AP Govt : రెవెన్యూ అధికారులకు షోకాజ్
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:50 AM
రికార్డులు స్కానింగ్ చేసే సమయంలో మోసపూరితంగా వ్యవహరించిన ఏడుగురు అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం తాజాగా షోకాజ్ నోటీసులు జారీచేసింది.

ఈ నెల 22న విశాఖ జేసీ ఎదుట హాజరుకావాలని కలెక్టర్ ఆదేశాలు
విశాఖలో ప్రభుత్వ భూ రికార్డుల ట్యాంపర్ వ్యవహారంలో కదలిక
విశాఖపట్నం/కొమ్మాది, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో భూముల రికార్డులను స్కానింగ్ చేసి భద్రపరిచే క్రమంలో వాటిని ట్యాంపర్ చేసిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రికార్డులు స్కానింగ్ చేసే సమయంలో మోసపూరితంగా వ్యవహరించిన ఏడుగురు అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం తాజాగా షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ నెల 22న విశాఖపట్నం జాయింట్ కలెక్టర్(జేసీ) ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. రెవెన్యూ రికార్డులు పాడైపోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డులను స్కానింగ్ చేసి భద్రపరచాలని 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విశాఖ రూరల్ మండలంలోని భూముల రికార్డులను సర్వే శాఖ స్కానింగ్ చేసింది. ఈ క్రమంలో 2004 నుంచి 2007 మధ్య స్కానింగ్ చేసేటప్పుడు మధురవాడలో సర్వే నంబర్లు 367, 368, 369, 370, అదేవిధంగా కొమ్మాది, పరదేశిపాలెంలో పలు ప్రభుత్వ భూముల రికార్డులు మార్చేశారు. రెవెన్యూలో కొందరు అఽధికారులు, రియల్టర్లు కలిసి.. రికార్డుల్లో ప్రభుత్వ భూమి బదులు కొందరు వ్యక్తుల పేర్లు నమోదు చేశారు. క్లాసిఫికేషన్‌లో జిరాయితీగా పేర్కొంటూ ట్యాంపర్ చేశారు. తర్వాత సదరు రికార్డుల్లో ఉన్న వ్యక్తులు, వారి తరఫున రియల్టర్లు రంగ ప్రవేశంచేసి భూముల స్వాధీనానికి ప్రయత్నించారు. సర్వే నంబరు 367లో కొన్ని నిర్మాణాలు చేపట్టడంతో అధికారులు అప్రమత్తమై రికార్డులు పరిశీలించినపుడు ట్యాంపరింగ్ చేసినట్టు గుర్తించారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించారు.
దీంతో ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళ్లారు. సుమారు 10 నుంచి 12 ఏళ్ల నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. కాగా, ప్రభుత్వ భూముల రికార్డులు ట్యాంపరింగ్ వ్యవహారంలో 2004 నుంచి 2007 వరకు కలెక్టరేట్‌లోని ఎఫ్-సెక్షన్‌లో పనిచేసిన అధికారులు/ఉద్యోగులు మొత్తం ఏడుగురికి తాఖీదులు ఇచ్చారు. అప్పటి ఎఫ్ సెక్షన్ సూపరింటెండెంట్లగా పనిచేసి ప్రస్తుతం పలుచోట్ల డిప్యూటీ కలెక్టర్లగా ఉన్న పి. ధర్మచంద్రారెడ్డి, ఎస్‌డీ అనిత, డి. ప్రమీలాగాంధీ, కె. సుబ్బారావు సహా ఇతర ఉద్యోగులకు నోటీసులు పంపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..