AP CM Chandrababu: అన్ని నదులు అనుసంధానిస్తా.. కరవన్నదే లేకుండా చేస్తా: చంద్రబాబు
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:15 PM
రాష్ట్రంలో ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నీటిని సమర్థంగా నిర్వహిస్తే ఏ జిల్లాలోనూ కరవు అనే మాట రాదని పేర్కొన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నీటిని సమర్థంగా నిర్వహిస్తే ఏ జిల్లాలోనూ కరవు అనే మాట రాదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం ద్వారానే నీటి కొరత లేకుండా ఉంటుందని, వ్యవసాయానికి లాభం కలుగుతుందని తాను బలంగా నమ్ముతానని చంద్రబాబు అన్నారు. ఇవాళ(శుక్రవారం) ఆయన అసెంబ్లీలో అనేక అంశాలపై మాట్లాడారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాని అనుసంధానం చేశామని, రాష్ట్రంలో ఉన్న అన్ని నదులనీ అనుసంధానిస్తామని హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా తెలిపారు.
సరైన నీటి వినియోగంతో రాష్ట్రంలో 700 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని చంద్రబాబు చెప్పారు. పదేళ్లలో 439 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చామని, డిసెంబరు 25 నాటికి పోలవలం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కుప్పం ప్రాంతానికి నీళ్లు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైందని ఆనందం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధార వరకూ నీళ్లు తరలించవచ్చన్న చంద్రబాబు.. రూ.960 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అక్టోబరులోనే అనకాపల్లి వరకు ఈ జలాలు తీసుకొస్తామన్నారు. రూ.1425 కోట్లతో ఈ ప్రాజెక్టును పోలవరం కుడి కాలువతో అనుసంధానించామని చంద్రబాబు వెల్లడించారు.
శ్రీశైలంలో నిల్వ చేసిన నీళ్లు సీమ, హంద్రీనీవా, గాలేరు-నగరికి.. మల్యాల నుంచి కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా జలాలు తరలించామని చంద్రబాబు చెప్పారు. పులివెందులలోని చెరువులకూ నీళ్లందించామని, హంద్రీనీవా ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా 40 టీఎంసీల నీళ్లు తరలించగల్గుతున్నామని చంద్రబాబు అన్నారు.
Also Read:
జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..
అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో మృతి
For More Latest News