Share News

Health Campaign : ప్రతి 100 మందిలో ఒకరికి ‘క్యాన్సర్‌’!

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:17 AM

క్యాన్సర్‌ సంపూర్ణ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్ర్కీనింగ్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షల్లో ప్రతి 100 మందిలో ఒకరు క్యాన్సర్‌ అనుమానితులుగా తేలారు.

Health Campaign : ప్రతి 100 మందిలో ఒకరికి ‘క్యాన్సర్‌’!

  • రాష్ట్రంలో 53 లక్షల మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు

  • 52,221 మంది క్యాన్సర్‌ అనుమానితులు

  • 2019-20లో చికిత్స కోసం ఖర్చు 217 కోట్లు

  • 2023-24 నాటికి 624 కోట్లకు పెరిగిన ఖర్చు

  • సంపూర్ణ నివారణే లక్ష్యంగా స్ర్కీనింగ్‌ పరీక్షలు

అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ సంపూర్ణ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్ర్కీనింగ్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షల్లో ప్రతి 100 మందిలో ఒకరు క్యాన్సర్‌ అనుమానితులుగా తేలారు. కార్యక్రమంలో ఇప్పటివరకూ 53,07,448 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 52,221 మంది క్యాన్సర్‌ అనుమానితులను ఆరోగ్యశాఖ గుర్తించింది. రాష్ట్రంలో గత ఏడాది నవంబరు 14 నుంచి క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పది నెలల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకూ 19,447 మంది నోటి క్యాన్సర్‌, 15,401 మంది రొమ్ము క్యాన్సర్‌, 17,373 మంది గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ అనుమానితులను ఆరోగ్య శాఖ గుర్తించింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ఈ మహమ్మారికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ ద్వారా క్యాన్సర్‌ చికిత్సలకు 2019-20లో రూ.217 కోట్లు ఖర్చు పెట్టగా 2023-24లో రూ.624 కోట్లకు పెరిగిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు వీలుగా ప్రజలందరికి క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 ఏళ్లు పైబడిన వారికి నోటి, రొమ్ము క్యాన్సర్‌, 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ జరుగుతోంది. విస్తృత స్థాయిలో చేపడుతున్న స్ర్కీనింగ్‌లో 155 మంది ప్రత్యేక వైద్యులు, 238 జిల్లా ఆసుపత్రుల నిపుణులు, 3,944 మంది వైద్యాధికారులు, 10,032 మంది సామాజిక ఆరోగ్య అధికారులు భాగస్వాములయ్యారు.

Untitled-3 copy.jpg


ముందుగా ఆశా కార్యకర్తలు కరపత్రాలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎఎన్‌ఎం, సీహెచ్‌వోలు... మహిళలు సర్వైకల్‌ పరీక్షలు చేయించుకొనేలా ప్రోత్సహించారు. ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రం స్థాయిలో జరిపే స్ర్కీనింగ్‌లో వైద్యులు అనుమానిత కేసులను పరిశీలిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. అనుమానిత క్యాన్సర్‌ కేసులను ఉన్నతస్థాయి వైద్య కేంద్రాలకు రిఫర్‌ చేస్తున్నారు. ఇక్కడ, రోగ నిర్ధారణ కోసం వైరల్‌ మార్కర్స్‌తో పాటు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్ధారణ అయిన వారిని ప్రివెంటివ్‌ అంకాలజీ యూనిట్‌కు రిఫర్‌ చేస్తున్నారు. ఆంకాలజీ యూనిట్‌ స్థాయిలో సూపర్‌ స్పెషలిస్ట్‌ సమక్షంలో రోగ నిర్ధారణ, చికిత్స అందిస్తున్నారు. విభిన్న దశల్లో జరిగే ఈ స్ర్కీనింగ్‌ పరీక్షలను ప్రజలందరూ ఉపయోగించుకొని, క్యాన్సర్‌ రహిత సమాజం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకారాన్ని అందించాలని ఆరోగ్య శాఖ అధికారులు పిలుపునిచ్చారు.

Updated Date - Jan 19 , 2025 | 04:17 AM