావేశం అవుతోంది. వీరిని సైతం విశాఖ వేదికగా జరిగే సదస్సుకు హాజరుకావాలని కోరిన సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా జరుగుతున్న సదస్సు ద్వారా ఏపీ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆశాభావం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నా పై ప్రతీకారం తీర్చుకోండి అంతే కానీ..
For AP News And Telugu News