Polavaram project : కొత్త డయాఫ్రమ్ వాల్
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:11 AM
దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656 మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించేందుకు రూ.990 కోట్ల వ్యయం అవుతుందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు

అంచనా వ్యయం 990 కోట్లు
జల వనరుల శాఖ ఆమోదం
పెరిగిన భారం 596 కోట్లు
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656 మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించేందుకు రూ.990 కోట్ల వ్యయం అవుతుందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు నరసింహమూర్తి సమర్పించిన అంచనాకు రాష్ట్ర జల వనరుల శాఖ ఆమోదం తెలిపింది. గతంలో నిర్మించిన డయాఫ్రమ్‌వాల్‌కు రూ.446 కోట్ల వ్యయం అయ్యింది. అయితే 2020లో వరదలకు ఇది దెబ్బతినడంతో 29,585 మీటర్ల మేర మరమ్మతులు చేసేందుకుగానూ రూ.393.32 కోట్లకు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ ఆమోదించింది. ఆ తర్వాత డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంపై ఎడతెగని సమీక్షలు జరిగాయి. కేంద్ర జలసంఘం అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని నియమించింది. సమగ్ర అధ్యయనం తర్వాత పాతదానికి సమాంతరంగా కొత్తవాల్‌ను నిర్మించాలని ఈ బృందం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర జలసంఘానికి సిఫారసు చేసింది. పాత డయాఫ్రమ్‌వాల్ మరమ్మతుకు రూ.393.32 కోట్ల వ్యయం అవుతుందని అంచనావేయగా.. టీ-16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వాడటం ద్వారా 63,656 మీటర్ల మేర సమాంతర కొత్త డయాఫ్రమ్‌వాల్ వేసేందుకు రూ.990కోట్లు వ్యయం అవుతుందని వెల్లడించారు. ఈ వ్యయానికి కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ సూత్రప్రాయ ఆమోదం ఉంది. దీంతో అంచనా వ్యయంతో కొత్త డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మిస్తున్నట్లుగా కేంద్రానికి వివరిస్తూ.. అధికారికంగా ఆమోదం తీసుకోవాలని పోలవరం ఇంజనీరింగ్ అధికారులకు ప్రభుత్వం సూచించింది.
రేపు పరిశీలనకు అంతర్జాతీయ నిపుణులు
కొత్త డయాఫ్రమ్‌వాల్ పనులను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందంలోని అమెరికాకు చెందిన డియాన్ ఫ్రాన్‌కో డి కికో, డేవిడ్ బి పాల్ శనివారం పోలవరానికి రానున్నారు. అలాగే కెనడాకు చెందిన మరో ఇద్దరు నిపుణులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతారని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News