AP News: వారి తప్పిదం.. ప్రతిభావంతుడికి తీవ్ర అన్యాయం
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:46 PM
జిల్లా స్పోర్ట్స్ అధికారుల తప్పిదంతో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఓ నిరుద్యోగి ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. ఒకరి స్పోర్ట్ సర్టిఫికెట్‌ను అదే పేరుగల మరో వ్యక్తికి గుట్టుచప్పుడు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్‌తో డీఎస్సీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవటం.. సర్టిఫికెట్ల పరిశీలనలో బ్యాకప్ సర్టిఫికెట్లును అధికారులు అడగటంతో అసలు విషయం కాస్త వెలుగుచూసింది.
- సర్టిఫికెట్ తారుమారు..
- జిల్లా స్పోర్ట్స్ అధికారుల తప్పిదం
- ప్రతిభావంతుడికి తీవ్ర అన్యాయం
- డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన బయటపడిన వైనం
- అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ఒక్క ఐడియా జీవితానే మార్చివేస్తుంది.. ఒక్క చెత్త ఐడియా ఎందరో జీవితాలను నాశనం చేస్తుంది.. ఇలాంటి ఓ ఆలోచనతోనే జిల్లా స్పోర్ట్ అధికారులు వ్యవహరించడంతో ఓ ప్రతిభావంతుడైన క్రీడాకారుడు ఉద్యోగాన్ని కోల్పోయాడు. క్రీడల్లో ప్రతిభను చాటుతూ ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాడు గొల్ల రామాంజనేయులు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొన్నాడు. ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాడు. డీఎస్సీలో ఉద్యోగం పొందేందుకు జాతీయ స్థాయి సర్టిఫికెట్ లేకపోవడంతో మిన్నకుండిపోయాడు. కానీ అసలు అతడి సర్టిఫికెట్ అదే పేరు ఉన్న ఓ కేటుగాడి చేతిలోకి వెళ్లింది. దీంతో ఉద్యోగం పొందాలనుకొని సర్టిఫికెట్ల పరిశీలనలో దొరికిపోయాడు.. దీనికి సంబంధించిన వివరాలు..
ఎమ్మిగనూరు(కర్నూలు): జిల్లా స్పోర్ట్స్ అధికారుల తప్పిదంతో ఎమ్మిగనూరు(Emmiganoor) పట్టణానికి చెందిన ఓ నిరుద్యోగి ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. ఒకరి స్పోర్ట్ సర్టిఫికెట్‌ను అదే పేరుగల మరో వ్యక్తికి గుట్టుచప్పుడు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్‌తో డీఎస్సీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవటం.. సర్టిఫికెట్ల పరిశీలనలో బ్యాకప్ సర్టిఫికెట్లును అధికారులు అడగటంతో అసలు విషయం కాస్త వెలుగుచూసింది.
బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న గొల్ల రామాంజనేయులు ఇంటర్మీడియట్ చదివి యూజీపీడీ కోర్సును పూర్తిచేశాడు. మొదటి నుంచి రన్నింగ్‌లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కర్నూలులో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. 2015లో కడపలో జరిగిన రాష్ట్రస్థాయిలో జరిగిన క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభకనబరచి మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించాడు.
2016లో పూణేలో జరిగిన జాతీయస్థాయి 50 అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని 19వ స్థానంలో నిలిచాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు స్పోర్ట్ కోటాలో డీఎస్సీ (పీఈటీ పోస్టుకు)కి నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. గొల్ల రామాంజనేయులుకు జాతీయ స్థాయి సర్టిఫికెట్ అధికారులు ఇవ్వకపోవటంతో డీఎస్సీలో దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయాడు.
అథ్లెటిక్స్‌లో పాల్గొనని అదేపేరు ఉన్న మరో వ్యక్తికి..
ఎన్నడూ అథ్లెటిక్స్‌లో పాల్గొనని అదేపేరు ఉన్న మరో వ్యక్తికి అధికారులు గుట్టుచప్పుడు కాకుండా జాతీయ స్థాయి సర్టిఫికెట్‌ను ఇచ్చారు. దీంతో సదరు వ్యక్తి నేరుగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసం జాతీయస్థాయి సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీని మార్చి దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన పేరు మెరిట్ లిస్టులో వచ్చింది. ఇటీవల విజయవాడలో జరిగిన సర్టిఫికెట్ల పరిశీలన సందర్భంగా అధికారులు సదరు వ్యక్తిని గతంలో అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారు.
సర్టిఫికెట్ల కోసం మభ్యపెట్టే ప్రయత్నం..
అతని దగ్గర ఆ సర్టిఫికెట్లు లేకపోవటంతో ఎలాగైనా ఉద్యోగాన్ని పొందాలన్న తలంపుతో అసలైన అథ్లెటిక్ గొల్ల రామాంజనేయులును ఆశ్రయించి సర్టిఫికెట్ల కోసం మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో అసలు విషయం బయట పడింది. తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు గొల్ల రామాంజనేయులు ఫిర్యాదు చేశాడు. ఒకరి ప్రతిభకు సంబంధించిన సర్టిఫికెట్లను మరొకరికి కట్టబెట్టిన సంబంధిత అధికారులపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని క్రీడాకారులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News