Government Land : ఆ 590 ఎకరాలు వెనక్కి ఇవ్వండి
ABN , Publish Date - Jan 31 , 2025 | 03:58 AM
తిరుపతి జిల్లా మన్నవరం వద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ-బెల్ పరిశ్రమకు కేటాయించిన 590 ఎకరాల విలువైన భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

2009లో తిరుపతి జిల్లా మన్నవరం వద్ద ఎన్టీపీసీ-బెల్‌కు 620 ఎకరాల కేటాయింపు
ఇందులో వినియోగించింది 30 ఎకరాలే.. మిగిలిన భూములు 15 ఏళ్లుగా నిరుపయోగం
కొత్త పరిశ్రమలకు ఇవ్వాలని సర్కారు యోచన. ఆ భూముల స్వాధీనానికి సీఎం ఆదేశాలు
వెనక్కి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రం అభ్యర్థన.. ఎన్టీపీసీ-బెల్‌తో అధికారుల చర్చలు
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే సంస్థలకు భూములు కేటాయించేందుకు వీలుగా, గతంలో పరిశ్రమలకు కేటాయించి నిరుపయోగంగా ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా మన్నవరం వద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ-బెల్ పరిశ్రమకు కేటాయించిన 590 ఎకరాల విలువైన భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. 2009లో రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఎక్వి్‌పమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ (ఎన్టీపీసీ-బెల్)కు 620 ఎకరాలను కేటాయించింది. అందు లో 30 ఎకరాల పరిధిలోనే నిర్మాణాలు జరిగాయి. మిగిలిన 590 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని కలెక్టర్ నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. ఇక్కడ బెల్ విస్తరణ జరిగే అవకాశాలు లేవని తేలడంతో ఈ భూములను వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు పరిశ్రమల శాఖను ఆదేశించారు. గత నెల 9న విజయవాడ నుంచి పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త కిషోర్‌లు నోయిడాలోని ఎన్టీపీసీ-బెల్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. నిరుపయోగంగా ఉన్న 590 ఎకరాలను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఎన్టీపీసీ-బెల్ అధికారులను కోరారు. అయితే భూములు వెనక్కి ఇవ్వడమన్నది తమ పరిధిలో లేదని, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో ఆ భూములు తిరిగి అప్పగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర విద్యుత్ శాఖకు ప్రతిపాదనలు పంపుతోంది.
పరిశ్రమల స్థాపనకు వీలుగా..
తిరుపతి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో మన్నవరం భూములను వెనక్కి తీసుకుని కొత్త పరిశ్రమలకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతి-వెంకటగిరి మార్గం లో శ్రీకాళహస్తి మండల పరిధిలో ఉన్న ఈ భూములు వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. కొత్త పరిశ్రమలకు భూములు కేటాయిస్తే జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది.
ఎకరా రూ.20 లక్షలు
ఏర్పేడు- వెంకటగిరి మధ్య 620 ఎకరాల భూమిని కేవలం ఎకరా వంద రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో బెల్‌కి కేటాయించింది. నిజానికి అప్పటికే అక్కడ ఎకరా విలువ లక్షల్లో ఉంది. పరిశ్రమ ఏర్పాటు వల్ల బాగా ప్రయోజనాలుంటాయని ఆశించి భూములిచ్చారు. ఇప్పుడా ప్రాంతంలో భూముల విలువ భారీగా పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో ఎకరా 20 లక్షల దాకా ఉంది. రిజిస్ట్రేషన్ విలువే 8 నుంచి 12 లక్షలు ఉంది. ఈ లెక్కన ఆ భూమి రూ.120 కోట్లకు పైనే విలువ చేస్తుంది.
2010లో శంకుస్థాపన
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో దిగ్గజాలుగా పిలిచే ఎన్‌టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్), బెల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) సంస్థలు రెండూ సంయుక్తంగా భారీ ప్రాజెక్టులు నెలకొల్పే ఉద్దేశంతో ఎన్టీపీసీ-బెల్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఏర్పడ్డాయి. అప్పటి తిరుపతి ఎంపీ చింతామోహన్ కృషితో మన్నవరం గ్రామం వద్ద విద్యుత్ ఉపకరణాల తయారీ ఫ్యాక్టరీ నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం 2008లో నిర్ణయించింది. మొత్తం రూ.6,500 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా వంద వరకూ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయనుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 620 ఎకరాఉ ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది. ఏపీఐఐసీ ద్వారా ఆ భూములను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది. మన్నవరంలో 2010 సెప్టెంబరు 1న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి సీఎం రోశయ్య కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమకు విద్యుత్ సరఫరా కోసం రూ.2.08 కోట్లు చెల్లించింది.
హామీ మరిచిన జగన్
ఈ పరిశ్రమను పూర్తి చేయిస్తామని పాదయాత్రలోనూ, 2014 ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పటికీ మన్నవరం పరిశ్రమపై దృష్టి పెట్టలేదు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఒకటి రెండు సార్లు లోక్‌సభలలో ప్రస్తావించారు. మాజీ ఎంపీ చింతామోహన్ తరచూ అనేక ప్రాంతాల్లో ఈ పరిశ్రమను పూర్తి స్థాయిలో నెలకొల్పాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.
పదిహేనేళ్లుగా కదలని పరిశ్రమ
శంకుస్థాపన తర్వాత పరిశ్రమ నిర్మాణం మందకొడిగా మొదలైంది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన రూ.6,500 కోట్లలో ఎన్‌టీపీసీ, బెల్ చెరో రూ.వంద కోట్లే విడుదల చేశాయి. ఆ నిధులతో పరిపాలనా భవనం, యాష్ ప్లాంట్, కొంత ప్రహరీ నిర్మించారు. పరిశ్రమ అసలు ఉద్దేశమైన విద్యుత్ పరికరాలు, ఉపకరణాల తయారీ ప్లాంట్లు మాత్రం ఏర్పాటు కాలేదు. గత పదిహేనేళ్లుగా పరిశ్రమ నిర్మాణం అదే దశలో ఆగిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News