Share News

Central Govt: రాష్ట్రానికి వెయ్యి కోట్లు

ABN , Publish Date - Feb 26 , 2025 | 03:55 AM

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల(సీఎస్ఎస్)ను ఉపయోగించుకొని రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామన్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

Central Govt: రాష్ట్రానికి వెయ్యి కోట్లు

  • ఎస్‌ఏఎస్‌ కింద కేంద్రం నుంచి నిధులు

  • మార్చి మొదటి వారంలో ఖాతాకు జమ

  • రెవెన్యూ ఆధునీకరణకు రూ.397 కోట్లు

  • వ్యవసాయ రంగానికి రూ.605 కోట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల(సీఎస్ఎస్)ను ఉపయోగించుకొని రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామన్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం(సీఎస్ఎస్)కింద ఏపీకి కేంద్రం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. మార్చి మొదటివారంలో ఈ నిధులు రెవెన్యూ, వ్యవసాయ పద్దుల కింద రాష్ట్ర ఖాతాలో జమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని మౌలిక వసతుల కల్పనకు వాడుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం కోటాలో గ్రామీణ రెవెన్యూ రికార్డుల ఆధునికీకరణ ప్రాజెక్టు కింద డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ దేశంలోని ఆరు రాష్ట్రాలకు రూ.615 కోట్లు కేటాయించింది. అందులో ఒక్క ఏపీకే రూ.397 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం(ఎ్‌సఏఎస్‌) కింద ఈ నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగానికి కేంద్ర భూ వనరుల విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ నవాల్‌సింగ్‌ మీనా లేఖ రాశారు. ఈ ప్రతిపాదనకు వ్యయ విభాగం ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే, డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొగ్రామ్‌(డీఐఎల్‌ఆర్‌ఎంపీ) కింద వచ్చే నిధులను రెవెన్యూ రికార్డుల ఆధునికీకరణ, ఆధునిక రికార్డ్‌ రూమ్‌ల ఏర్పాటు, భూమి రికార్డుల డిజిటలైజేషన్‌, భూములకు అక్షాంశ, రేఖాంశాలతో కూడిన పొజిషన్‌తో పాటు 12 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయించడానికి వినియోగిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును సీఎ్‌సఎస్‌ కింద కేంద్రం ఇచ్చే నిధులతో సర్దుబాటు చేసుకోవచ్చు. అంటే ముందు ప్రభుత్వం ఖర్చుపెట్టి, ఆ తర్వాత డీఐఎల్‌ఆర్‌ఎంపీ, మరో ప్రాజెక్టు కింద నిధులు క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది.


రాష్ట్రంలోని భూ కమతాలకు 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించడానికి అమలు చేస్తున్న యూలిప్‌ ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ డేటా ఆధారంగా పలు కార్యక్రమాలు చేపట్టడానికి వ్యవసాయ శాఖకు కేంద్రం ప్రత్యేక సాయం కింద రూ.605 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక వినతి మేరకే ఈ మొత్తం మంజూరయినట్లు సమాచారం. మార్చి మొదటి వారంలోగా రాష్ట్రాలకు ఈ నిధులు ఇస్తామని కేంద్రం ప్రాథమిక సమాచారం ఇచ్చింది. కాగా, కేంద్ర భూ వనరుల విభాగం ఇచ్చే ప్రత్యేక సహాయంలో అత్యధికంగా ఏపీకే రూ.397 కోట్లు వస్తున్నాయని రాష్ట్ర సర్వే డైరెక్టర్‌, అదనపు సీసీఎల్‌ఏ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.పి. సిసోడియా, సీసీఎల్‌ఏ జయలక్ష్మిల ప్రత్యేక కృషి, చొరవతోనే ఏపీకి ప్రత్యేక సాయం కింద తొలి పద్దులో భారీగా నిధులు మంజూరయ్యాయని వివరించారు. కేంద్రం ఇచ్చే నిధులతో ఆధునిక రికార్డు రూమ్‌ల నిర్మాణం, గ్రామీణ రెవెన్యూ రికార్డుల ఆధునికీకరణ చేపడతామని చెప్పారు. కేపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కింద తహశీల్దార్‌ ఆఫీసులు, ఇతర రెవెన్యూ కార్యాలయాల నిర్మాణాలకు కేంద్రం అవకాశం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర పథకాల ద్వారా నిధులు తీసుకురావాలని కూటమి సర్కారు సంకల్పించిన తర్వాత తొలిసారిగా రూ.వెయ్యి కోట్లు రావడంపై అధికార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Feb 26 , 2025 | 03:56 AM