Share News

Godavari Districts : పౌల్ట్రీపై పిడుగు!

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:10 AM

గోదావరి జిల్లాలను బర్డ్‌ఫ్లూ వణికిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్‌ మండలం వేల్పూరులోని కోళ్లఫారాల్లో...

Godavari Districts : పౌల్ట్రీపై  పిడుగు!

  • గోదావరి జిల్లాలను వణికిస్తున్న బర్డ్‌ఫ్లూ

  • ఉమ్మడి జిల్లాల్లో 350కిపైగా పౌల్ర్టీలు

  • వాటిలో 3 కోట్ల కోళ్లు పెంపకం

  • రోజుకు 2.40 కోట్ల గుడ్లు ఉత్పత్తి

  • ఇన్ఫెక్షన్‌ జోన్‌లోని ఫారాలు మూసివేత

  • చికెన్‌, గుడ్ల అమ్మకాలు నిలిపివేత

  • బర్డ్‌ ఫ్లూ భయంతో తెలంగాణ అప్రమత్తం

  • ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలు వెనక్కి

రాజమహేంద్రవరం, తణుకు రూరల్‌, భీమవరం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గోదావరి జిల్లాలను బర్డ్‌ఫ్లూ వణికిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్‌ మండలం వేల్పూరులోని కోళ్లఫారాల్లో ఉన్నట్టుండి వేలకొద్దీ కోళ్లు మరణించడం.. వాటి శాంపిల్స్‌ను పరీక్షించగా బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది. వాస్తవానికి గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్ల పరిశ్రమ బాగా విస్తరించింది. ఈ జిల్లాల్లో 350 వరకూ పౌల్ర్టీ ఫారాలున్నాయి. వాటిలో 3 కోట్ల వరకూ కోళ్లను పెంచుతున్నారు. ఇక్కడ రోజుకు 2.40 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవన్నీ స్థానిక అవసరాలకే కాకుండా.. ఒడిశా, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, అస్సాం తదితర రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంటాయి. గోదావరి జిల్లాల్లో రోజుకు కనీసం 30 వేల కోళ్లను మాంసం కోసం వినియోగిస్తారు. పరిశుభ్రత లేకపోవడం కానీ, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన కోళ్ల ద్వారా గానీ కానూరు అగ్రహారంలో బర్డ్‌ ఫ్లూ వ్యాపించి ఉండొచ్చని అంటున్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగా ప్రస్తుతం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. ఇది మరింత వ్యాప్తిచెందకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే.. పౌల్ట్రీ పరిశ్రమ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది.


కానూరు అగ్రహారంలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల పరిధిలోని 34 గ్రామాల్లో 64 వైద్య బృందాలు ఇంటింటికీ సర్వే చేపట్టాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్‌ మండలం వేల్పూరులోని కృష్ణానందంపౌల్ట్రీ లోనూ కోళ్లకు వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులతో సమీక్షించి నివారణ చర్యలకు ఆదేశించామని చెప్పారు. కృష్ణానందం పౌల్ట్రీ నుంచి కిలోమీటరు దూరం వరకూ ఇన్ఫెక్షన్‌ జోన్‌గా, 10 కిలో మీటర్ల పరిధిని అలర్ట్‌ జోన్‌గా గుర్తించామన్నారు. ఈ జోన్‌లో చికెన్‌, కోడి గుడ్లు అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించారు.

ఏపీ నుంచి కోళ్లు రానీయొద్దు: తెలంగాణ

బర్డ్‌ ఫ్లూ భయంతో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. ఏపీ నుంచి కోళ్లను తమ రాష్ట్రంలోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 24 చెక్‌పోస్టులు పెట్టిన అధికారులు.. ఏపీ నుంచి కోళ్ల లోడుతో వచ్చే వాహనాలను వెనక్కి పంపుతున్నారు. కాగా, బర్డ్‌ ఫ్లూ భయంతో తెలంగాణలో చికెన్‌, గుడ్లు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.

Updated Date - Feb 12 , 2025 | 05:10 AM