AP Liquor Scam Updates: రూ.175కోట్ల విలువైన బంగారు నాణేలు ఎవరి కోసం?.. బ్లాక్ మనీని వైట్‌గా మార్చి..
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:08 PM
ఏపీ లిక్కర్ స్కాంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టి, పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఢిల్లీలో గత పది రోజులుగా ఈడీ ( Enforcement Directorate), ఆదాయ పన్ను శాఖ (Income Tax) అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు మూడు ఛార్జిషీట్‌లు దాఖలు చేసిన అంశంపై ఆరా తీశారు. కాగా, నాలుగు రోజులు క్రితం ED అధికారులు విజయవాడ వచ్చి సిట్ అధిపతి రాజశేఖర్ బాబుతో చర్చలు జరిపారు. మూడు ఛార్జిషీట్లు, షెల్ కంపెనీల వివరాలు, సీజ్ చేసిన స్థిర, చరాస్తుల వివరాలను ED అధికారులు సేకరించారు. ఆ తర్వాత గురువారం నాడు ఏక కాలంలో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్ లోని ARETA ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, NR ఉద్యోగ LLP, సువర్ణ దుర్గ బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై నిన్న దాడులు చేశారు. అలాగే సికింద్రాబాద్ లోని రావు సాహెబ్ బూరుగు మహదేవ్ జ్యువెల్లరీస్ సహా మరో కంపెనీలో ఈడీ అధికారులు ఇవాళ ఉదయం సోదాలు చేపట్టారు. అంతేకాకుండా, చెన్నైలోని MS మోహన్ లాల్ జ్యువెల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పైనా దాడులు చేశారు. అయితే, ఈ దాడుల్లో హైదరాబాద్ లోని మహదేవ్ జ్యువెల్లరీస్, చెన్నైలోని బంగారం షాపుల్లో కీలక డేటాను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కొంతమందికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకు GST బిల్లులు జారీ చేసి చెల్లింపులు జరిపినట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. దానికి సంబంధించిన కీలక డేటాను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.175కోట్ల విలువైన బంగారు నాణేలు ఎవరి కోసం కొనుగోలు చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డేటా, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. పూర్తి నివేదికను ఢిల్లీలో ఉన్న ఉన్నతాధికారులకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. నివేదికను పూర్తిస్థాయిలో రూపొందించి పంపే సమయంలో సిట్ ను ఈడీ అధికారులను సంప్రదిస్తున్నారు.
మద్యం కుంభకోణంలో కొన్ని లావాదేవీలపై ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. ఈ రోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సోదాలు పూర్తి కావడంతో ED అధికారులు నివేదికను రూపొందించే పనిలో పడ్డారు. అయితే, ఈడీ దాడులు ప్రారంభం కావడంతో నిన్నంతా తాడేపల్లి ప్యాలెస్‌లో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సోదాలు పూర్తి కావడంతో బెంగళూరుకు వైసీపీ అధినేత జగన్ వెళ్లారని తెలుస్తోంది.
Also Read:
జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..
అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్‌లో మృతి
For More Latest News