Share News

AP News: కాకర.. చేదుకాదు తీపి..!

ABN , Publish Date - Dec 05 , 2025 | 09:44 AM

చేదుగా ఉందని కొంతమంది ఇష్టపడని కాకర.. ఈ ఏడాది అన్నదాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. దిగుబడి బాగుండడంతోపాటు మార్కెట్లో ధర కూడా బాగుండడంతో ఇక.. కాకరను సాగుచేసిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వివరాలిలా ఉన్నాయి.

AP News: కాకర.. చేదుకాదు తీపి..!

- ఆశాజనకంగా ధరలు

- కిలో రూ.50 పలుకుతున్న వైనం

- అన్నదాతకు లాభాలు

తనకల్లు(అనంతపురం): చేదైన కాకర తియ్యటి లాభాలు పంచుతోంది. మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా పలుకుతుండడంతో అన్నదాతకు లాభాల పంట పండుతోంది. కిలో రూ.50 వరకు అమ్ముడవుతున్నాయి. మండలంలో ఏడాది పొడవునా కూరగాయ పంటలు సాగుచేసి, బెంగళూరు, చెన్నై(Bangalore, Chennai) మార్కెట్లకు తరలిస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి రబీ ప్రారంభం వరకు కూరగాయలు సాగుచేసిన రైతులు నష్టాలబాట పట్టారు. ధరలులేక ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు అడిగిన రేటుకి ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొన్నిరోజులుగా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. కాకరకు ఉన్నట్లుండి ధరలు పెరిగాయి. దీంతో అన్నదాత హర్షం వ్యక్తం చేస్తున్నారు.


pandu1.2.jpg

మందులు అవసరంలేని పంట

కాకినాడకు చెందిన రామలింగరాజు తనకల్లు మండలంలోని చిన్నపల్లి వద్ద రెండెకరాలు లీజుకు తీసుకుని, కాకర సాగుచేశాడు. ఎకరాకి రూ.60 వేల వరకు పెట్టుబడులు పెట్టాడు. దిగుబడి ఆశాజనకంగా ఉంది. ధరలు కూడా బాగున్నాయి. రైతు వినూత్నంగా ఆలోచించి కాకర కాయలను బాక్సుల్లో నింపి తరలిస్తున్నారు. సాధారణంగా కాకరను సంచుల్లో వేసుకుని, మార్కెట్‌కు తరలిస్తున్నారు. తాజాగా కనిపించక ధర పెద్దగా దక్కదని రైతు అభిప్రాయపడుతున్నారు. బాక్సుల్లో వేసుకుని తరలిస్తే.. తాజాగా ఉంటూ మంచి ధరకు అమ్ముడవుతాయని చెబుతున్నారు.


pandu1.3.jpg

ప్రస్తుతం మార్కెట్లలో కాకర కిలో రూ.50 వరకు ధర పలుకుతోంది. కాకర వారానికో కోత పడుతోంది. ప్రతి కోతకు 2 టన్నులదాకా దిగుబడి వస్తోంది. ఈ లెక్కన రూ.లక్ష వరకు రైతుకు ఆదాయం సమకూరుతోంది. ఇలా.. 30 కోతలు పడతాయని రైతు చెబుతున్నారు. ధరలు ఇలాగే ఉంటే.. రూ.30 లక్షల వరకు లాభం వస్తుందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటకు పెద్దగా పురుగు మందులు కూడా అవసరంలేదు. దోమ నివారణకు పురుగు మందులు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. టమోటా పంటతో పోల్చితే పురుగు మందుల అవసరం తక్కువే. ఆరోగ్యానికి కారక కాయ ఎంతోమందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం నియంత్రణలో ఉండడంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు.


దిగుబడి, ధరలు బాగుండడంతో లాభాలు..

తనకల్లు మండలంలో 40 ఎకరాల భూములు కొనుగోలు చేశా. మరో 80 ఎకరాలు లీజుకు తీసుకుని, పలు పంటలు సాగుచేస్తున్నా. ఈప్రాంత భూములు కూరగాయలు, పండ్లతోటల సాగుకు అనుకూలం. కాకర మొట్టమొదటి సారి సాగుచేశా. దిగుబడి, ధరలు బాగుండడంతో లాభాలు వస్తున్నాయి.

- రామలింగరాజు, కాకినాడ


ఈ వార్తలు కూడా చదవండి..

వాడూ.. వీడూ.. ఎవడు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 05 , 2025 | 09:44 AM