AP High Court: గ్రామసభలు తీర్మానించిన పనులకే అనుమతి ఇచ్చారా
ABN , Publish Date - May 01 , 2025 | 05:04 AM
విజయనగరం జిల్లాలో ఉపాధి పనులకు అనుమతులు గ్రామసభల తీర్మానాల ప్రకారమా లేక ఎమ్మెల్యే సిఫారసుల ప్రకారమా అన్న దానిపై హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్ పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఎమ్మెల్యే సిఫారసు మేరకు నడుచుకున్నారా?
పూర్తి వివరాలు మా ముందు ఉంచండి
పంచాయతీరాజ్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఉపాధి పథకంలో గ్రామసభలు తీర్మానించిన పనులకే పరిపాలన అనుమతులు ఇచ్చారా? లేక ఎమ్మెల్యే సిఫారసఉ మేరకు నడుచుకున్నారా? అని అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌ను ఆరా తీసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటిరవితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు ఇచ్చింది. విజయనగరం మండలంలో ఉపాధి హామీ పనుల విషయంలో గ్రామసభలు చేసిన తీర్మానాన్ని పక్కనపెట్టి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేసిన సిఫార్సులకు కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారంటూ విజయనగరం జిల్లాకు చెందిన లోకల్ గవర్నమెంట్స్ చాంబర్ అధ్యక్షుడు ఎం.అప్పలనాయుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్లమూడి కిరణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ఉపాధి హామీ పథకంలో గ్రామసభలు చేసిన తీర్మానాన్ని పక్కనపెట్టి ఎమ్మెల్యే సిఫారసు చేసిన పనులకు కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇలా చేయడం ఉపాధి చట్టం నిబంధనలకు విరుద్ధమన్నారు. అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపిస్తూ గ్రామసభ చేసిన తీర్మానానికి అనుగుణంగానే కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారని తెలిపారు. గతేడాదే పనులు ప్రారంభమయ్యాయని, పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..