AP Govt: టీచర్ల బదిలీలకు చట్టం
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:56 AM
టీచర్ల బదిలీలు నిర్దేశిత సమయంలో వివాదరహితంగా జరగాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఉపాధ్యాయ బదిలీల చట్టం తీసుకొస్తోంది.
ఏటా వేసవిలోనే బదిలీల ప్రక్రియ.. ఐదేళ్లు దాటితే తప్పనిసరి బదిలీ
నాలుగు కేటగిరీల్లో ప్రాధాన్యతా పాయింట్లు
టీచర్ల పనితీరుకూ ప్రత్యేకంగా కేటాయింపు
ముసాయిదా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే సభలో బిల్లు
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళానికి ముగింపు పలకడానికి రంగం సిద్ధమైంది. టీచర్ల బదిలీలు నిర్దేశిత సమయంలో వివాదరహితంగా జరగాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఉపాధ్యాయ బదిలీల చట్టం తీసుకొస్తోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, సుదీర్ఘంగా కసరత్తు చేసిన పాఠశాల విద్యాశాఖ... శనివారం ముసాయిదాను విడుదల చేసింది. దీనికి ‘ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీ నియంత్రణ చట్టం-2025’ అని పేరు పెట్టింది. ఈ నెల 7వరకు దీనిపై సూచనలు ఆన్‌లైన్‌లో పంపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు కోరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును సభలో ప్రవేశపెడతారు. దానికి ఆమోదం లభించినగానే ఈ విద్యా సంవత్సరం నుంచే బదిలీల చట్టం అమల్లోకి వస్తుంది. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో మాత్రమే టీచర్ల బదిలీలు జరుగుతాయి. అలాగే వివిధ అంశాలపై న్యాయవివాదాలు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. నిర్దేశిత సమయంలో బదిలీల ప్రక్రియ పూర్తవడం వల్ల విద్యాసంవత్సరంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.
చట్టంలోని అంశాలివీ...
బదిలీలకు విద్యా సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక స్టేషన్‌లో ప్రధానోపాధ్యాయుడు/ ఉపాధ్యాయుడు 9నెలలు దాటి పనిచేస్తే దానిని ఒక విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. ఒకేచోట ఐదేళ్లు దాటిన హెచ్‌ఎంలకు, 8ఏళ్లు దాటిన టీచర్లకు బదిలీ తప్పనిసరి. ఒక పాఠశాలలో కనీసం రెండేళ్లు పని చేస్తే బదిలీలకు అర్హుల జాబితాలోకి వస్తారు. బదిలీలకు ప్రాంతాల వారీగా నాలుగు కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ-1లో జిల్లా కేంద్రాలు, నగర కార్పొరేషన్, ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాలు, కేటగిరీ-2లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కేటగిరీ-3లో మండల కేంద్రాలు, రోడ్డు సదుపాయం కలిగిన గ్రామాలు, కేటగిరీ-4లో రోడ్డు సదుపాయం లేని గ్రామాలు, కొండ ప్రాంతాలు ఉంటాయి. టీచర్ల మొదటి నియామకం లేదా హెచ్‌ఎంగా పదోన్నతి పొందిన తర్వాత మొదటి పోస్టింగ్‌ను 3, 4 కేటగిరీ ప్రాంతాల్లో ఇస్తారు. బదిలీల సమయానికి రెండేళ్లలోపు మాత్రమే సర్వీసు ఉన్నవారిని కోరుకుంటేనే బదిలీ చేస్తారు. 50ఏళ్ల కంటే తక్కువ వయసున్న హెచ్‌ఎంలు, టీచర్లు బాలికల ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తుంటే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. బాలికల ఉన్నత పాఠశాలలకు మహిళా హెచ్‌ఎంలు, టీచర్లను నియమిస్తారు. వారు అందుబాటులో లేకపోతే 50ఏళ్లు దాటిన పురుష టీచర్లను నియమిస్తారు. లైంగిక నేరాలు, బాలికల అంశాల్లో ఆరోపణలున్న పురుష టీచర్లకు బాలిక ఉన్నత పాఠశాలల్లో పోస్టింగ్ ఇవ్వరు. హెచ్‌ఎంలు, టీచర్లపై నమోదైన అభియోగాలు పెండింగ్‌లో ఉంటే బదిలీలకు పరిగణలోకి తీసుకోరు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీల ప్రక్రియను నిర్వహిస్తారు.
ప్రాధాన్యతా పాయింట్ల కేటాయింపు ఇలా..
ప్రస్తుత పాఠశాల ప్రామాణికంగా కేటగిరీ-1లో ఉన్న టీచర్లకు ఏడాదికి ఒక పాయింట్, కేటగిరీ-2లో ఉన్నవారికి 2 పాయింట్లు, కేటగిరీ-3లో ఉన్నవారికి 3 పాయింట్లు, కేటగిరీ-4లో ఉన్నవారికి ఏడాదికి 5 పాయింట్లు ఇస్తారు. బదిలీలు జరిగే సంవత్సరం మే 31 నాటికి అన్ని కేడర్లలో కలిపి సర్వీసులోని ప్రతి సంవత్సరానికి ఒక పాయింట్ ఇస్తారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వామి అయిన టీచర్లకు ప్రత్యేక పాయి ట్లు లభిస్తాయి. 40ఏళ్లు దాటిన అవివాహిత మహి ళా టీచర్లు, దివ్యాంగులు, గుర్తించిన వ్యాధులు కలిగినవారు, వితంతువులు, ఒంటరి మహిళలు, మాజీ సైనికుల జీవిత భాగస్వాములు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌గా పనిచేస్తున్న వారికీ ప్రత్యేక పాయింట్లు ఉం టాయి. అలాగే టీచర్ల పనితీరు ఆధారంగా కూడా పాయింట్లు కేటాయిస్తారు. అనధికారికంగా విధులకు హాజరు కానివారికి గైర్హాజరైన ప్రతి నెలకు ఒక పాయింట్ చొప్పున గరిష్ఠంగా 10 ప్రతికూల పాయింట్లు ఇస్తారు.
టీచర్ల సర్దుబాటు
మిగులు టీచర్లను అవసరం మేరకు సర్దుబాటు చేస్తారు. సెక్షన్-7 ప్రకారం సంవత్సరంలో ఒకసారి మాత్రమే సాధారణ బదిలీలు చేస్తారు. ఏటా బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందికి సమానమైన పాయింట్లు వస్తే కేడర్‌లో సీనియారిటీ, పుట్టిన తేదీ, మహిళలను ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటా రు. విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్లకు జనా భా లెక్కలు, విపత్తుల సమయంలో సహాయ పనులు, ఎన్నికల విధులు తప్ప ఇంకేవీ కేటాయించరు. ఈ చట్టం విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూళ్లు, గురుకుల సొసైటీలు, కేజీబీవీలకు వర్తించదు.