Belt shops : ఎన్టీఆర్ జిల్లాలో బెల్ట్ షాపుల హవా.. బడ్డీకొట్లలో భారీగా మద్యం అమ్మకాలు
ABN , Publish Date - Sep 04 , 2025 | 08:56 AM
ఎన్టీఆర్ జిల్లాలో అనధికార బెల్ట్ షాపుల హవా నడుస్తోంది. బడ్డీకొట్ల ముసుగులో భారీగా మద్యం అమ్మ కాలకు తెరలేపుతున్నారు. అధికారులు సహకరిస్తుండటంతో నిన్న, మొన్నటి వరకు ఇళ్లలో రహస్యంగా నిర్వహించిన బెల్ట్ షాపులు నేడు..
బెల్ట్ తీశారు..!
పశ్చిమ ఎన్టీఆర్ జిల్లాలో యథేచ్ఛగా బెల్ట్ షాపుల నిర్వహణ
గ్రామగ్రామాన పుట్టగొడుగుల్లా వెలుస్తున్న షాపులు
బడ్డీకొట్ల ముసుగులో మందు బాటిళ్ల అమ్మకాలు
మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు
శివారు గ్రామాల్లో సిట్టింగ్ ఏర్పాట్లు కూడా..
నాలుగు నెలలుగా ఆగిపోయిన అధికారుల దాడులు
ప్రజల్లో తీవ్రమవుతున్న వ్యతిరేకత
జగ్గయ్యపేట నియోజకవర్గంలో రోడ్డెక్కి నిరసన
ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం/నందిగామ: ఎన్టీఆర్ జిల్లాలో అనధికార బెల్ట్ షాపుల హవా నడుస్తోంది. బడ్డీకొట్ల ముసుగులో భారీగా మద్యం అమ్మ కాలకు తెరలేపుతున్నారు. అధికారులు సహకరిస్తుండటంతో నిన్న, మొన్నటి వరకు ఇళ్లలో రహస్యంగా నిర్వహించిన బెల్ట్ షాపులు నేడు యథేచ్ఛగా సాగుతున్నాయి. విచ్చలవిడి బెల్ట్ షాపులపై ప్రజలు తిరుగుబాటు చేస్తుండగా, అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
మైలవరం, తిరుపూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో అనధికార బెల్ట్ షాపులు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. గ్రామగ్రామాన కనీసం 5 నుంచి 10 బెల్ట్ షాపులు ఉంటున్నాయి. ఒక్కో షావు నుంచి రూ.5 వేలు-రూ.10 వేల వరకు ఎక్సైజ్ శాఖకు మామూళ్లు అందుతున్నట్లు తెలుస్తోంది. అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లు కూడా తమ వద్ద గుంజుతున్నారని మందుబాబులు చెబుతున్నారు. ఒకప్పుడు బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి, కేసులు పెట్టి, తహసీల్దార్ల ఎదుట హాజరుపరిచి బైండోవర్ కేసులు పెట్టేవారు. దాడులకు ముందే బెల్ట్ నిర్వహకులకు ముందస్తు సమాచారం ఇచ్చి, ఒకటి లేదా రెండు మద్యం సీసాలు పట్టుకుని, నామమాత్రపు అపరాధ రుసుం విధించి, వారికి కావాల్సింది తీసుకుని వెళ్లిపోయేవారు. ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు మారారు. బెల్ట్ షాపులు లేకుంటే సారా మహమ్మారి విజృంబిస్తోందంటూ ఎక్సైజ్ అధికారులే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అందరికీ మామూళ్లు
నందిగామ స్టేషన్ పరిధిలో నందిగామ, చందర్లపాడు, పెనుగంచిప్రోలు మండలాల్లో మొత్తం 16 షాపులు ఉన్నాయి. ఈ షాపుల పరిధిలో 150 వరకూ బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ నాలుగైదు షాపులు నడుస్తున్నాయి. బెల్ట్ షాపుల నిర్వాహకుల దగ్గర కొందరు అధికార పార్టీ నాయకులు సైతం మామూళ్లు వసూలు చేస్తున్నారు. దీంతో నిర్వాహకులు వారికి ఇష్టం వచ్చిన ధరకు అమ్మకాలు జరుపుతున్నారు. గ్రామాల్లో ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి దిగి గొడవలు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జగ్గయ్యపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు మండలాలు ఉన్నాయి. అక్కడ మొత్తం 7 షాపులు ఉండగా, 100కు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. వత్సవాయి మండలంలో కూడా బెల్ట్ షాపులను ధైర్యంగా నిర్వహిస్తున్నారు.
గ్రామాల్లో ఆందోళనలు
గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బెల్ట్ షాపుల వల్ల ఎక్కడపడితే అక్కడ మందు ఏరులై పారుతోంది. దీంతో ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అశాంతి నెలకొంటోంది. జగ్గయ్యపేట నియోజక వర్గంలోని 'షేర్ మహమ్మద్ పేట గ్రామ సచివాలయం ఎదుట ఉన్న బెల్టు షాపును తీసేయాలని మహిళలు, ప్రజలు రోడ్డుపై నిరసన తెలిపారు.
ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలోనే సరఫరా
నాలుగు నెలలుగా ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపులపై దాడులు చేయడమే మానేశారు. నెల నెలా మామూళ్లు చెల్లించే బెల్ట్ షాపు నిర్వహకులకు వారు అభయమిచ్చినట్లు తెలిసింది. పార్టీలతో పని లేకుండా, ఎవరైతే మామూళ్లు సక్రమంగా ముట్టజెబుతారో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకును వారే సరఫరా చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News