Share News

AP Govt: వంశీ అక్రమాలపై సిట్‌

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:41 AM

తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల ఎస్పీలు నరసింహ కిశోర్‌,ప్రతాప్‌ శివకిశోర్‌తో కూడిన ఐపీఎస్‌ అధికారుల బృందం (సిట్‌) వంశీ దోపిడీని వెలికి తీయబోతోంది.

AP Govt: వంశీ అక్రమాలపై సిట్‌

  • ఐజీ అశోక్‌ నేతృత్వంలో ఏర్పాటు

  • సభ్యులుగా తూర్పు, ఏలూరు ఎస్పీలు

  • సీఐడీ డీజీ అయ్యన్నార్‌ పర్యవేక్షణ

  • ఇప్పటికే సర్కారుకు విజిలెన్స్‌ నివేదిక

  • అక్రమ మైనింగ్‌లోనే 195 కోట్ల లూటీ

  • భూ కబ్జాలు, అరాచకాలపైనా దర్యాప్తు

  • 3 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు ఓకే

  • మరో ముగ్గురు నిందితుల అరెస్ట్‌

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఐజీ ర్యాంకు అధికారి జీవీజీ అశోక్‌ కుమార్‌(ఏలూరు రేంజ్‌) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల ఎస్పీలు నరసింహ కిశోర్‌,ప్రతాప్‌ శివకిశోర్‌తో కూడిన ఐపీఎస్‌ అధికారుల బృందం (సిట్‌) వంశీ దోపిడీని వెలికి తీయబోతోంది. మట్టి, ఇసుక ఇతర అక్రమ మైనింగ్‌ ద్వారా ప్రభుత్వానికి 195 కోట్ల రూపాయల మేర వంశీ నష్టం చేకూర్చినట్లు ఇప్పటికే విజిలెన్స్‌ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా సిట్‌ ఏర్పాటు చేసింది. మొత్తం పర్యవేక్షణ బాధ్యతను సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు అప్పగించింది. దర్యాప్తులో సహకారం, అవసరం నిమిత్తం డీజీపీ ఎవరినైనా సిట్‌లోకి సిఫారసు చేస్తే తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే విజిలెన్స్‌ గుర్తించిన వంశీ అక్రమాల్లో కొన్నింటిని పరిశీలిస్తే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో ఇష్టారాజ్యంగా కొండలను తవ్వేశారు. సన్నిహితులతో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారు. కేవలం పానకాల చెరువు నుంచి అక్రమంగా 100 కోట్ల విలువైన మట్టిని అనుచరులతో తవ్వించి దోచేశారు. ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. విజిలెన్స్‌ వెలికితీసిన వీటితో పాటు బెదిరింపులు, ఇతర అరాచకాలు నిగ్గు తేల్చే బాధ్యత ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. సిట్‌కు అవసరమైన అన్ని సహకారాలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అందించాలని, దర్యాప్తులో భాగంగా సిట్‌ ఎలాంటి రికార్డులు అడిగినా ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దర్యాప్తులో పురోగతిని డీజీపీకి సిట్‌ అధిపతి అందజేయాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - Feb 25 , 2025 | 03:42 AM